తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడి మీటింగ్ చుట్టే రాజకీయమంతా నడిచింది. ఈ రాజకీయాల నడుమ నిరుద్యోగుల ఆందోళనలు మరుగునపడిపోయాయి.
సీఎంల మీటింగ్‌లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు తదితరులు
దేశవ్యాప్తంగా నెలకొంటున్న రాజకీయ పరిణామాల కన్నా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడి మీటింగ్ చుట్టే రాజకీయమంతా నడిచింది. ఈ రాజకీయాల నడుమ నిరుద్యోగుల ఆందోళనలు మరుగునపడిపోయాయి. తెలంగాణలో ఆగమేఘాలపై గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయటం కూడా అందులో భాగమేనని విశ్లేషకుల వాదన. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సిన కీలకాంశం ఏంటంటే.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్ గురించే. వాస్తవానికి ఈ మీటింగ్‌లో ఏం చర్చిస్తారన్న చర్చ బాగానే జరిగినా.. ఇక్కడ రాజకీయ విశ్లేషకులు సైతం ఒక అంశాన్ని మర్చిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కేసీఆర్‌ను గద్దె దించామని ఫీలవుతున్న మేధావులు సైతం.. ఈ మీటింగ్‌లో ఏం చర్చిస్తారు? అని అనుకున్నారు తప్ప.. ఒక ప్రధానాంశాన్ని మర్చిపోయారు. అదేంటంటే.. చంద్రబాబు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సీఎంలా ఫీలవుతున్నారన్న విషయాన్ని.
ఆయన ఏపీ సీఎం. తెలంగాణకు సీఎంలా ఎందుకు ఫీలవుతారు? అని ప్రశ్న వేయొచ్చు. రేవంత్ రెడ్డితో మీటింగ్‌పై ఆయన తీసుకున్న నిర్ణయమే అందుకు కారణం. అసలేం జరిగిందంటే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ కోసం ఒక అడుగు ముందుకు వేసిన ఆయన.. తానే డేట్ ఫిక్స్ చేశారు. తానే టైం ఫిక్స్ చేశారు. తానే టైం కూడా ఫిక్స్ చేశారు. అంటే.. చంద్రబాబు డిసైడ్ అయిపోయారు. తాను డిసైడ్ అయిపోయాను.. ఇక్కడ తెలంగాణ సీఎం అభిప్రాయం మాత్రమే చెప్పాలన్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లోతుగా పరిశీలిస్తే ఇది నిజమేనని అనిపిస్తోంది. ఏపీ సీఎంగా చంద్రబాబు.. మీటింగ్ కోసం ప్రతిపాదన పంపాలి.. ఆ తర్వాత తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పాలి. దేని కోసం సమావేశం అవుతున్నామో అంశాలపై నోట్ రాసుకోవాలి. ఆ అంశాలను నోట్ రాసుకొని, మీటింగ్ మినిట్స్ ప్రకటించాలి.
అనంతరం.. మీటింగ్ జరిగే స్థలం, డేట్, టైం డిసైడ్ చేసుకొని ఒక అభిప్రాయానికి వచ్చి మీటింగ్‌లో పాల్గొనాలి. కానీ, ఇక్కడ జరిగిందేంటి? చంద్రబాబే టైం, డేట్, ప్లేస్ డిసైడ్ చేసి లేఖ రాశారు. ఎలాగూ చంద్రబాబు పెద్ద మనిషి కదా.. సీఎం రేవంత్ రెడ్డి ఇంకేం చేస్తారు!! జీ హుజూర్ అన్నారు. మీటింగ్‌కు ఓకే చెప్పినా జీ హుజూర్ అన్నట్టేనా? అని ప్రశ్నలు వేయొచ్చు. కానీ, రెండు ప్రభుత్వాల మధ్య.. అదీ సీఎంల మధ్య జరిగే సమావేశం.. పైగా, విభజన సమస్యలపై చర్చ. అంటే కేంద్రం కూడా మీటింగ్‌లో ఉండాలి. కానీ, ఇక్కడ అదేం జరగలేదు. ఇక్కడ మరో విషయం.. డేట్, టైం, ప్లేస్ అనేవి.. ఒక సీఎం డిసైడ్ చేయడం కాదు. దానికంటూ సీఎంవో ప్రొటోకాల్ ఉంటుంది. అపాయింట్‌మెంట్లు ఉంటాయి. మరిక్కడ.. ఆ వివరాలన్నీ చంద్రబాబుకు ముందే తెలిసిపోయాయా? లేక తెలంగాణ సీఎం ఆ రోజు ఖాళీగా ఉంటారని చంద్రబాబే డిసైడ్ అయిపోయారా?
అంటే.. ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు తానే ముఖ్యమంత్రినని, తన శిష్యుడే తెలంగాణ సీఎం కాబట్టి.. తానేం చేసినా నడుస్తుందని ఆయన ఫీలవుతున్నట్టే కదా అని రాజకీయ పండితులు ఓ రకమైన విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరే బాబూ.. పదేళ్లుగా విభజన సమస్యలు అలాగే ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవటానికి సీఎంలు భేటీ అయితే తప్పేంటి? అని కూడా కొందరు అంటారు. సరే.. వాళ్లే కరెక్టు అనుకుందాం. అలాంటప్పుడు రెండు గంటల మీటింగ్‌లో ఏమేం చర్చించుకున్నారు? ఏ అంశాలపై చర్చ జరిగింది? ఈ విషయాలు బయటికి చెప్పారా? అంటే ‘రెండు కమిటీలు వేశాం.. అన్నింటికీ కమిటీలు వేశాం.. ఏ కమిటీలు అంటే ఏమని చెప్తాం.. అన్నింటికీ’ అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తానేదో రాసుకొచ్చింది చెప్పేసి వెళ్లిపోయారు. పాపం.. మీడియాకు వివరణ ఇచ్చి పెద్ద మనిషిని అనుకొని ఫీలయ్యే తత్వం ఆయనది. ఏం చేస్తాం..!
ఇకపోతే.. చంద్రబాబు వ్యవహార శైలి మాత్రం రాజకీయ విశ్లేషకులకు, తెలంగాణ మేధావులకు ఏమాత్రం రుచించటం లేదట. కారణం ఏంటి? అని ఆరా తీస్తే.. పదేళ్లు తెలంగాణను పట్టించుకోకుండా ఇప్పుడొచ్చి.. నా తెలంగాణ తమ్ముళ్లూ అని అనడంపై అబ్బా! చంద్రబాబూ ఏం రాజకీయం బాబూ.. అంటున్నారు. హైదరాబాద్‌లో ర్యాలీ తీయడంపై నిజంగానే నారా వారు ఉమ్మడి సీఎంలా ఫీలవుతున్నారని మక్కున వేలేసుకుంటున్నారు. కేసీఆర్ ఇంట్లో కూర్చోగానే తెలంగాణపై దండెత్తి వచ్చేందుకు పెద్ద ప్లానే వేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అధికార పార్టీలో చేరికలతో బీఆర్ఎస్ ఢీలా పడగా, తెలంగాణలో అడుగు పెట్టేందుకు టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. ఇలా.. తెలంగాణ రాజకీయాలు మాత్రం రంజుగానే సాగుతున్నాయి.
- ఈవార్తలు ఎడిటోరియల్