‘వెనుకటికి ఎవరో రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుందని అడిగాడట’.. రామాయణానికి సంబంధించి చాలా పాపులర్ అయిన సామెత ఇది. అలాంటి ప్రశ్నలు వేసేవాడు వెర్రివాడని కన్ఫర్మ్ చేసే భావనలో ఈ సామెత జనం నోళ్లలో నానుతూ ఉంటుంది. ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం మహాకవి ఆరుద్ర ఈ ప్రశ్న వేశాడు..? రాముడికి సీత ఏమవుతుందని?
సీతారాముడు
‘వెనుకటికి ఎవరో రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుందని అడిగాడట’.. రామాయణానికి సంబంధించి చాలా పాపులర్ అయిన సామెత ఇది. అలాంటి ప్రశ్నలు వేసేవాడు వెర్రివాడని కన్ఫర్మ్ చేసే భావనలో ఈ సామెత జనం నోళ్లలో నానుతూ ఉంటుంది. ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం మహాకవి ఆరుద్ర ఈ ప్రశ్న వేశాడు..? రాముడికి సీత ఏమవుతుందని? ఎందుకు ఈ ప్రశ్న ఉదయించింది? నిజంగా ఇది జవాబు చెప్పాల్సిన ప్రశ్నేనా..? నిన్నటి తరానికి, ఇవాల్టి తరానికి రేపటి తరానికి కూడా నిద్రలో లేపి అడిగినా రక్కున జవాబు చెప్పే జగమెరిగిన సత్యాన్ని ప్రశ్నించటం ఏమిటి? ప్రపంచంలో మరే జాతికీ లేని విధంగా మన మూలాలను మనం ప్రశ్నించుకోవటం అనేది మనకు మాత్రమే చెల్లింది.. అందులో ఒకటే ఈ ప్రశ్న.. దీనికి జవాబు ఏమిటి?
రామాయణం, రాముడు.. సీతారాములు.. వేల సంవత్సరాల నాటి చరిత్ర... అఖండ భారతమంతటితో అనుబంధం పెనవేసుకున్న చరిత్ర. ఆదికవి వాల్మీకికి నారదుడు విశదీకరించి చెప్పిన కథ.. మానవజాతి చరిత్రలోని మాననీయ అంశాలను జాతికి అందించిన మహా ఇతిహాసాలకు ఆది కావ్యమిది.. భూమికి భారంగా మారిన దుష్టశక్తులను నిర్మూలించేందుకు విష్ణువు శ్రీరామచంద్రుడిగా, ఆది లక్ష్మి సీతాదేవిగా అవతరించిందని మనకు తెలుసు. అయోధ్య రాజు దశరథుడి కుమారుడిగా నారాయణుడు జన్మిస్తే, జనకుడి ఇంట సీతాదేవిగా లక్ష్మీదేవి అవతరించి, లోక కంటకాన్ని తొలగించారు. రామాయణం చెప్పని ఆదర్శం లేదు.. చూపించని ధర్మం లేదు.. నిరూపించని సత్యం లేదు. అలాంటి రామాయణంలో సీతారాముల బాంధవ్యాన్ని ప్రశ్నించటం అర్ధంలేని ప్రశ్న.. చిన్నపిల్లవాణ్ణి అడిగినా సీత రాముడికి భార్య అవుతుందని చెప్తాడే తప్ప.. మరో మాట చెప్పడు.. సీతారాముల నింద ఈ దేశంలో భరించరానిది. రామ తిరస్కారం సహించరానిది. అలాంటి దేశంలో.. 90 శాతం ప్రజానీకానికి వేల సంవత్సరాలుగా విశ్వాసప్రాతమైన రామాయణాన్ని ప్రశ్నించటం వెర్రితనమేనా? ఇప్పుడు ఎందుకు ఈ మాత్రమే పరిమితమైనవి.. రాముడి కథకు, సీత చరిత్రకు ప్రామాణికం కేవలం వాల్మీకి రామాయణమే. మరి సీత గురించి వాల్మీకి చెప్పింది ఏమిటి? వాల్మీకి రామాయణం ప్రామాణికంగా తీసుకోవటానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో నిక్షిప్తమైన రామ కాల నిర్ణయం ఇందుకు మూలం.. భారతీయ నాగరికత ప్రాచీనతను ఇది నిరూపిస్తుంది.
