శివ లింగం అంటే ఏంటి? అన్న సందేహం సాధారణ ప్రజలకు ఇప్పటికీ ప్రశ్నే. సనాతన కాలం నుంచి వస్తున్నదే అన్న విషయం తప్ప ఇంకేం తెలియదు. పురాణాలు, ఆధ్యాత్మిక పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాశమే లింగం. భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇందులోనే అంతా లయం చెందుతుంది. అందుకే దీనిని లింగం అని పిలిచారు. ‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది. అందుకే అది లింగం అయ్యింది. ఈ సృష్టి సమస్తం శివమయం. ఈ సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి మహాసముద్రం వలె ఉండేది. ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజోపుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ తేజోమయరూపమే పరబ్రహ్మం. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు. సామాన్యంగా లింగ శబ్ధానికి చిహ్నం లేక లక్షణం అనే అర్థాలు ఉన్నాయి. ప్రకృతి, వికృతులు రెండూ లింగమనే సౌంఖ్య దర్శనం చెప్పింది. విగ్రహాన్ని మూర్తి అని అంటారు. మూర్తి ధ్యానాన్ని బట్టి ఆకారాలు ఉంటాయి. కానీ, లింగములో ఆకారం గానీ, రూపం గానీ ఉండదు. అదొక చిహ్నం మిత్రమే. లయనా ల్లింగముచ్యతే అని అన్నారు. అంటే, లయం ప్రళయం కావటం వల్ల లింగంగా చెప్పబడుతోంది. ప్రళయాగ్నిలో సర్వమూ భస్మమై శివలింగంలో చేరుతుంది. లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగుతుందని లింగపురాణం చెబుతోంది. స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు. తాను ఇతరులకు దర్శనం ఇవ్వాలనుకుంటే అంబతో కలిసి (సాంబ) దర్శనం ఇస్తాడు. ఆ స్వామి రూపం లేని స్థితి నుంచి సాంబమూర్తిగా దర్శనమివ్వడానికి మధ్యలో మరొక రూపం ఉంది. దానినే అరూపమని అంటారు. అదే శివలింగం.
శివలింగాలు ఐదు రకాలు. తనంతట తానుగా అవతరించినది స్వయంభూ లింగం. ధ్యానపూర్వకమైనది బిందు లింగం. మంత్రపూర్వకమైనది ప్రతిష్ఠా లింగం. నాలుగవది చర లింగం. ఐదవది శివుని విగ్రహమైన గురు లింగం. మరికొన్ని గ్రంథాలు శివలింగాలను నాలుగు విధాలుగా పేర్కొన్నాయి. అవి ఆఢ్యం, సురేఢ్యం, అనాఢ్యం, సర్వసమం. 1001 ముఖాలతో కనిపించే శివలింగం ఆఢ్యం. 108 ముఖాలతో కనబడే శివలింగం సురేఢ్యం. ప్రస్తుతం ఉన్నవి, లేనివి అన్ని శివలింగ రూపాలను అనాఢ్యం అంటున్నారు. ఒకటి నుంచి ఐదు ముఖాలు ఉన్న శివ లింగాలు సర్వసమం. ముఖ లింగాల ఆలయాలు అరుదుగా ఉంటాయి. ఏకముఖ లింగం, ద్విముఖ లింగం, త్రిముఖ లింగం, చతుర్ముఖ లింగం, పంచముఖ లింగం, షణ్ముఖ లింగం అంటూ పిలుస్తారు. అయితే ఆరుముఖాలు కలిగిన షణ్ముఖ లింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు. ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలు, పరంలో శివ సాయుజ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.
1. ఏకముఖ లింగం: ఈ లింగంలో శివుని యొక్క తత్పురుష రూపాన్ని దర్శించుకుంటాం.
2. ద్విముఖ లింగం: శివలింగానికి తూర్పు-పడమరలో ముఖాలు కలిగి ఉండటం ద్విముఖ లింగ లక్షణం. వీరశైవులు ఈ లింగాన్ని పూజిస్తారు. ఈ లింగాలను ఆలయాలలో చూడలేం.
3. త్రిముఖ లింగం: ఈ శివలింగం తూర్పు, ఉత్తర, దక్షిణ ముఖాలను కలిగి ఉంటుంది. ఈ త్రిముఖ లింగం సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులను సూచిస్తుందని ఆధ్యాత్మిక వేత్తల భావన.
4. చతుర్ముఖ లింగం: ఈ లింగానికి తూర్పున తత్పురుషం, పడమట సద్యోజాతం, ఉత్తరాన వామదేవం, దక్షిణాన అఘోర ముఖాలుంటాయి. ఈ నాలుగు ముఖాలను నాలుగు వేదమంత్రాలతో పూజిస్తుంటారు.
5. పంచముఖ లింగం: ఈ పంచముఖ లింగాలు అరుదుగా కనిపిస్తుంటాయి. నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలతో, తూర్పువైపున ఐదో ముఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మంది పంచముఖ శివ లింగాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. ఈ లింగాన్ని ‘శివాగమ లింగం’ అని కూడా పిలుస్తారు.
6. షణ్ముఖ లింగం: ఈ లింగంలో 4 ముఖాలు 4 దిక్కులను చూస్తుండగా, ఐదవ ముఖం ఆకాశాన్ని, ఆరో ముఖం పాతాళాన్ని చూస్తుంటాయి. ఈ ఆరు ముఖాల నుంచి వెలువడిన తేజఃపుంజాలతో శివుడు సుబ్రహ్మణ్య స్వామిని సృజించాడని పురాణ కథనం. అలాగే పాల సముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన విషాన్ని శివుడు అథోముఖంతో స్వీకరించాడట. అయితే ప్రస్తుతం ఎక్కడా మనం షణ్ముఖ లింగాన్ని దర్శించుకోలేం.
- బండపెల్లి రామ్ మనోహర్ శర్మ
సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్