Editorial : హిందువులకు మబ్బు వీడిందా.. లేక మతం అనే మత్తు ఎక్కిందా..

అది 1947కు ముందు.. భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించే రోజులు.. మాకు ప్రత్యేక దేశం కావాలని ముస్లిం వర్గం పట్టుబట్టడంతో మొదలైంది అసలైన మత యుద్ధం. భారతానికి వాయవ్య దిశన ఏర్పడ్డ పాకిస్థాన్ అనే ‘మత’పుటేనుగు అక్కడి వీధుల్లో రక్తపుటేర్లు పారించింది.

saffron india

ప్రతీకాత్మక చిత్రం

బురఖా తీయిస్తే విద్వేషం..

తాళి తీయిస్తే లౌకికత్వం..

తకియా పెడితే ఆచారం..

బొట్టు పెడితే మతవాదం..

ప్రైస్ ది లార్డ్ అంటే అభివాదం..

జైశ్రీరాం అంటే అపవాదం..

షేడ్ హ్యాండ్ ఇస్తే నాగరికం..

నమస్కారం పెడితే అనాగరికం..

ఇలాంటి ధోరణుల వల్లే హిందువుల్లో కోపం..

లౌకికవాద పార్టీలపై పెరుగుతున్న అసహనం..

మబ్బులు వీడి హిందువుల జాగృతం..

జనాల మధ్య స్పష్టమైన వేర్పాటువాదం..

అది 1947కు ముందు.. భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించే రోజులు.. మాకు ప్రత్యేక దేశం కావాలని ముస్లిం వర్గం పట్టుబట్టడంతో మొదలైంది అసలైన మత యుద్ధం. భారతానికి వాయవ్య దిశన ఏర్పడ్డ పాకిస్థాన్ అనే ‘మత’పుటేనుగు అక్కడి వీధుల్లో రక్తపుటేర్లు పారించింది. భాయీ-భాయీ అన్నవారే తోటి అన్నదమ్ముల కంఠాలు కోశారు. అక్కాచెల్లెళ్ల మాన ప్రాణాలు తీశారు. ఎంతోమంది హిందువులు పొట్ట చేతబట్టుకొని పారిపోవాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వస్తూనే హిందూ-ముస్లింల మధ్య స్పష్టమైన విభజన ఏర్పడింది. అలా ఏర్పడ్డ విభజన 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ విభజించు పాలించు అన్నట్టుగానే కొనసాగుతోంది. అవసరం ఉన్నప్పుడు, అవసరమైన పాలకులు.. ఈ అగాథాన్ని పెద్దది చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మెజారిటీగా ఉన్న హిందువులు.. తాము వివక్షకు గురవుతున్నామని గుర్తించారు. తమలో తమకే అభద్రతా భావం కలుగుతోందని తెలుసుకున్నారు. ఆ అభద్రతా భావానికి కారణం లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న అలౌకిక పార్టీలేనని గ్రహించారు. సాధారణంగా మైనారిటీలు గొంతెత్తుతారు.. తమ హక్కులను కాలరాస్తున్నారని. కానీ, ఒక్క భారతదేశంలోనే మెజారిటీ ప్రజలే గోడు వెల్లబోసుకుంటున్నారు.. తమ హక్కులను హరిస్తున్నారని. కేవలం హిందూ వ్యతిరేక విధానాలే లౌకిక విధానాలా? అన్న ప్రశ్న హిందువుల మస్తిష్కాన్ని తొలిచింది. వాస్తవానికి పక్కింటివాళ్లకు ఏం జరిగినా ఫరవాలేదు.. మాకు ఇబ్బందైతే లేదు అనుకునే రకం హిందువులు. అలాంటిది ఏదో ఒక పార్టీ వచ్చి.. హిందూవాదాన్ని రెచ్చగొడితే రెచ్చిపోయే టైప్ కాదు.. పైగా, అవన్నీ టైం వేస్ట్ యవ్వారాలు అనుకునే రకం. అయితే.. లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న పార్టీలు చేసిన తప్పిదాలే.. హిందువుల్లో ఒక రకం మబ్బును తొలగించి, హిందూ మత్తును ఎక్కించాయి, ఎక్కిస్తున్నాయి.

