ఆషాడ మాసం వచ్చిందంటే..గోరింటాకు గుర్తువస్తుంది. ఆషాడం గడిచేలోగా ఏదొక రోజు గోరింటాకు పెట్టుకోమని పెద్దలు చెబుతుంటారు. జ్యేష్టమాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాడం నాటికి జోరుగా కురుస్తుంటాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఆషాడ మాసం వచ్చిందంటే..గోరింటాకు గుర్తువస్తుంది. ఆషాడం గడిచేలోగా ఏదొక రోజు గోరింటాకు పెట్టుకోమని పెద్దలు చెబుతుంటారు. జ్యేష్టమాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాడం నాటికి జోరుగా కురుస్తుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానాల్సి వస్తుంది. పొలం పనులు చేసుకునేవాళ్లు ఏరు దాటాల్సి వచ్చేది. ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా ఉండలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతింటుంటాయి. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజులు ఆపుతుందని పెద్దలు చెబుతుంటారు. ఆషాడ మాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో కళకళలాడుతుంది. ఆ సమయంలో గోరింటాకు కోయడం వల్ల చెట్టుకు హానికలగదు. పైగా లేత ఆకులను దంచి చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పండుతాయి.
అయితే ఆషాడం నాటికి వాతావరణం చల్లబడుతుంది. వాతావరణంలో ఆకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడుతుంటాయి. గోరింటాకుకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా గోరింటాకు కాపాడుతుంది.
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి వస్తారు. ఆ సమయంలో తమ చేతులను ఎర్రగా పండించుకునే గోరింట,తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుందని పండితులు చెబుతున్నారు.వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసురిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని కూడా చెబుతుంటారు.