తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. ఈ గుడికి పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యత ఉంది. వేములవాడను పూర్వం లేంబులవాటిక అని పిలిచేవారు. కాలక్రమంలో లేంబులవాడగా.. వేములవాడగా రూపాంతరం చెందింది.
వేములవాడ రాజన్న ఆలయం
ఓం నమఃశివాయ.. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. ఈ గుడికి పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యత ఉంది. వేములవాడను పూర్వం లేంబులవాటిక అని పిలిచేవారు. కాలక్రమంలో లేంబులవాడగా.. వేములవాడగా రూపాంతరం చెందింది. ఈ ఆలయాన్ని చోళ రాజులలో ప్రముఖుడు రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సామాన్య శకం 750 నుండి 175 సంవత్సరాలపాటు చాళుక్యులు, ఇక్ష్వాకులు పాలించినట్లు ఇక్కడ దొరికిన చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆ రోజుల్లో ఈ ప్రాంతం శైవ, వైష్ణవ, జైన మతాలకు కేంద్రంగా ఉండేదని తెలుస్తోంది. తదుపరి కాలంలో కాకతీయుల ఆధీనంలో, ఢల్లీి సుల్తానుల ఆధీనంలో ఉంది. వేములవాడ రాజరాజేశ్వరుడిని భక్తులు ప్రేమగా.. రాజన్న అని పిలుచుకుంటారు. ప్రధాన ఆలయంలో రాజరాజేశ్వరునికి కుడివైపున రాజేశ్వరి అమ్మవారు, ఎడమవైపు లక్ష్మీ సమేత గణపతి ఉన్నారు. ఆలయ ముఖ ద్వారంపై గజలక్ష్మి, సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం వున్నది. ఆలయం చుట్టూ బాల రాజేశ్వర, విఠలేశ్వర, ఉమామహేశ్వర, త్రిపుర సుందరీ దేవి ఆలయాలు ఉన్నాయి. దగ్గర్లోనే భీమేశ్వర, నగరేశ్వర, వేణుగోపాలస్వామి, బద్దిపోచమ్మ తదితర ఆలయాలు ఉన్నాయి. దేవాలయం పక్కనే ధర్మ గుండం (పుష్కరిణి) చాలా పవిత్రమైనది. ధక్ష యజ్ఞ సమయంలో వీరభద్రుని చేతిలో చేతులు కోల్పోయిన సూర్యుభగవానుడు ఈ పుష్కరిణిలో స్నానం చేయగా చేతులు వచ్చాయని పురాణ గాథ.
స్థల విశిష్టత: శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై శ్రీ రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలసి నిత్యం పూజలు అందుకుంటున్నాడు. కాశీ, శ్రీశైలం, కేదార్‌నాథ్ తదితర శైవక్షేత్రాల మాదిరి వేములవాడ క్షేత్రం మహిమాన్వితమై భక్తకోటిని తరింపజేస్తోంది. లేంబాల వాటికగా, భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పేర్లు కలిగిన ఈ క్షేత్ర ప్రశస్తి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో ఉంది. కృతయుగంలో దేవేంద్రుడు లోకకంటకుడైన వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. దాంతో బ్రహ్మహత్యా పాతకం తొలగించేందుకు పలు క్షేత్రాదులు తిరుగుతూ వేములవాడ క్షేత్రానికి వచ్చి ధర్మగుండంలో స్నానం చేసి రాజేశ్వరుడిని అర్చించి పునీతుడైనట్లు రాజేశ్వర ఖండంలో వివరంగా ఉంది. త్రేతాయుగంలో దక్షుడు గంధమాదన పర్వతంపై యజ్ఞం చేయగా, శివ యజ్ఞ భాగలేమితోయున్న మంత్రపూతమైన హవిష్యమును సూర్యుడు తీసుకొని తన చేతులు కోల్పోయాడట. దాంతో విప్రుల సూచనలతో ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించి తిరిగి తన చేతులు పొందినట్లు.. అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రమని పేరు వచ్చినట్లు మరో కథనం. దండకారణ్య ప్రాంతం సంచరిస్తూ శ్రీసీతారామ లక్ష్మణులు, అరణ్యవాసంలో పంచపాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి పూజలు చేసినట్లు, స్వామివారి కృపకు పాత్రులైనట్లు స్థలపురాణం చెప్తోంది. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరాన్ని పావనం చేసి.. వేములవాడకు శివుడు వస్తాడని పురాణ కథనం.
ఆలయ ప్రత్యేకత: ఏ ఆలయంలోలేని ప్రత్యేక సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. పిల్లలు పుట్టని దంపతులు స్వామికి మొక్కుకొని, పిల్లలు కలిగాక ఆ బాలుడితో, ఒక కోడె దూడను తెచ్చి, ఆలయం చుట్టు తిప్పి ముందున్న స్థంబానికి కట్టి వెళ్తారు. దీన్నే కోడె మొక్కు అంటారు. అదే విధంగా స్వామివారికి బెల్లం సమర్పించే ఆచారం కూడా ఉంది. రోగాల బారిన పడిన, ఇతర కష్టాల బారిన పడిన స్త్రీలు రాజరాజేశ్వరునికి మొక్కుకొని అవి తీరాక ఆదిబిక్షువు అడుగు జాడల్లోనే జీవితాంతం బిక్షాటనే వృత్తిగా చేసుకొని, పార్వతిగా మహాశివునికే అంకితమై పోతారు. అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో వుంటారు. శివరాత్రి రోజు లక్షల్లో భక్తులు తరలివస్తారు. ఆ రోజు వంద మంది అర్చకులతో మహాలింగార్చన నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. కరీంనగర్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్-కామారెడ్డి దారిలో వేములవాడ ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్ నుంచి ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. దేవస్థానం ఆధ్వర్యంలోనే వసతి సదుపాయం ఉంది.