బీఆర్ఎస్‌పై భైంసా ఎఫెక్ట్

2021లో తెలంగాణలోని భైంసాలో జరిగిన అల్లర్లు బీఆర్ఎస్ లౌకికవాదంపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి. గొడవ జరిగింది రెండు వర్గాలకు. పాత్రధారులు, సూత్రధారులు ఇరు వర్గాలు. కానీ.. ఒక్క వర్గం వారినే కేసులు, అరెస్టులు అంటూ ఇబ్బంది పెట్టి, ఇంకో వర్గానికి బుజ్జగింపులు చేపట్టిందనేది అప్పటి బీఆర్ఎస్ సర్కారుపై ఉన్న అపవాదు. అంతకుముందు ఓ సందర్భంలో కేసీఆర్.. ‘హిందూగాళ్లా.. బొందుగాళ్లా’ అని చేసిన వ్యాఖ్యలు హిందువుల్లో కోపాన్ని రగిల్చాయి. ఆ మాట అన్నది హిందువులను ఉద్దేశించి కాదు. ఒక నేతను విమర్శించే క్రమంలో ఆయన నోరు జారారు. ఆ మాట అన్నది తమనేనని హిందువుల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. నిజానికి.. దేశంలోని ప్రస్తుత రాజకీయ నాయకుల్లో గొప్ప ఆధ్యాత్మిక వేత్త, హిందూ ఆచారాలను పక్కాగా పాటించే నేత ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్‌ది ఫస్ట్ ప్లేస్. ఆయన చేసినన్ని యజ్ఞాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏ రాజకీయ నేత కూడా చేయలేదు. పైగా, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం ఆయనలోని ఆధ్యాత్మికతకు ప్రతిరూపం. అయితే, భైంసా పరిస్థితులు చాలా మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. కాస్తో కూస్తో హిందువుగా జీవించేవాళ్లు సైతం.. తీవ్రంగా నొచ్చుకున్నారు. కేసీఆర్ పద్ధతేం బాగోలేదు అని బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. ఆ వ్యతిరేకత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లుగా బీజేపీకి కలిసివచ్చేదే. కానీ, చేజేతులా ఆ పార్టీయే పారేసుకుంది. హస్తం చేతికి అధికారాన్ని అప్పగించింది.

కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేక విధానాలు

బీజేపీ విధానాలను వ్యతిరేకించే హక్కు రాజకీయ పార్టీగా, ప్రతిపక్షంగా కాంగ్రెస్‌కు ఉంది. కానీ, బీజేపీపై కోపాన్ని హిందువులపై చూపిస్తోంది ఆ పార్టీ. లౌకిక పార్టీగా అన్ని మతాలను సమభావంతో చూడాల్సిన విధి ఆ పార్టీ పెద్దలది. కానీ, బీజేపీపై కోపంతో అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించింది. బీజేపీపై కోపంతో మహాకుంభమేళాను వ్యతిరేకించింది. బీజేపీపై కోపంతో వక్ఫ్ సవరణల బిల్లుకు మద్దతు ఇవ్వలేదు. ఇవి కొన్ని ఉదాహరణలే. ప్రతి సందర్భంలో ఆ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని కొందరు హిందువుల్లో బలంగా ముద్రపడింది. ‘అయోధ్య రామమందిరాన్ని దర్శించుకోలె.. హిందువుల గుడి అనా? మహాకుంభమేళాలో స్నానం ఆచరించలె.. హిందువుల ఆచారమనా?’ అని ఆ పార్టీని నిలదీస్తున్నారు. తాజాగా వక్ఫ్ సవరణల బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం కూడా వారిలో కోపాన్ని మరింత పెంచింది.

కాంగ్రెస్‌తో పొత్తు శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)పై..

