మొత్తం 7 కోట్ల మహా మంత్రాలున్నాయి. అందులో రెండక్షరాల ‘రామ’ అన్న మంత్రం చాలా శ్రేష్ఠమైనది. ఇది హరిహర తత్వం కలిసిన మహా మంత్రం. కలియుగంలో భగవంతుడి నామస్మరణను మించిన ఉత్తమ సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి.
రామ
మొత్తం 7 కోట్ల మహా మంత్రాలున్నాయి. అందులో రెండక్షరాల ‘రామ’ అన్న మంత్రం చాలా శ్రేష్ఠమైనది. ఇది హరిహర తత్వం కలిసిన మహా మంత్రం. కలియుగంలో భగవంతుడి నామస్మరణను మించిన ఉత్తమ సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నింటికన్నా.. ‘రామ’ నామానికి ఉన్న విశిష్ఠత మరే నామానికి లేదని చెప్తారు. ఎందుకంటే.. ఈ నామం శివకేశవులిద్దరినీ కలిపే నామం. రామ నామం ఎలా పుట్టిందో తెలుసా.. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో ‘రా’ అనే అక్షరం జీవాక్షరం. ‘రా’ అనే అక్షరం తొలగిస్తే ఓం నమో నాయణాయ అవుతుంది. అంటే.. ఆ మంత్రం అర్థం లేనిది అవుతుంది. అలాగే, ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రంలో ‘మ’ అనేది జీవాక్షరం. ఈ మంత్రంలో ‘మ’ అనే అక్షరం తొలగిస్తే ఓం నఃశివాయ అవుతుంది. అంటే శివుడు లేడని అర్థం. ఈ రెండు జీవాక్షరాల సమాహారమే.. ‘రామ’. అంటే.. శివకేశవుల సంఘటిత శక్తే ‘రామ’మంత్రం. అందుకే రామమంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్ఠమైన ముక్తిప్రసాద మంత్రం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
‘రా శబ్దోశ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః.. పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్’ (నోరు తెరిచి ‘రా’ అని చెప్పునప్పుడే పాపాలన్నీ నోటి నుంచి బయటికి పోతాయి. అవి లోపలికి ప్రవేశించకుండా ‘మ’కారం నోటిని మూసి బంధిస్తుంది) వివరంగా చెప్పాలంటే.. రామ అని పిలిస్తే అని పిలిస్తే సర్వపాపాలు బయటకు వెళ్లి శరీరం అంతఃశుద్ధి కలిగి పవిత్రత చేకూరుతుంది. ‘శ్రీరామ రామ రామేతి.. రమే రామే మనోరమే.. సహస్రనామ తత్తుల్యం.. రామనామ వరాననే’ అని పార్వతీదేవితో శివుడు ఉపదేశించాడు. ఈ మంత్రం అర్థం ఏంటంటే.. రామ నామం విష్ణు సహస్ర నామాలకు సమానం అని.
శివుడి ఉపదేశంతో రామ నామం పఠించిన పార్వతీదేవి.. శివుడి సాంగత్యాన్ని పొందింది. రామ నామం వల్లే శివుడు ప్రసన్నుడై తన శరీరంలో ఎడమ భాగాన్ని ఇచ్చాడు. రామ అన్న శబ్దాన్ని మరా అని జపించి దోపిడీ దొంగ వాల్మీకి మహామునిగా మారాడు. రామ నామస్మరణతో రాయిలా ఉన్న అహల్య.. రామ స్పర్శకు నోచుకొని పునీతురాలైంది. పార్వతీదేవికి శివుడు, వాల్మీకికి నారదుడు, భరద్వాజునకు వాల్మీకి, వ్యాసుడికి పరాశరులు, శుకులకు వ్యాసుడు ఉపదేశించిన అత్యంత శక్తివంతమైన మంత్రం.. ‘రామ’. అందుకే జైశ్రీరాం.. జైజై శ్రీరాం.