||ప్రతీకాత్మక చిత్రం||
(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
నిత్యం తులసి కోట వద్ద, పూజాగదిలో దీపారాధన చేయవచ్చు. ఏదైనా కారణం వల్ల కొన్ని రోజులపాటు దీపారాధన చేసే అవకాశం లభించకపోవచ్చు. దానికి చింతపడవలసిన అవసరం లేదు అని చెబుతున్నాయి శాస్త్రాలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపోత్సవాలు విశిష్టమైన ఫలితాలు కలిగిస్తాయి. అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే దీపారాధన కార్తీక మాసంలో మాత్రమే చేయడం మనం చూస్తుంటాం. అటువంటి దీపోత్సవాల్లో పాల్గొనవచ్చు. కనీసం కార్తీక పౌర్ణమి నాడు లేదా ఆ మాసంలో ఏదైనా ఒక రోజు ఆలయంలో, నదీతీరంలో, పూజ గదిలో తులసి కోట వద్ద దీపారాధన చేయడం మంచిది. కార్తీక పౌర్ణమి నాడు సంవత్సరం మొత్తానికి గాను 365 వత్తులను వెలిగించే సంప్రదాయం ఉంది. ఆనాడు దీపారాధన చేస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసే ఫలితం లభిస్తుంది.
కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం ఎందుకు వెలిగిస్తారు?
వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే
దీపం వెలిగించడానికి ఒక ప్రమిద కావాలి. అదే మానవ దేహం పృథ్వి తత్వం వైరాగ్యంతో కూడిన తైలం నూనె కావాలి. ఇది జలతత్వం భక్తి అనే వత్తిని అందులో అది ఆకాశతత్వం వెలిగించడానికి అగ్ని కావాలి. వెలిగించిన తర్వాత దీపం అఖండంగా వెలగడానికి గాలి కావాలి. అది వాయు తత్వం ఇలా పంచ తత్వాలతో కూడినదే దీపం ఇలా పంచ తత్వాలతో కూడుకున్నదే దీపం. మానవుడిలో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరి పోసే ఉసిరికను దీపశికకు ఆధారం చేస్తాం. దేహంపై మమకారం వదిలిపెట్టడానికి, అజ్ఞానం వీడి జ్ఞానం పొందడానికి కార్తీకదీప దానం చేస్తాం.
కార్తీక మాసంలో దేవుడి దగ్గర పెట్టిన దీపం ఎంత సేపు వెలగాలి?
దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం. దీపం కనీసం గోదాహరణ కాలం పాటు వెలగాలన్నారు. అంటే ఆవు పాలు పితికేందుకు పట్టేంత కాలమైనా దీపం వెలగాలని అర్థం. సామాన్య పరిభాషలో అరగంట నూనె పోసి దీపారాధన చేయాలి. పూజ పూర్తి అయ్యాక మనంతట మనమే దీపం కొండ ఎక్కేలాగా చేయకూడదు. దాన్ని కొండ ఎక్కే వరకు అలా ఉంచాలి. పూజ మధ్యలో దీపం కొండ ఎక్కకుండా చూసుకోవాలి.