||తిరుమల తిరుపతి దేవస్థానం||
తిరుమల న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలా అధికారిక వెబ్‌సైట్‌ను మార్చింది. ఒకే సంస్థ.. ఒకే వెబ్‌సైట్.. ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో అధికారిక ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను మార్చినట్లు టీటీడీ వెల్లడించింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న https://online.tirupatibalaji.ap.gov.in/ వెబ్‌సైట్‌ను https://ttdevasthanams.ap.gov.inకు మార్చినట్లు వివరించింది. ఇక నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని సూచించింది.
కాగా, శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకొనే వారికోసం స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు (16వ తేదీ నుంచి 31వ తేదీ కోసం) ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇక, జనవరి నెల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లు 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి.