సేతువు కట్టిందెవరు?

సేతువు కట్టిందెవరు?

who built rama setu science history analysis

ప్రతీకాత్మక చిత్రం

రాముడి సేతువు కూడా ఇప్పటిదాకా ఓ మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై చర్చలు జరిగాయి. దీన్ని ధ్వంసం చేసేందుకు నిన్నమొన్నటి వరకు భారత ప్రభుత్వం తీవ్రంగా పూనుకుంది కూడా. ఇంతకీ ఈ రామ సేతువు నిర్మాణం వెనుక దాగిన రహస్యం ఏమిటి? ఇంతకాలం ఇదో మిస్టరీ.. ఇప్పుడు సైన్స్ నిరూపించిన వాస్తవం. పది వేల సంవత్సరాల నాటి మనిషి టెక్నాలజీకి నిదర్శనం.. ఇది రాముడి వంతెన.. రాముడి కోసం కట్టిన వంతెన.. రాముడు కట్టని వంతెన.. వేల సంవత్సరాల క్రితం నాటి మేధో మానవుడి సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీక. ఇదొక్కటే జవాబు చెప్తుంది. రామాయణపు కాలం నాడు సముద్రంపై నిర్మించిన వారధి ఎలాంటి టెక్నాలజీతో కట్టారో తేలిపోయింది. ఎవరు నిర్మించారో తెలిసిపోయింది. ఎన్ని రోజుల్లో ఏ విధంగా ఎలాంటి మెటీరియల్ను ఉపయోగించారో స్పష్టమైంది. రాముడి అస్తిత్వానికి 35 కిలోమీటర్ల పొడవైన సాక్ష్యం సముద్రంపై సాటిలేని నిర్మాణం.. రోజుల వ్యవధిలో వందల మైళ్ల నిర్మాణం.. అత్యాధునిక పరిజ్ఞానం.

రామ సేతువు నిర్మాణాన్ని ఎవరు పర్యవేక్షణ చేశారు.. ఎలాంటి టెక్నాలజీని వాడారు? ఇన్ని యుగాల తరువాత కూడా వంతెన ఆనుపానులు కొంతమేరకైనా కనిపించేంత గొప్ప టెక్నాలజీని ఏం వాడారు? వింటే ఆశ్చర్యమేస్తుంది.. వివరాలు తెలుసుకున్న కొద్దీ మన సాంకేతిక పరిజ్ఞానంలోని అద్భుతం ఆవిష్కారమవుతుంది. రామసేతువు రామాయణాన్ని నిజం చేస్తోంది. భారతీయ ప్రాచీన నాగరికతను నిరూపిస్తోంది. మన కేలండరు, కాల మానాలను వాస్తవాలని రుజువు చేస్తోంది. మన యుగ విభజనలోని నిజానిజాలను స్పష్టంగా చెస్తోంది. లక్షల సంవత్సరాల కాలం నాడే మన మేధస్సు ఎంత గొప్పదో తెలియ జెప్తోంది. రామాయణాన్ని అంతా కలిపి మూడు ముక్కల్లో చెప్పేయమంటే- కట్టె, కొట్టె తెచ్చె అని చెప్తారు. అందులో మొదటిది కట్టె.. అంటే వారధి కట్టె అని అర్థం.. వారధి ఎందుకు కట్టాడు? సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవటానికి. సీతాదేవి లంకలో ఉన్న విషయాన్ని ఆంజనేయుడు కనుక్కుని వచ్చి చెప్పగానే వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని రాముడు లంకకు బయలు దేరాడు. అక్కడ సముద్రాన్ని దాటేందుకు రాముడికి ఎలాంటి ఉపాయం తోచలేదు. అప్పుడు సముద్రుణ్ణి ఉపాయం చెప్పమని కోరాడట.. అప్పుడు సముద్రుడు తనమీదుగా వంతెన కట్టుకుని వెళ్లమని సలహా ఇచ్చాడట... అలా ఏర్పడిందే వారధి. రాముడు ప్రతి రాయిని తాకగానే అది తేలికపాటిదయిందని ఒక కథ. ఆ రాళ్లను నీటిలో వేయగానే అవి తేలిపోయాయట.. ఇలా వానరసైన్యం రామసేతువును చిటికెలో నిర్మించేసింది. ఇది నమ్మశక్యమేనా? రాముడు దాటాల్సిన సముద్రం నూరు యోజనాలు. ఒక యోజనం అంటే 13 కిలోమీటర్లు. వంద యోజనాలు అంటే, 1300 కిలో మీటర్లన్నమాట.. ఇన్ని కిలోమీటర్ల పొడవున వారధి నిర్మించటం అదీ కొన్ని రోజుల్లో పూర్తి చేయటం ఎలా సాధ్యపడింది. అదీ నీళ్లపై తేలే రాళ్లతో.. ఎన్ని రాళ్లు తెచ్చారు.. ఎంత మంది పని చేస్తే ఇది సాధ్యపడింది? ఎంత సూపర్ టెక్నాలజీ అందుబాటులో వున్నా ఇన్ని వందల కిలోమీటర్ల వారధిని రోజుల్లో ఎలా నిర్మించగలిగారు? ఇలాంటి నిర్మాణాన్ని ఈ కాలంలో చేపట్టడం సాధ్యం కాదని చెప్పే శాస్త్రవేత్తలే.. రామ సేతు నిర్మాణం సాధ్యపడిందని అంటున్నారు. ఆ కాలంలో ఇవి ఖచ్చితంగా సాధ్యపడ్డాయని అంటున్నారు. హిందూ మహా సముద్రంలోనే కాదు... అట్లాంటిక్ మహా సముద్రంలోనూ ఇలాంటి వారధిని పోలిన నిర్మాణాలున్నాయని చెప్తున్నారు. కాకపోతే వీటన్నింటికంటే రామ సేతువు మరీ ప్రాచీనమైంది అని నాసా పరిశోధనలో స్పష్టమైంది.

