||ప్రతీకాత్మక చిత్రం Photo: Twitter||
రాఖీ పండుగపై గందరగోళం నెలకొంది. అక్కాచెల్లెల్లు అన్నదమ్ములకు ఏ రోజున రాఖీ కట్టాలన్నదానిపై స్పష్టత లేకపోయింది. కారణం.. ఈ నెల 30, 31 తేదీల్లో పౌర్ణమి ఉండటమే కారణం. ఇందులో ఏ రోజున రాఖీ కట్టాలని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ రోజున రాఖీ కట్టాలన్నదానిపై ప్రముఖ పండితుడు బండపెల్లి రామ్ మనోహర్ శర్మ స్పష్టతనిచ్చారు. సూర్యుడికి మూడు గడియలు వస్తున్నందున రాఖీ 31వ తేదీన కట్టడమే ఉత్తమం అని స్పష్టం చేశారు. 30వ తేదీ రాఖీ కట్టడానికి పనికి రాదని తేల్చి చెప్పారు. 30వ తేదీన భద్రకాలం ఉంటున్నందున అస్సలు మంచిది కాదని తెలిపారు. పౌర్ణమి 30వ తేదీ రాత్రి 9.01 గంటలకు ప్రారంభమై 31వ తేదీ ఉదయం 07.05 గంటల వరకు కొనసాగుతుందని, సూర్యోదయం 31నే ఉన్నందున ఆ రోజే రాఖీ కట్టాలని వివరించారు.
భద్రకాలం గురించి వివరిస్తూ..
రావణుడి సోదరి భద్ర పౌర్ణమి రాకముందే చతుర్దశి రోజు రావణుడికి రాఖీ కట్టిందట. దాని ఫలితమే రాముడి చేతిలో రావణుడికి మరణం సంభవించిందని పురాణాలు చెప్తున్నాయని రామ్ మనోహర్ శర్మ తెలిపారు. పౌర్ణమి ముందు కాలాన్ని భద్ర కాలం అంటారని, అది చెడుకు సూచికగా అభివర్ణిస్తారని వెల్లడించారు. ఆ సమయంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు, సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, అందువల్ల 30వ తేదీన రాఖీ కట్టకూడదని పేర్కొన్నారు.