శ్రీరామనవమి ఏ తేదీన.. ఏ సయమంలో జరుపుకోవాలంటే..

హిందువులు జరుపుకునే వేడుకల్లో శ్రీరామ నవమి ఒకటి. అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండగ ఇది. శ్రీరామ నవమి పండగ అంటే సాక్షాత్తు శ్రీరాముని జన్మదిన వేడుక. అలాంటి పండగ 2025వ సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది?

sri rama navami

ప్రతీకాత్మక చిత్రం

హిందు సంప్రదాయం ప్రకారం ప్రతి పండగకి ఒక ప్రత్యేకమైన ఆనవాయితీ ఉంటుంది. హిందువులు జరుపుకునే వేడుకల్లో శ్రీరామ నవమి ఒకటి. అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండగ ఇది. శ్రీరామ నవమి పండగ అంటే సాక్షాత్తు శ్రీరాముని జన్మదిన వేడుక. అలాంటి పండగ 2025వ సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది? నవమి తిధి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? అలాగే పునర్వసు నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఈ రోజున శ్రీరామ చంద్రమూర్తికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి? ఈ రోజున స్వామి వారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? అలాగే చదవాల్సిన శ్లోకాలు, స్తోత్రాలు ఏమిటి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. 

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహం 12 గంటల సమయంలో త్రేతా యుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యతో పట్టాభిషక్తుడు అయింది కూడా ఇదే రోజు. అంతేకాకుండా ఈ రోజునే శ్రీ సీతారాముల వారి కల్యాణం కూడా జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారాముల వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి? బంధాలను ఎలా గౌరవించాలి? ఎలా కాపాడాలి? అని ఆచరించి చూపించాడు. శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం జరిపిస్తే సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పెళ్లి కాని ఆడపిల్లలు, వివాహంలో ఏమైనా అడ్డంకులు ఉన్నా సీతారాముల వారి కల్యాణంలోని అక్షింతలు తలపై వేసుకుంటే అన్ని అడ్డంకులు తొలిగిపోయి, శీఘ్రంగా వివాహం జరుగుతుంది అని పెద్దలు చెబుతారు.

2025వ సంవత్సరంలో శ్రీరామనవమి పండగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్ర మాసం వసంత ఋతువు శుక్ల పక్షం నవమి తిథి ప్రారంభం ఏప్రిల్ 5న శనివారం రాత్రి 12 గంటల 27 నిమిషాల నుండి 6వ తేది ఆదివారం రాత్రి 11 గంటల 32 నిమిషాల వరకు తిథి ఉంటుంది. హిందు చాంద్రమానం ప్రకారం మనం ఏ పండగ అయినా సరే సూర్యోదయంతో ఏ తిథి ఉంటుందో ఆ తిథినే మనం పరిగణనలోకి తీసుకుంటాం. కాబట్టి నవమి తిథి సూర్యోదయంతో ఏప్రిల్ 6న ఆదివారం రోజున ఉంది. కాబట్టి ఏప్రిల్ 6 ఆదివారం రోజునే శ్రీరామనవమి పండగను జరుపుకోవాలి. ఆ రోజున నక్షత్రం పునర్వసు పగలు 10 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభం అవుతుంది.

ఈ రోజున శ్రీరామచంద్రమూర్తికి పూజ చేయుటకు శుభ, అశుభ సమయాలు ఎప్పుడంటే..

శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 21 నిమిషాల వరకు. అభిజిత్ హుహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు.

అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 54 నిమిషాల నుంచి 6 గంటల 26 నిమిషాలవరకు. 

యమగండం : మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుంచి 1 గంట 50 నిమిషాల వరకు.

దుర్మూహూర్తం: సాయంత్రం 4 గంటల 48 నిమిషాల నుంచి 5 గంటల 37 నిమిషాల వరకు.

వర్జ్యం: మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుంచి 3 గంటల 28 నిమిషాల వరకు.

శ్రీరామనవమి రోజున పూజ చేసే సమయంలో శ్రీరామ అష్టోత్తరాన్ని, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామాష్టకము, శ్రీరామ సహగ్రము, శ్రీమద్ రామాయణం స్తోత్రాలతో శ్రీరామున్ని పూజించుకోవాలి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా పానకము వడపప్పు, చలిమిడి, కమలాకాయలు, అరటిపండ్లు వంటివి సమర్పించాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్