రామసేతువు గురించి క్రీస్తు శకం 1747లో తొలిసారి చర్చ జరిగింది. ఒక డచ్ కార్టోగ్రాఫర్ సేతువు ఉన్న సముద్రాన్ని చూసాడు. కానీ, ఇది ఏ కాలం నాటి వంతెన అన్నది అతనికి అంతు పట్టలేదు. పదేళ్ల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దీని ఆనుపానులను బయటపెట్టింది. అచ్చంగా ఇది మనిషి నిర్మించిన వంతెనే అని తేల్చి చెప్పింది. రామేశ్వరం.. భారత దేశానికి దక్షిణాన ఉన్న సరిహద్దు.. ఇక్కడ సముద్రంపై రైలు, రోడ్డు వంతెనలు అద్భుతంగా ఉంటాయి. రైలు వంతెనపై వెళ్తుంటే దూరంగా వరుసగా నీటిలో తేలుతున్న రాళ్లు కనిపిస్తాయి. దాదాపు 35 కిలోమీటర్ల పొడవున ఉన్న రాతి వంతెన అది.. శ్రీరామ చంద్రుడు రావణుడిపై యుద్ధానికి వెళ్లినప్పుడు నిర్మించిన వంతెన ఇది. 1804లో బ్రిటిష్ ప్రభుత్వం ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు పెట్టుకుంది. బైబిల్ ప్రకారం భూమిపై తొలి మానవుడు ఆడమ్స్.. ఈ బ్రిడ్జి కూడా ఆడమ్ కాలంనాటి మనుషులు కట్టిందేనని వాళ్లూ విశ్వసించారు. అంతే కాదు.. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏమంటే.. పాక్ జలసంధికి, లంకలోని మన్నార్ తీరప్రాంతానికి ఇసుక రాళ్ల చైన్తో ఉన్న ఒకే వంతెన ఇది... లంకకు చేరుకోవటానికి మరో మార్గం ఇక్కడెక్కడా కనిపించదు. రామసేతువును సముద్ర జలాలపై సముద్రుడి సహాయంతో నిర్మించారని వాల్మీకి రామాయణం చెప్తుంది. సేతువుపై లభించిన ఇసుక రాళ్లు వేల సంవత్సరాల పాతవేనని పురావస్తు శాస్త్రవేత్త దుబే నిరూపించారు. సైంటిఫిక్ డేటింగ్ ప్రకారం ఈ వంతెన వయసు పదివేల సంవత్సరాలు. హిందూ శాస్త్రాల ప్రకారం త్రేతాయుగంలో రామాయణం జరిగింది. ఈ యుగం 12 లక్షల 96 వేల సంవత్సరాలు, ద్వాపర యుగం 8 లక్షల 64 వేల సంవత్సరాలు, కలియుగం మనం చూసింది ఇప్పటి వరకు అయిదున్నర వేల సంవత్సరాలు. త్రేతాయుగం చివరలో రామాయణం, రావణ వధ జరిగాయి. ఈ ప్రకారం చూసుకుంటే రామ సేతువును 8 లక్షల 69 వేల సంవత్సరాల క్రితం నిర్మించారు. కానీ, తాజాగా నిర్ధారణ జరిగిన రామాయణ కాలవ్యవధి ప్రకారం ఈ వంతెన పదివేల సంవత్సరాల క్రితం నాటిది. రామాయణంలో పేర్కొన్న గణాంకాలను బట్టి నిర్ధారించిన చారిత్రక కాలమిది. జియోగ్రాఫికల్ నిర్మాణాల గురించి రామాయణం తప్ప మరే హిందూ ఇతిహాసం కానీ, పురాణం కానీ లోతుగా చర్చించిన దాఖలా కనిపించదు. రామ సేతువును సుగ్రీవుడి సైన్యంలోని నలుడు, నీలుడనే ఇంజనీర్లు నిర్మించారు. వీరిలో నలుడు విశ్వకర్మ కుమారుడు. వీళ్లిద్దరి ఇంజనీరింగ్ పర్యవేక్షణలోనే రాముడి సేతువు నిర్మాణం జరిగింది. లక్షల సంవత్సరాలైనా, ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. ఇది ఎంతమాత్రం ఫాంటసీ కాదు.. రామాయణం నిజంగా ఫాంటసీయే అయితే, వాల్మీకి లాంటి వాడికి రామాయణాన్ని ఫాంటసైజ్ చేయటం పెద్ద కష్టమేం కాదు.. రాముడు తన బాణాలతోనే లంక దాకా వారధి క్షణంలో కట్టేశాడని రాసేవాడు.. దాన్ని ఎవరూ తప్పుపట్టే వారూ కారు.. కానీ, ఇది చరిత్ర కనుకనే నలుడి నిర్మాణ నైపుణ్యాన్ని గురించి ఆయన స్పష్టంగా క్లారిఫై ఇచ్చారు. రామ సేతువు నిర్మాణం ఎలా జరిగింది? ఇదొక పెద్ద చర్చ... రాముడి పధ్నాలుగేళ్ల వనవాసం పూర్తి కావస్తున్న సమయంలో సీతాపహరణం జరిగింది. ఆమె అన్వేషణకే పది మాసాలు పట్టింది. రాముడి ముందున్నది రెండు మాసాలే.

