గుమ్మడికాయ ఇంటి ముందు కట్టకోవడం చాలా మంచిది అని పెద్దలు చెబుతారు. వాస్తు ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కట్టుకోవాలి? ఎప్పుడు కట్టుకోవాలి? అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? గుమ్మడికాయ కట్టకపోతే నష్టంమేంటి అని తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవడం చాలా మంచిది అని పెద్దలు చెబుతారు. వాస్తు ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కట్టుకోవాలి? ఎప్పుడు కట్టుకోవాలి? అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? గుమ్మడికాయ కట్టకపోతే నష్టంమేంటి? అన్న సమాచారం తెలుసుకుందాం. మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు, సంతోషంగా ఉన్న కుటుంబాన్ని చూసి ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి మన కుటుంబంపై పడుతుంది. ఏ కుటుంబంపై నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబానికి తరచూ సమస్యలు ఎదురవడం, కుటుంబం మొత్తం అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. తరచూ అందోళనలు వంటి సమస్యలు మొదలవుతాయి. నరదృష్టికి నల్ల రాయి అయినా పగులుతుంది అని పెద్దలు చెప్తుంటారు.
కూరగాయలలో సంవత్సరం మొత్తం పాడవకుండా నిలువ ఉండేది గుమ్మడికాయ ఒక్కటే. అంత శక్తి కలిగిన గుమ్మడికాయను మనం దృష్టిదోష నివారణకు గుమ్మంపై కట్టుకుంటాం. కొందరి ఇంట్లో కట్టిన కొద్ది రోజులకే అది పాడైపోతూ ఉంటుంది. ఇలా తరచూ పాడైపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది నరదృష్టి ఎక్కువగా ఉండటం, రెండోది ఆ ఇంటిపై నకారాత్మక శక్తి ఎక్కువగా ఉన్నందున అని పెద్దలు చెబుతుంటారు. ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టడం మంచిది అని జ్యోతిష్య నిపుణులు చెప్తుంటారు. గుమ్మడికాయను సంస్కృతంలో కూష్మాండం అని పిలుస్తారు. కూష్మాండం అంటే అమ్మవారి స్వరూపం. కూష్మాండదేవి తన యుక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని పురాణాలు చెప్తున్నాయి. కూష్మాండాదేవి అమ్మవారు రూపం దాల్చిన తర్వాత ఆవిడ తన శక్తితో సూర్య చంద్రులను సృష్టించింది. సూర్యుడికి శక్తిని ఇస్తున్నటువంటి దేవత కూష్మాండాదేవి. కూష్మాండాదేవి అంత గొప్పదేవత కాబట్టి ఆ దేవతలో అన్ని శక్తులు నిమిడి ఉంటాయి అని వేదాలు మనకి చెప్తున్నాయి.
హృదయంలో మనకి ఎటువంటి కుళ్లు, కలష్మం, మాయ, మోసము, దుర్బుద్ధి ఇవన్నీ ఉండకూడదు. ఇలాంటివి ఉంటే పోవాలని చెప్పి కూష్మాండాన్ని మన ఇంటికి కట్టడానికి, దిష్టి తీసి పారవేయడం కాని చేయవచ్చు అని పెద్దలు చెబుతారు. అంటే మనలో ఉండే అటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దిష్టిరూపంలో తీసి కూష్మాండరూపలో అంటే గుమ్మడికాయ రూపంలో బయట పడేస్తున్నాం. అలాగే బయటనుంచి మన ఇంటిమీద పడే దుష్టశక్తులను అంటే నరదిష్టి, వీధిశూల దిష్టి, ప్రయోగదోషాలు, పీడపిశాచులు ఏవైనా కానీ మన ఇంటిలోనికి ప్రవేశించకుండా కాపాడే శక్తి ఉన్నటువంటిది ఈ గుమ్మడికాయ.
ఈ గుమ్మడికాయను ఆదివారం రోజు లేదా అమావాస్య రోజు ఎక్కువగా కడుతూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం సూర్యునికి సంబంధించిన రోజు, సూర్యునికి శక్తి ఇచ్చింది కూష్మాండదేవి కాబట్టి ఆ రోజు కట్టడం శ్రేష్ఠం. అమావాస్య రోజు ఎందుకు కట్టాలి అంటే అమ్మవారు విపరీతమైన శక్తి స్వరూపంగా మారుతుంది. మామూలు రోజుల కంటే ఆ రోజు శక్తి కోటి రెట్లు పెరుగుతుంది. కాబట్టి అమావాస్య రోజు గుమ్మడికాయ ఇంటిముందు కట్టుకోవాలి అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇంటిముందు కట్టిన గుమ్మడికాయ పాడైతే మీకు తగలాల్సిన దోషాలు, దిష్టి అంతా గుమ్మడికాయ తీసుకుని పాడైపోతుంది. పాడైపోయిన గుమ్మడికాయను ఇంటిముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి. ఎప్పుడైన సరే పాడైన గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీయకూడదు.