పరిపూర్ణ మానవుడు శ్రీరామచంద్రుడు.. రామాయణానికి అంకురార్పణ జరిగింది అక్కడే..

రామో విగ్రహావాన్‌ ధర్మః అన్నారు. అంటే మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. మానవుడు ఎలా నడుచుకోవాలో..ఎలా ఉండాలో చెప్పిన మార్గమే రామాయణం. వాల్మీకి మహర్షి రామాయణం కావ్యాన్ని అందించి ప్రపంచానికి మార్గం చూపిన మహానుభావుడు.

SRI RAMA NAVAMI

ప్రతీకాత్మక చిత్రం

రామో విగ్రహావాన్‌ ధర్మః అన్నారు. అంటే మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. మానవుడు ఎలా నడుచుకోవాలో..ఎలా ఉండాలో చెప్పిన మార్గమే రామాయణం. వాల్మీకి మహర్షి రామాయణం కావ్యాన్ని అందించి ప్రపంచానికి మార్గం చూపిన మహానుభావుడు. రాముడు ఎంతగొప్పవాడో... రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి కూడా అంతే గొప్పవడాని చెప్పాలి. భూవ్మిూద రాముడు మానవుడిగా నడయాడి ధర్మాన్ని ఆచరించి చూపిన మహానుభావుడు. అందుకే మహాత్ముడైన  రాముడి నడక నేటికీ అనుసరణీయంగా మారిందని చెప్పుకుంటుంటాం. అవతార పురుషుడుగా, మానవాళికి మంచి మార్గాన్ని చూపేందుకు మనిషి రూపంలో భూమి విూద జన్మించిన మహావిష్ణువు ఎందరికో ఇలువేల్పుగా నిత్యం నీరాజనాలందుకుంటున్న వాడు శ్రీరామ చందప్రభువు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు మానవుడిగా  అవతరించిన అవతారం రామావతారం. రామాయణ కాలాన్ని త్రేతాయుగంగా చెప్పుకుంటున్నా అది ఎప్పుడు జరిగిందన్నది ఇప్పటికీ లెక్క కట్టలేకున్నా, ఆ సీతారాములు మాత్రం నిత్యం మన ఇళ్లలో కొలువై ఉంటున్నారు. వాల్మీకి మహర్షి విరచిత రామాయణ మహాకావ్యానికి అంతటి ఉత్కృష్టత ఉంది. శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవుడిగా దాల్చిన అవతారం శ్రీరామావతారం. మానవ రూపంలో భూమిపై అడుగుపెట్టిన ఆ దివ్యమూర్తి పురుషోత్తముడిగా ఎలా ఉండాలో ఆచరణలో చూపించాడు. చైత్ర మాసం నవమినాడు జన్మించిన శ్రీరాముడు ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా రామరాజ్యాన్ని నెలకొల్పాడు. రామాయణం సకల ధర్మాలకు నిధి. రామాయణ కథానాయకుడు ధర్మాలన్నీ మూర్తీభవించినట్టున్న శ్రీరామచంద్రుడు. ఇంతటి సకల ధర్మసారం కనుకనే రామాయణం నేటికీ ధర్మాలన్నిటికీ ప్రామాణిక మైంది.వాల్మీకి శోకంతో చెప్పిన శ్లోకం ఛందోబద్ధ మైనదని, దాన్ని అనుసరించి రామాయణ మహాకావ్యాన్ని రచించమని బ్రహ్మ అన్నాడు.

లోకంలో పర్వతాలు, నదులు,సముద్రాలు ఉన్నంత కాలం రామాయణం విరాజిల్లుతూ శాశ్వత కీర్తిని సంపాదించుకొని ఉంటుందని చెప్పాడు.  మహర్షి వాల్మీకి ఆదికవే కాక వేదాంతి, దార్శనికుడు, తపస్వి, ప్రజలకు మార్గదర్శకుడు కూడా. అలాంటి వాల్మీకి రామాయణ రచన కోసం బ్రహ్మ  నుంచి ప్రేరణ పొందాడు. ఓ రోజున ఆయన శిష్యులతో కలిసి తమాసా నదీ తీరానికి స్నానం కోసం వెళ్లినప్పుడు క్రౌంచపక్షుల జంటలోని మగపక్షిని ఓ వేటగాడు బాణంతో కొట్టాడు. ఆ దెబ్బకు ఆ పక్షి కిందపడి ప్రాణాలను విడిచింది. ఆ దృశ్యాన్ని చూసిన మహర్షి హృదయం కరుణ రసంతో ద్రవించింది. కళ్లు చెమ్మగిల్లాయి. కంఠం గద్గదమైంది. వెంటనే ’మానిషాద’ అనే శ్లోకం ఆయన నోటివెంట అప్రయత్నంగా వచ్చింది. మనసు ఎంతో కల్లోలమైంది. ఆ పరిస్థితుల్లో మరోసారి బ్రహ్మదేవుడు వాల్మీకికి ధైర్యం చెప్పి ఆశీర్వదించాడు. బ్రహ్మదేవుడి ఆ మాటలు వాల్మీకికి మరింత ప్రేరణనిచ్చాయి. ఆ వెంటనే ఆయన యోగాసీనుడై రామచరితంలోని ఘట్టాలను, దృశ్యాలను తన మనోనేత్రంతో చూడగలిగాడు. ఆ వెంటనే రామాయణ రచనకు అంకురార్పణ జరిగింది.  ఆయనకు సంబంధించిన ప్రధానమైన పండుగ శ్రీరామనవమి. చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్‌ ముహుర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. అందుకే ఈ పుణ్యదినాన్ని తరతరాలుగా శ్రీరామనవమి పండుగగా అందరూ నిర్వహించు కుంటున్నారు. అలాగే శ్రీరాముడి కళ్యాణం, రాముడు రావణుడిని జయించి అయోధ్యకు తిరిగి వచ్చింది కూడా నవమి నాడేనని పెద్దలు చెబుతారు. అందుకే నవమికి ప్రాధాన్యం ఏర్పడింది.

విశ్వామిత్రుడితో అరణ్యానికి వెళ్లిన రాముడు స్వయంవరంలో శివధనస్సును విరిచి సీతను పరిణయమాడాడు. శ్రీరాముడి వివాహం ఆహ్వానాన్ని తెలుసుకున్న దధరథుడు మిథిలకు ప్రయాణమయ్యాడు. చతురంగ బల సమేతుడై వశిష్ఠ వామ దేవ తదితర మహార్షులను వెంటపెట్టుకుని మిథిలానగరానికి చేరాడు. దశరథ మహారాజు ఆగమన వార్తను తెలుసుకుని జనక మహారాజు తన పురోహితుడైన శతానందుడిని వెంటపెట్టుకుని ఎదురు వెళ్లి సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానించాడు. తన కుమార్తెను శ్రీరామచంద్రుడికి భార్యగా స్వీకరించమని అభ్యర్ధించాడు. దశరథ మహారాజు ఎంతో సంతోషంతో తన సమ్మతిని చెప్పడంతో జనకుడి ఆనందానికి అవధులు లేవు. వెంటనే తన తమ్ముడైన కుశధ్వజుడిని పిలిపించి కల్యాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ త్వరితగతిన చేశాడు. దశరథ మహారాజు పురోహితుడైన వశిష్ఠ మహార్షి విశ్వామిత్రుడు అంగీకారాన్ని తీసుకుని దశరథ మహారాజు వంశ వృక్షాన్ని వివరించి చెప్పాడు.

దశరథుడి వంశంలో బ్రహ్మ, మరిచీ, కశ్యపుడు, సూర్యుడు, మనువు, ఇక్ష్వాకుడు, దిలీపుడు,  రఘువు లాంటి ఉత్తములు జన్మించారని, కనుక దశరథుడి వంశవృక్షం మహోన్నత మైందని వశిష్టుడు వివరించాడు. ఈ సందర్భంలో జనక మహారాజు వధువు పక్షం వారు వివాహ సమయంలో ఎంత వినమ్రంగా ఉంటారనటానికి చక్కని ఉదాహరణగా ప్రవర్తించాడు. తన వంశవృక్షాన్ని తానే స్వయంగా వివరించి చెప్పటంలో ఈ వినమ్రత కనుపిస్తుంది. తన వంశంలో నిమిచక్రవర్తి, మిధిచక్రవర్తి, జనకుడు, ఉదావసుడు, నంది వర్ధనుడు,  హ్రస్వరోముడు, జనకుడు ఇలా వివరించారు.   ఇలా తనవంశ వృక్షాన్ని స్వయంగా దశరథ మహారాజుకు వివరించాడు జనకుడు. ఈ విధంగా పరస్పరం వంశ వృక్షాల వివరణ అయిన తరువాత కల్యాణానికి అంతా సిద్ధమయ్యారు. శ్రీరామ చందప్రభువుకు సీతమ్మను, లక్ష్మణుడికి ఊర్మిళను భరతుడికి మాండవిని, శత్రుఘ్నడికి శ్రుతకీర్తినిచ్చి వివాహం ఎంతో వైభవంగా జరిపించారు. ఆ తరవాత సీతాకళ్యాణం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతా సీతారాముల లాగా వైభవంగా వివాహ మహోత్సవం జరుపుకోవాలని, అంత నిరాడంబరంగా జీవించాలని కోరుకుంటారు. అందుకే రాముడు, సీత ఆదర్శ పురుషులయ్యారు. నిత్యం వారు మనకు ఆరాధ్యులు అయ్యారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్