||టీటీడీ కీలక నిర్ణయాలు||
TTD Key Decisions | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కాలినడకన దర్శించుకొనే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. కాలినడకన వచ్చే ప్రతి భక్తుడికి చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయించింది. చిరుత చిన్నారి లక్షితను చంపిన ఘటన నేపథ్యంలో భక్తులకు ఆత్మరక్షణ కల్పించుకొనేలా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల తర్వాత కాలినడకన అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతి ఇవ్వనున్నట్లు తేల్చి చెప్పింది.
భక్తుల భద్రత దృష్ట్యా డ్రోన్లు వాడాలని, వాటితో నిఘా ఉంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో భక్తుల భద్రత కోసం నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని నియామకానికి చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయనుంది. అటు.. కొండపైన వ్యర్థ పదార్థాలు బయట వదిలేసే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో వెల్లడించారు.