మనం సహజంగా ఏ శుభకార్యానికైనా అక్షింతలు వేసి ఆశీర్వదించడం చూస్తుంటాం. చిన్నవారిని ఆశీర్వదించడానికి, పెద్ద వాళ్లను పూజించడానికి ఉపయోగిస్తుంటాం.
ప్రతీకాత్మక చిత్రం
మనం సహజంగా ఏ శుభకార్యానికైనా అక్షింతలు వేసి ఆశీర్వదించడం చూస్తుంటాం. చిన్నవారిని ఆశీర్వదించడానికి, పెద్ద వాళ్లను పూజించడానికి ఉపయోగిస్తుంటాం. దేవునికి పూజ చేసేటప్పుడు కూడా అక్షింతలు వేస్తుంటాం. ఎందుకు అక్షింతలకు ఇంత ప్రాధాన్యం ఉందంటే.. ఆ పదంలోనే ఉంది దానికి అర్థం అక్షతం అంటే క్షతము కానిది, నాశము కానిది అని అర్థం. నాశము లేనటువంటి భావన ఏదైతే ఉందో అది ఎక్కడెక్కడ ఏ లోటు ఉన్న దాన్ని పూర్చడానికి పనికివస్తుంది. భావాలకు రూపకల్పన చేసి అక్షింతలను సమర్పించుకుంటాం. వివాహది శుభకార్యాల్లో కూడా అక్షతారోపనము అని చెప్పి బియ్యాన్ని అక్షితంలుగా తయారుచేసి వాడుతాం. ఇవి అక్షతము అనే భావాన్ని ఆరోపించడానికి తగినటువంటివి కాబట్టి బియ్యాన్ని అక్షింతలుగా తయారు చేసి పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేయడానికి సంకేతంగా అక్షింతలను వేస్తాం.
ఈ అక్షింతలు తెల్లగా ఉండాలి, శుభంగా ఉండాలి. మంచి జాతికి చెందినటువంటి వరి వంగడానికి చెందిన బియ్యంతో అక్షింతలు తయారు చేయాలి. ఈ బియ్యానికి ఆవు నెయ్యి, పసుపును పట్టించాలి. పసుపు శుభప్రదమైనటువంటిది, లక్ష్మీ ప్రదమైనటువంటిది, ఎటువంటి క్రిమికీటకాలను రానీయనటువంటిది. అంతేకాకుండా ఏ చెడును రానీయకుండా ఆపగలిగే లక్షణం పసుపు రంగుకు ఉంటుంది. అందుకే ఇంటి గుమ్మాలకు పసుపు పూస్తు ఉంటాం. ఇది దృష్టశక్తులను లోపలికి రానీయకుండా కాపాడుతుంది. కాబట్టి ఆ పసుపులో ఆవు నెయ్యి వేసి అక్షింతలు కలుపుకోవాలి. పచ్చగా ఉన్న బియ్యం శుభాన్ని సూచిస్తాయి. కాబట్టి వివాహిత శుభకార్యాలకు కానీ, పుట్టిన రోజు వేడుకలకు గానీ, ఏ ఇతర శుభకార్యాలకు గానీ అక్షింతలను ఆశీర్వదించి వారి పరిపూర్ణత్వాన్ని సిద్ధింపచేయడానికి వాడేవే ఈ అక్షింతలు.