శివసేన అంటేనే హిందూత్వ పార్టీ. హిందూత్వం కోసమే పుట్టిన పార్టీ. కానీ, ఆ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే శివసేన సానుభూతిపరుల్లోనూ తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. హిందూ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమా? అని ఆశ్చర్యపోయారు. ఆ పార్టీ నిర్ణయాన్ని యావత్తు మరాఠా సమాజం వ్యతిరేకించింది. కానీ, రాజకీయ యావలో ఉద్ధవ్ ఠాక్రేకు అవేమీ కనిపించలేదు.. అధికార పీఠం తప్ప. అందుకే ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్ష పీఠంపై కూర్చోవాల్సి వచ్చింది.

లౌకిక పార్టీల.. అలౌకిక విధానం?

ఒకటో, రెండో పార్టీలు అని కాదు.. చాలా పార్టీలు అలౌకిక పార్టీలుగా ముద్ర వేసుకుంటున్నాయి. లౌకిక పార్టీలు అన్ని మతాలను, అన్ని వర్గాలను సమాన దృష్టితో చూడాలి. కానీ, హిందూ వ్యతిరేక భావజాలం ఉంటేనే లౌకికవాదం అన్నట్లు ప్రస్తుత రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అందుకే ఆ పార్టీల నుంచి హిందువులు దూరం జరుగుతున్నారు. తమ మతాన్ని ఆదరిస్తున్న వారినే అక్కున చేర్చుకుంటున్నారు, ఆదరిస్తున్నారు. ప్రపంచమంతా అభివృద్ధివైపు పరుగులు తీస్తుంటే.. ఇంకా మతాల లొల్లి ఎందుకు? అని అడిగితే.. లవ్ జిహాద్‌ల సంగతేంటి? మత మార్పిడుల మాటేంటి? అని ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి. వాటిని అడ్డుకున్ననాడు ‘మా మతం’ అన్న భావన రానేరాదు అనేది లౌకిక హిందువుల వాదన. నెహ్రూ నుంచి నేటి గాంధీల వరకు అంతా హిందూ వ్యతిరేక విధానాలే అవలంబించారని మెజార్టీ హిందువులు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయం సోషల్ మీడియా (వాట్సాప్ యూనివర్సిటీ అయితే కాదు) ద్వారా బయటికి తెలుస్తూనే ఉంది. 

నగ్న సత్యం.. 

ఒక ముస్లిం ఒక హిందువుతో దోస్తీ కట్టట్లే..

ఒక హిందువు ఒక ముస్లిం వ్యాపారి వద్ద సామాను కొనట్లే..

ఒక క్రిస్టియన్‌కు అవతలి మతం అంటే పడట్లే..

స్పష్టమైన చీలిక..! భిన్నత్వంలో ఏకత్వం లేదిక..!?

సగటు హిందువు మదిలో ప్రశ్నలు..

  • వక్ఫ్ భూములకు ఇచ్చిన గ్యారెంటీ.. ఆలయ భూములకు ఎందుకివ్వలే?
  • వక్ఫ్ భూములు ఒక మతానికి చెందితే.. ఆలయ భూములు ప్రభుత్వ స్వాధీనమెందుకు?
  • మసీదు డబ్బైనా, చర్చి డబ్బైనా ఆ మతానికే సొంతం.. హిందూ ఆలయాల డబ్బు మాత్రం ప్రభుత్వాలకా?
  • నమాజ్ కోసం స్పీకర్ పెడితే అడ్డులేదు.. అయ్యప్ప భక్తుల భక్తిపాటలకు అడ్డెందుకు?
  • రంజాన్‌కు సర్కారు తోఫాలు.. క్రిస్‌మస్‌కు గిఫ్టులు.. ఏ హిందూ పండుగకు బహుమతులు ఇవ్వరెందుకు?
  • చరిత్ర పుస్తకాల్లో మొఘలులే గొప్పవారు.. హిందూరాజుల గాథలు మాత్రం లేవెందుకు?
  • అందుకే ఎక్కుతోంది ‘హిందూ’ మత్తు..! నరనరాన పాకుతోంది కాషాయం మస్తు..!!

- శ్రావణ్ కుమార్ బొమ్మకంటి


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్