Makara Rasi | ఉగాది మకర రాశి విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలు
మకర రాశి
మకర రాశి:
ఉత్తరాషాడ 2,3, 4 పాదములు (బో,జా,జి)
శ్రవణం 1, 2, 3, 4 పాదములు (జూ,జే, జో, ఖా)
ధనిష్ఠ 1,2 పాదములు (గా.గీ)
ఆదాయము 08, వ్యయం- 14,పూజ్యత- 4,అవమానం 5
గ్రహసంచారం:
గురువు: ఈ సంవత్సరం 13-5-2025 వరకు వృషభరాశియందు. తదుపరి 14-5-2025 నుండి 17-10-2025 వరకు మిధునరాశి యందు సంచారము. శ్రీ విశ్వావసు నామ సం॥ర 18-10-2025 నుండి కర్కాటక రాశియందు సంచారము చేయును. శని - ఈ సం|| నుండి 28-03-2025 వరకు కుంభరాశియందు 29-3-2025 నుండి మీనరాశియందు సంచారము చేయును.
రాహువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు మీనరాశియందు 18-5-2025 నుండి కుంభరాశియందు సంచారము.
కేతువు : ఈ సంవత్సరం 17-5-2025 వరకు కన్యారాశియందు 18-5-2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును.
అదృష్టం : ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు కెంపుయునూ, శ్రవణా నక్షత్ర జాతకులు ముత్యమునూ,ధనిష్ఠ నక్షత్ర జాతకులు పగడమునూ ధరించవలెను. ఈ రాశి వారలకు 1-3-6-7-9 సంఖ్యల రోజుల్లో ప్రయాణములు వ్యవహార జయములు కలుగును.సోమ, బుధ, గురు, శుక్రవారములు క్రొత్త పనులు ప్రారంభిస్తే కార్యజయ మును పొందెదరు.
నక్షత్ర ఫలము : ఉత్తరాషాడ నక్షత్రము 2, 3, 4 పాదములవారికి శని పూజలు, అధికముగా చేయుట మంచిది, సామాన్య ధనప్రాప్తి. శ్రవణం నక్షత్రము వారికి ధనమునకు ఇక్కట్లు, తొందరగా నిర్ణయములు వద్దు. ధనయోగము. ధనిష్ఠ నక్షత్రము 1,2 పాదములవారికి సమయానికి కార్యములు పూర్తి. అతి ఆలోచనలు వద్దు. ఈ రాశివారలకు మే, జూన్, ఆగస్టు, సెప్టెంబరు, జనవరి, మార్చి నెలల్లో ధనయోగము, సమస్యలు నివృత్తి కలుగును. 3,5,6,7,8 తేదీలు, సోమ, మంగళ, శుక్రవారములందు ప్రయాణములందు విశేష ధనప్రాప్తి కలుగును. స్టార్ నెంబరు 8
నెలల వారీగా ఫలితాలు:
ఏప్రిల్ : ఈ నెల అనుకూలము, చేయు వ్యాపార, ఉద్యోగ, రాజకీయ, వ్యవహారములందు జయము ధనలాభము, కీర్తి కలుగును. పుణ్యప్రదమగు పనులతో ఆనందించెదరు. తరచు పిల్లల జీవన విధానము వృద్ధి, క్షయాదులను గూర్చి ఆలోచించెదరు. అన్ని రంగములవారికి ఆనంద దాయకముగా ఉంటుంది. సోమవారములందు శంకరుని పూజలు చేస్తే ధనలాభములు కలుగును. ఆదివారములందు శివాలయ నందిశ్వరునికి స్నాన పంచామృత అభిషేకములు చేసిన వ్యవసాయవృద్ధి, ధనప్రాప్తి కలుగును.
మే : ఈ నెల అనుకూలకాలము. ఆరోగ్యము, ధనాదాయము, అభివృద్ధి, సంతోషములు సర్వజనులు అనుభవించెదరు. స్త్రీలతో పుణ్య దేవాలయములకు వెళ్ళి పూజలు నిర్వహించెదరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారరంగముల వారు ధనాన్ని జాగ్రత్త చేసుకోనుట మంచిది. శుక్రవారములందు గోవుకు అలంకరణచేసి పూజించి, తవుడు, బెల్లం, నవధాన్యములు నివేదన చేసిన గ్రహా శాంతి కలిగి శుభప్రదముగా నుండును.
జూన్ : ఈ నెల శారీరక, మానసిక వ్యధ బాధలు, హింసించు ఘటనలు జరుగును. బంధు మరణములు, ప్రయాణ ఇబ్బందులు, భయాందోళనలు, దోపిడులు, అసంఘటిక కార్యక్రమాలు జరుగవచ్చును. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయవాదులు జాగ్రత్త వహించుట మంచిది. శనివారము లందు నవగ్రహ పూజలు, ప్రతి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్తోత్రములు పఠించి, మంగళవారములందు స్వామివారికి పూజలు, ప్రసాద వితరణచే భయాందోళలు, కష్టములు తొలగి ధనాదాయములు కలుగును.
జూలై : ఈ నెల అన్ని రంగములవారికి ఆశించిన ఫలితములు ధన, కార్య, వ్యవహార రూపాలలో లాభించును. సంతాన మూలక ఫలితములు అనుకూలము. విద్యా సంబంధిత ఉన్నత స్థితులు చూడగలవు. ఉద్యోగప్రాప్తి యోగము, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ రంగాలవారికి శ్రమతో ఫలితములు రాగలవు. గురువారములందు గరిక, చెరకుగడ, వివిధ ఆకులతో గణేశుని పూజించిన శుభములు కలుగును.