ఇక సీత రాముడికి ఏమవుతుందన్న తొలి ప్రశ్న గురించి చర్చిద్దాం.. సీత భూమి నుంచి పుట్టింది.. కాబట్టి భూదేవి కుమార్తె..! ఈ వాదనే విడ్డూరమైంది. ఆమె భూమిలో ఒక పేటికలో దొరికింది.. భూమిలో జన్మించలేదు.. ఇది స్పష్టం, రామావతార కార్యంలో ప్రధాన పాత్ర పోషించేందుకు భూమి ఒడిలోనుంచి జనకుడి ఇంట ప్రవేశించింది. ఆమె ఎవరి కూతురూ కాదు. ఆమె అయోనిజ. సామాన్య మానవిలా తల్లి గర్భం నుంచి పుట్టిన యువతి కాదు. ఆనంద రామాయణం ప్రకారం చూసినా అగ్ని నుంచి పుట్టిన వేదవతి బూడిదగా మారి లంకలో పాపాయిగా అవతరించి, అక్కడి నుంచి పేటికలో ప్రవేశించి సముద్ర మార్గంలో మిథిలకు చేరుకుంది. అక్కడ భూమిలో జనకుడికి దొరికింది. అందువల్ల ఆమె భూదేవి కూతురు కాదు.. ఆమె ఈ భూమ్మీద అవతరించటం కోసం భూదేవిని ఒక మార్గంగా ఉపయోగించుకుంది. కాబట్టి సీతారాముల సంబంధాన్ని ప్రశ్నించే అవసరమే ఉత్పన్నం కాదు. సీత అంటే నాగటి చాలు అని అర్ధం. భూమి అధోజగత్తుకు ప్రతీక.. అంటే కింది లోకాలకు ఉపరితలం భూమి.. వికసిస్తున్న చైతన్యానికి భూమిని సింబాలిక్ గా భావిస్తారు. ఈ చైతన్యమే జనక మహారాజు’ అన్నది వాల్మీకి కథాంశంలో ప్రధాన అర్థం. ఈయన తన నాగలితో భూమిలో దారి ఏర్పాటు చేసి అందులో దాగి వున్న కుండలిని శక్తిని పైకి తీసుకువచ్చాడు.. ఆమె సీత అయింది. మనిషిలో మూలాధారం నుంచి తల దాకా ఆరు చక్రాలు ఉంటాయని అంటారు. ఇందులో మూలాధారం నుంచి సహస్రారం దాకా కుండలిని సర్పరూపంలో ప్రయాణిస్తుందిట., ఇందులో సీత మూలాధారం అయితే.. రాముడు సహస్రారం. వాల్మీకి తన రామాయణం గురించి తానే స్పష్టంగా చెప్పుకున్నాడు.. రామాయణంలో రాముడి కథ ఎంత ప్రధానమో., సీత కథ అంతే ప్రధానమన్నాడు. భూమ్మీద రాముడు దుష్టశిక్షణ కోసం అవతరిస్తే.. ఆయన తన లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రధానంగా సహకరించింది సీతాదేవే. సీత లేకుంటే రావణ సంహారమనే రామకార్యం నెరవేరేదే కాదు. గగనతలంలో వేయికిరణాలతో ప్రకాశించే సూర్యుడే నారాయణుడు. సౌర మండలంలో మధ్యలో ఈయన ఉంటాడు. ఈ సూర్యనారాయణుడు తానే నాలుగు వ్యూహాలుగా మారి, నాలుగు వేదాలుగా మారి రామ లక్ష్మణ భరత శతృఘ్నులుగా పుట్టారట. రామావతార కథ భూమ్మీద దైవశక్తులను బలపరచటానికి, రాక్షస శక్తులను బలహీనం చేయటానికి ఉద్దేశించిందే. రాముడు ఆకాశం నుంచి దిగివచ్చిన చైతన్యమైతే.. సీతాదేవి భూమి నుంచి ఉబికి వచ్చిన మహాశక్తి, భూమ్యాకాశాల మధ్య విశ్వశ్రేయస్సును సాధించాలన్న లక్ష్యమే ఈ ఇద్దరి అవతారం. అందుకే సీతాదేవి ఎవరంటే.. చెప్పాల్సింది ఒకే ఒక్కమాట... ఆమె తాను ముందుండి రాముడిని నడిపించిన ఆదిశక్తి.