గడువు పూర్తికాగానే తిరిగి రాకపోతే ప్రాయోపవేశం చేసేస్తానని భరతుడు ముందే వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఈ కొద్ది సమయంలోనే సీతాదేవిని తీసుకుని అయోధ్య చేరుకోవాలి.. ఈ కొద్ది సమయంలోనే వారధి నిర్మాణం జరిగింది.. యుద్ధం పూర్తయింది. ఇదంతా ఎలా జరిగింది? అదే ఇక్కడ ఇంటరెస్టింగ్ థింగ్ మరి.. రావణ వధకోసం రామేశ్వరం సమీపంలో సముద్ర తీరానికి చేరినప్పుడు రాముడి సైన్యం ఎంతో తెలుసా? అక్షరాలా పది మిలియన్లు.. మానవ, వానర సైన్యం అంతా కలిపి కోటి మంది.. ఇదెలా సాధ్యమని విడ్డూర పోకండి.. ఆయన ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం దాకా తరలి వచ్చాడు.. అప్పుడు అఖండ భారతావని జనాభా ఎంతుంటుందో ఊహించుకోవచ్చు. భారత యుద్ధంలోనే 34లక్షల మంది చనిపోయారు. రామాయణ కాలం నాటి రాముడి సైన్యం కోటి మంది పెద్ద అసాధ్యమైన విషయమేం కాదు. దక్షిణ భారతంలోని ప్రజలంతా రాముడి పక్షాన నిలిచి రావణుడితో పోరుసలిపారు. ఈ కోటి మంది కలిసి రామ సేతువును అయిదు రోజుల్లో నిర్మించారు. వింటే ఆశ్చర్యం వేయవచ్చు. కానీ, ఇదే వాస్తవం.