ఆగస్టు : ఈనెల కుటుంబము నందు ఔషధ సేవలు పెరుగును. ధన వ్యయము. గ్రహస్థితి మిశ్రమ స్పందన. బంధు వైరములు అధికం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ రంగముల వారికి సకాలంలో ధనాదాయము. ధనమును జాగ్రత్తగా నిల్వచేసుకొనండి. మంగళవారములందు పద్మ నాభుని దర్శనం పూజలు చేసి, ప్రసాదములను వితరణ చేసిన ఉన్నత యోగ్యతలు, ధనవృద్ధి పొందగలరు.
సెప్టెంబర్ : ఈ నెల సాంకేతిక రంగంలో ధనాదాయము. దీర్ఘకాలిక ఋణములు తొలగిపోవును. కొత్త ఋణములు తెచ్చెదరు. నూతన భూములు, గృహములు ఖరీదు చేసెదరు. పూర్వపు ఇండ్ల రిపేర్లు చేయుదురు. వ్యాపార, వృత్తి, ఉద్యోగములు అనుకూలము. ఆదివారములందు గ్రామదేవతల పూజలు, ప్రసాద వితరణ చేసిన ఇంటి శాంతి, గ్రామశాంతి కలుగును.
అక్టోబర్ : ఈ నెల విద్యార్థులకు చికాకులు. నిరుద్యోగ సమస్యలు, విద్యా సమస్యలు. శుభ కార్యములతో సంచారము. స్థిరాస్తి విషయాలలో అనుకూలముగా యుండి ధనాన్ని ఖర్చు చేస్తారు. స్త్రీలతో సమస్యలు. వృత్తి, వ్యాపార వర్గముల వారికి మిశ్రమాదాయము. బుధ వారములందు బుధునికి ఉత్తరేణి పత్రీతో పూజలు చేసి పెసర అన్నం నివేదనము చేసిన గృహ యోగము, వ్యాపార సమస్యలు తీరును.
నవంబర్ : ఈ నెల మీ నిర్ణయములతో సంచరించి, సకాలములో ధనాన్వేషణములు సాధించితీరుతారు. భార్య బిడ్డలకు ఆభరణములను తెచ్చెదరు. బంగు సంయోగ సంచారములు. సమాజములో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించి ధన వ్యయముతో రాజకీయ ప్రవేశములు, వృత్తి, వ్యాపార, ఉద్యోగములందు ధనాదాయము. గురువారము గురునికి పచ్చని పూలు, రావి ఆకులతో పూజలు చేసి శనగపప్పు, పూర్ణపు బూరెలు నివేదించి, స్త్రీలకు పనుసు, కుంకుమ వితరణ చేసిన రాజయోగములచే ధనవంతుల గుదురు.
డిసెంబర్ : ఈ నెల ప్రయాణములలో శారీరక బాధలు. దుర్మార్గుల స్నేహము విడుచుట మంచిది. శారీరక ఆందోళనలతో ఆరోగ్యము దెబ్బ తినును. 'వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారములు రాణించక పోవచ్చును. మిశ్రమ స్పందనతో సంచారములు. స్త్రీ మిత్రత్వము ధనమునిచ్చును. ఆదివారము లందు తెల్ల జిల్లేడు ఆకులతో ఆక సూర్యుని పూజించిన దీర్ఘ వ్యాధులు శాంతించును.
జనవరి : ఈ నెల ఆరోగ్యము బాగుండును, స్త్రీ సౌఖ్యము, మాట పట్టింపులు తొలగును, శారీరక శ్రమ తగ్గును. ప్రయాణములందు తగు జాగ్రత్తలు అవసరము. ఉన్నత వ్యక్తుల కలయిక, జీవితం ఆనందంగా గడుపుతారు. శనివారములందు వేంకటేశ్వరుని దర్శనము, అయ్యప్పస్వామి దర్శనము సకల శుభములను కలుగచేయును. ధనప్రాప్తి కలుగును.
ఫిబ్రవరి : ఈ నెల అన్నిరంగములవారికి ధనాదాయము మిశ్రమము, వృత్తి వ్యాపారములు రాణించవు. సంతాన సౌఖ్యము తగ్గును, ఆర్థికంగా అనుకూలంగా యున్నా సమస్యలు వచ్చును. ఆరోగ్యము కుదురుగా యుండును. బుధవారము నందు విఘ్నేశ్వరుని పూజలు, బుధగ్రహ పూజలు ప్రసాద వితరణ చేసిన సకల విఘ్నములు తొలగి శుభములు కలుగును.
మార్చి : ఈ నెల ఆరోగ్యములో కొద్దిగా మార్పు రావచ్చును, మిశ్రమాదాయము, ఆదాయము కష్టముగా వచ్చును, శ్రమించుట ముఖ్యము. "వృత్తి ఉద్యోగ వ్యాపార విషయములందు మిశ్రమముగా ఆదాయము వచ్చును. గురువారములందు రామాలయ సీతారాముల దర్శనము, పూజలు, ప్రసాద వితరణము వలన సకల కష్ట నష్టములు తొలగును సర్వాభిష్టములు కలుగును.