వాల్మీకి అరణ్యపర్వం మొదట్లోనే ఆమె చాలా స్పష్టంగా వివరిస్తుంది.. నేను మీకంటే ముందు నడుస్తూ దారిలో ఉన్న ముళ్లను, రాళ్లను తీసివేస్తానని.. తాను చెప్పినట్లుగానే ఆమె ముందే లంకకు చేరుకుంది.. రాక్షస శక్తులను బలహీనం చేసింది. త్రిజట లాంటి రాక్షసుల్లో కలలో కూడా నిద్ర లేకుండా చేసింది.. విభీషణుడి లాంటి సాత్వికులను రావణుడి నుంచి దూరం చేసింది. రావణుడికి సైతం భయాన్ని కలిగించింది. శతకంఠ రామాయణం అనే మరో రామాయణంలో ఆదిపరాశక్తే సీతాదేవిగా అవతరించి రాముడి కంటే ముందే లంకకు చేరుకుని సర్వరాక్షస సంహారానికి పునాది వేసిందని పేర్కొంది. సీతారాముల కలయిక ఈ పరమ ప్రయోజనాన్ని సాధించటం కోసమేనన్నది స్పష్టం. వనవాసానికి రాముడితో బయలు దేరటం మొదలుకొని, మాయలేడి కావాలని కోరటం వంటివన్నీ కూడా రావణ సంహారానికి సీతాదేవి చేసుకుంటూ పోయిన దారిలో భాగమే.. ఈ కథలన్నీ పుట్టుకురావటానికి అసలు కారణం లేకపోలేదు. సమాజంలో అత్యంత విశ్వసనీయమైన ఆరాధ్య దైవాలుగా సీతారాములు శతాబ్దాల తరబడి కొనసాగు తున్నారు. ధర్మానికి నిలువెత్తు విగ్రహం ఎవరంటే రాముడని చెప్పే పరిస్థితి. పబ్లిక్ లైఫు రోల్ మోడల్ ఎవరంటే సీతారాములు అనే పరిస్థితి. అలాంటి విశ్వాసం ఉన్న సమాజంలో వాళ్ల పేర్లతో, పాత్రలతో.. కథలతో ఏదైనా చెప్తే ఆ చెప్పేది మరింత విశ్వసనీయ మవుతుంది.. అందులో మంచి ఉండవచ్చు. చెడు ఉండవచ్చు. దేన్నైనా వ్యాపింపచేయటానికి తేలికైన మార్గం ప్రజల్లో బలంగా వేళ్లూనుకునిపోయిన నమ్మకాన్ని ఆసరా చేసుకుని నడవటం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని వేల రామాయణాలు పుట్టుకొచ్చాయి. దేన్నైనా అబ్సార్ప్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఈ దేశంలోని మెజారిటీ ధర్మంలో ఉంది కాబట్టే, ఇన్ని పుట్టుకథలు.. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కానీ, సీతారాముల కథ భారతీయ జాతీయ మూలం., ఈ మూలాన్ని ఛేదించటం వేల సంవత్సరాలుగా ఎవరివల్లా కాలేదు.. ఇకముందూ ఎవరికీ సాధ్యంకాదు.
- కోవెల సంతోష్ కుమార్, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు