Geeta Jayanti | 5,161 ఏళ్ల నాటి భగవద్గీత.. నేటి జీవనానికీ ప్రమాణం

భగవద్గీత మానవాళికి అందిన రోజు.. సాక్షాత్తు శ్రీకృష్ణుడే గురువుగా మారి అర్జునుడికి జీవిత సత్యాలు, పరమాత్మ తత్వాన్ని బోధించిన రోజు.. మార్గశిర శుద్ధ ఏకాదశి.. అదే గీతా జయంతి. ఈ రోజునే మోక్షద ఏకాదని, ముక్కోటి ఏకాదశి అని కూడా జరుపుకుంటాం.

geetha jayanthi

ప్రతీకాత్మక చిత్రం

భగవద్గీత మానవాళికి అందిన రోజు.. సాక్షాత్తు శ్రీకృష్ణుడే గురువుగా మారి అర్జునుడికి జీవిత సత్యాలు, పరమాత్మ తత్వాన్ని బోధించిన రోజు.. మార్గశిర శుద్ధ ఏకాదశి.. అదే గీతా జయంతి. ఈ రోజునే మోక్షద ఏకాదని, ముక్కోటి ఏకాదశి అని కూడా జరుపుకుంటాం. సాధారణ భాషలో చెప్పాలంటే భగవద్గీత పుట్టిన రోజు. అర్జునుడికే కాదు.. కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకు, సందిగ్ధతకు సమాధానంగా భగవద్గీత ఈ నాటికీ ప్రమాణంగా నిలుస్తోంది. మనిషిని మనిషిగా జీవించేందుకు సన్మార్గంలో నడిపిస్తోంది.  శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కాబట్టి ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. భగవద్గీతలో వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను ‘గీత’ అని.. ‘గీతోపనిషత్తు’ అని కూడా పిలుస్తాం.

త్రేతాయుగంలో పాండవులు, కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరుగుతుండగా.. యుద్ధ భూమిలో అర్జునుడు తన వాళ్లను, రక్త సంబంధకులను చూసి యుద్ధం చేయలేనని, తన గురువు, సోదరుల మీద బాణాలు వేయలేనని చెప్పి ఆయుధాలను వదిలేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపం చూపించి.. అర్జునుడికి కర్తవ్య బోధన చేశాడు. అదే గీతోపదేశం. గీతోపదేశాన్ని భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు.. 700 శ్లోకాలు ఉన్నాయి. యుద్ధ సమయంలో 45 నిమిషాల పాటు అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను వివరించాడు. మోక్షం ఎలా పొందాలి? మనిషి తన జీవితంలో ఎలా నడుచుకోవాలి? జీవితంలో ఉన్నత స్థానానికి ఎలా ఎదగవచ్చు? వంటి అంశాలను ఆ పరమాత్ముడే స్వయంగా గీతలో చెప్పాడు. 

అర్జునుడికే గీతోపదేశం ఎందుకంటే..

భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి ఎంతోమంది ఉద్ధండులు ఉండగా.. శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడికే ఎందుకు గీత బోధ చేశాడు? లాంటి సందేహానికి పండితులు గొప్ప వివరణ ఇచ్చారు. యుద్ధం చేయబోనని అర్జునుడు అన్నప్పుడే గీత బోధ చేసినా.. అర్జునుడికే చెప్పటానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. శ్రీకృష్ణార్జునులు నరనారాయణులు. అర్జునుడు అనేక దేవతల మెప్పు పొంది అస్త్ర శస్త్రాదులతో పాటు పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సాధించాడు. బాల్యంలో అర్జునుడు సఖుడు, అనంతరం భక్తుడు. ఈ రెండిరటినీ పరిగణనలోకి తీసుకుని ‘రహస్యమైన గీతను ఉపదేశం చేశాను’ అని శ్రీకృష్ణుడే చెప్పాడు. యుద్ధం చేయడమే తన కర్తవ్యమని అర్జునుడికి కృష్ణుడు గుర్తుచేస్తాడు. మనో బలహీనతను అధిగమించాలని ఆదేశిస్తాడు. బాధతో, ఆందోళనతో రగిలిపోతున్న అర్జునుడికి.. గురువుగా మారి ఆత్మ శాశ్వతమైనదని, అది చనిపోదని బోధిస్తాడు. వ్యక్తి శరీరం మాత్రమే నశిస్తుందని, ఆత్మ అలాగే ఉంటుందని.. అందువల్ల బాధపడేందుకు ఏమీ లేదని వివరిస్తాడు. బుద్ధి-యోగంలో నిమగ్నమై, ఫలితాలతో సంబంధం లేకుండా పని చేయాలని సలహా ఇస్తాడు. అర్జునుడికే బోధ చేసినా.. సమస్త మానవులకు అవసరమయ్యేలా కర్మ జ్ఞాన భక్తి యోగాలు ఉపదేశం చేశాడు శ్రీకృష్ణుడు. 

‘ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతమ్‌.. ఏకోదేవో దేవకీ పుత్ర ఏవ.. ఏకో మంత్రస్య నామానియాని.. కర్మాప్యేకం తస్య దేవస్య సేవా’ అంటే.. గీతాశాస్త్రమే ఏకైక శాస్త్రం. దేవకీనందనుడు శ్రీకృష్ణుడే ఏకైక ద్కెవం. ఆయన నామాలు దివ్యమంత్రాలు. ఆయన సేవే సత్కర్మయుక్త ఏకైక సేవ అని ఆర్యోక్తి. సృష్టిలో పరిణామం, మార్పులు అనివార్యం. ఏది ఆదిలో ఉన్నట్లు అంతంలో ఉండదు. జీవితం పరిమిత కాలం. నియమిత కాలంలో చేయగలిగే మంచిపనులే అపరిమిత తృప్తిని ఇవ్వగలుగుతాయి. తద్వారా జన్మ సార్థకమవుతుంది. ఈ జీవన సత్యమే భగవద్గీత పరమోపదేశం. పండితులు, పురాణాల ప్రకారం.. ఈ ఏడాది ( 2024)తో గీతా జయంతి 5,161వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

గీతా జయంతి రోజున ఏం చేయాలంటే..

భగవద్గీత పారాయణం చేయండి. భగవద్గీత పుస్తకాన్ని దానం చేయండి.

గీతాజయంతి ప్రత్యేకత

‘మాసానాం మార్గశిర్షోహం’ అంటారు. అంటే.. అన్ని నెలలకు ఈ మాసం శిరస్సు వంటిది అని అర్థం. ఈ నెలలోనే కురుకేత్ర యుద్ధం ప్రారంభం అయ్యిందట. మార్గశిర మాసంలో శుక్ల పక్ష ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి.. అర్జునుడికి గీతా ఉపదేశం చేశాడు. అందుకే.. మార్గశిర మాసం పాడ్యమి నుంచి పౌర్ణమి రోజు వరకు ఎంతో పవిత్రంగా గీతాజయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హర్యానాలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. 

గీతా జయంతి శుభ సమయం:

తేది : డిసెంబర్ 11, 2024

శుభ ముహూర్తం (బ్రహ్మ ముహూర్తం):  ఉదయం 05:07 నుంచి 06:01 వరకు

అమృత కాలం: 09:34 నుంచి 11:03 వరకు

నిషితా ముహూర్తం: 1:03 నుంచి 11:03 వరకు

డిసెంబర్‌ 12 వరకు రవియోగం: ఉదయం 06:56 నుంచి 11:48 వరకు

అశుభ ముహూర్తం: (రాహు కాలం) - మధ్యాహ్నం 12:05 నుంచి 01:22 వరకు

భద్రకాలం: 02:27 నుండి 01:09 వరకు

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహమ్‌

 (ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి, అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో, అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటా)

 

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

 (సాధు, సజ్జనులను సంరక్షించటం కోసం, దుర్మార్గులను వినాశం చేయడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటా)


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్