మొదటి రోజు 14 యోజనాలు..

రెండో రోజు 20 యోజనాలు..

మూడో రోజు 21 యోజనాలు..

నాలుగో రోజు 22 యోజనాలు..

అయిదో రోజు 23 యోజనాలు.. నిర్మించారు.

అయిదు రోజులోనే నిర్మించారు కాబట్టి రావణుడి నిఘా వర్గాలు సైతం ఈ వారధిని పసిగట్టలేకపోయాయి. ఈ నిర్మాణాన్ని పూర్తిగా పర్యవేక్షించిన వాడు నీలుడు. నలుడు అంటే దక్షిణ భారతానికి చెందిన వాడు. వారధి నిర్మాణంలో హనుమంతుడికి కానీ, డిజైనింగ్ చేశాడు. ఈ నీలుడు కిష్కింధకు చెందిన వాడు. అంటే ఇప్పుడున్న కర్ణాటక. రాముడికి కానీ ఎలాంటి ప్రమేయం లేదు. అయితే వంతెన నిర్మాణం ఎలా జరిగిందన్నది మరో ప్రశ్న.. కేవలం నీటిపై తేలే రాళ్లతోనే మొత్తం వంతెన నిర్మాణం జరగలేదు. దీని వెనుక టెక్నాలజీ చూస్తే ఎవరికైనా తల తిరిగి పోవాల్సిందే. మొదట సముద్ర గర్భంలో సాండెబెడ్ వేసుకుంటూ వెళ్లారు.. దానిపైన వుడెన్ కుష్ను నిర్మించారు.. ఆ పైన బరువైన రాళ్లను.. ఆ పైన లైట్వెయిట్ రాళ్లను వేసుకుంటూ వెళ్లారు. నాలుగు లేయర్లను సమాంతరంగా వేసుకుంటూ వెళ్లారు.. దీని పొడవు వెడల్పు కూడా చాలా సైంటిఫిక్గా, సపోర్టివ్ ఉండేలా చూసుకున్నారు. ఎందుకంటే చాలామంది బరువును మోయాల్సింది. కాబట్టి. త్రేతాయుగం నాటి మానవులు పన్నెండు నుంచి పధ్నాలుగు అడుగుల ఎత్తు వున్నట్లు ఆధారాలు కూడా మనకు ఉన్నాయి. సింధునాగరికతలోనే 12 అడుగుల జెయింటే హ్యూమన్ అస్థిపంజరం మనకు లభించింది. రాముడు పట్టుకున్న ధనుస్సు పదహారు అడుగులు ఉందని రామాయణం చెప్తోంది. అందువల్ల ఆనాటి మనుషులు బలిష్ఠులు, భారీకాయులు కావటం వల్ల కూడా నిర్మాణం సులువుగా, తేలిగ్గా జరిగింది. అందుకే ఈ నిర్మాణాన్ని అండర్ ఎస్టిమేట్ చేయటం సరికాదు. ఇవాళ పాక్ జలసంధిలో కనిపిస్తున్న రామసేతువు నిర్మాణం ఈ టెక్నాలజీని పూర్తిగా బలపరుస్తోంది. కేవలం నీటిపై తేలే రాళ్లే అయితే, దాన్ని ధ్వంసం చేయాలన్న సర్కారు ప్రయత్నం నెరవేరటం తేలికే అయ్యేది. కానీ, తేలే రాళ్ల కింద ఉన్న మహా నిర్మాణాన్ని ధ్వంసం చేయటం అంత ఈజీ కాదు. రామ సేతువు.. భారత దేశానికే కాదు.. ప్రపంచంలో సంపూర్ణంగా జంతువు నుంచి ఎదిగిన తరువాత మానవుడి విజ్ఞాన నైపుణ్యానికి తిరుగులేని సాక్ష్యం. భగవంతుడిగా ఎదిగి పోయిన మానవుడి చరిత్రకు మాసిపోని నిదర్శనం.

- కోవెల సంతోష్ కుమార్, రచయిత

ఫోన్ నంబర్: 9052116463


ఏటీఎం వ్యాన్ నుంచి రూ.7.11 కోట్ల లూటీ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్