రాముడు ఎప్పుడు పుట్టాడో తెలుసా.. రావణుడితో యుద్ధం జరిగిన తేదీ ఎప్పుడంటే..

రాముడు.. అయోధ్య రాముడు.. మర్యాదా పురుషోత్తముడు.. దుష్టశిక్షణ కోసం ఈ భూమి మీద అవతరించిన శ్రీమన్నారాయణుడు. తరతరాలుగా వేల సంవత్సరాలుగా మనకు భారతీయుల మహోన్నతేతిహాసం రామాయణం చెప్తున్న కథ ఇది.. బోధిస్తున్న ధర్మం ఇది.. నిజంగా రాముడు ఉన్నాడా? రామాయణం వాస్తవంగా జరిగిందేనా? ఇది చరిత్రా..? లేక మిథ్యావాదమా?

sri rama

శ్రీరాముడు

రాముడు పౌరాణిక పాత్ర కాదు.. ఒక చరిత్ర..

ఈ భూమిని పరిపాలించిన గొప్ప పాలకుడు.. 

మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు.. 

ఆయన పుట్టింది నిజం.. పెరిగింది నిజం..

రావణ సంహారం చేసిందీ వాస్తవం..

రామాయణం పుక్కిటి పురాణం కాదు.

భారతాన వేల ఏళ్ల నాడే విలసిల్లిన నాగరికతా మూలం..

రాముడు.. అయోధ్య రాముడు.. మర్యాదా పురుషోత్తముడు.. దుష్టశిక్షణ కోసం ఈ భూమి మీద అవతరించిన శ్రీమన్నారాయణుడు. తరతరాలుగా వేల సంవత్సరాలుగా మనకు భారతీయుల మహోన్నతేతిహాసం రామాయణం చెప్తున్న కథ ఇది.. బోధిస్తున్న ధర్మం ఇది.. నిజంగా రాముడు ఉన్నాడా? రామాయణం వాస్తవంగా జరిగిందేనా? ఇది చరిత్రా..? లేక మిథ్యావాదమా? రాముడు నిజంగా ఈ భూమ్మీద అవతరించి ఉంటే.. రావణ సంహారం చేసి ఉంటే.. ఆయనది చరిత్రే అయితే, ఆయన ఎప్పుడు పుట్టాడు? కాల నిర్ణయం చేయటం సాధ్యమేనా? శ్రీరామచంద్రుడి కాల కథాకథన రహస్యమేమిటి? రామరాజ్యం.. ఇవాళ ప్రపంచం అంతా కోరుకునే ఆదర్శవంతమైన పరిపాలన. భారత దేశం మహేతిహాసాలలో ఒకటిగా భావించే రామాయణంలో శ్రీరామచంద్రుడు సాగించిన పరిపాలన ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా ఈ దేశానికి మార్గదర్శనమైంది. అయితే, రామాయణం ఇతిహాసమేనా? లేక చరిత్రా? శాస్త్రీయంగా లేని నిరూపణలు రామాయణాన్ని ఒక కథగా కొట్టిపారేస్తున్నాయి. శాస్త్రీయతతో సంబంధం లేని విశ్వాసం రాముడి అస్తిత్వాన్ని వాస్తవంగా గుర్తిస్తోంది. గోదావరీ పరీవాహక ప్రాంతం అంతా రామాయణపు ఆనవాళ్లు పరిపరి విధాలుగా రాముడి అస్తిత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఇప్పుడు ఖగోళశాస్త్ర పరిశోధనలు మరింత రామాయణాన్ని చరిత్రగా స్పష్టం చేస్తున్నాయి. రాముడు పుట్టుక.. తేదీతో సహా ఇప్పుడు తేలిపోయింది. అనంత విశ్వంలో నక్షతాలు.. గ్రహాల కదలికలు.. సౌరమండలంలో ఆయా కాలాల ప్రకారం చోటు చేసుకున్న మార్పులు రామాయణ కాలాన్ని నిరూపిస్తున్నాయి.

బ్రిటిష్‌ వాళ్ల పాలనతో మనకు చరిత్రే లేదన్న నిర్ణయానికి వచ్చేశాం... మాక్స్‌ ముల్లర్‌ అనే వాడు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చి భారతీయుల చరిత్ర కేవలం 1500 సంవత్సరాలేనంటే కూడా చాలాకాలం పాటు గుడ్డిగా నమ్ముతూ వచ్చాం. హరప్పా మొహంజదారో నగరాలు బయటపడ్డాక ఈ చరిత్ర కాస్తా 5500 సంవత్సరాలకు పెరిగిపోయింది. బయటి చరిత్రకారులు దశాబ్దాల తరబడి చెప్పుకుంటూ వస్తున్న చరిత్రతోనే మనం రాజీ పడుతూ వస్తున్నాం.. కానీ, ఇప్పుడు ఔత్సాహిక పాశ్చాత్య చరిత్రకారులు.. మన హిస్టారియన్లతో కలిసి మన జాతి మూలాల్లోని అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నకొద్దీ భారతీయుల చరిత్ర, నాగరికతల వేళ్లు వేలు.. లక్షల సంవత్సరాలకు పైబడి లోతుల్లోకి అంతు తెలియకుండా చొచ్చుకుపోతున్నాయి. వాల్మీకి రచించిన రామాయణంలో దాని కాలనిర్ణయం అంతా ఖగోళ సంబంధంగానే ఉంది. అందువల్లే రోదసిలో రాశీచక్రాల ఆధారంగా రాముడు ఎప్పుడు పుట్టిందీ ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవటం వీలవుతోంది. దాని ద్వారా మొత్తం రామాయణ కథా సందర్భాలు చోటు చేసుకున్న తేదీల వివరాలూ గుర్తించటం సాధ్యమైంది.

రామాయణం, రాముడు ఈ రెండు పదాలు పలకకుండా భారత దేశానికి ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా తెల్లారదు. కౌసల్యాసుప్రజారామా అంటూ సుప్రభాతం చదివితేనే కానీ హిందూ దేవుళ్లు మేలుకోరు. భారతదేశ సంస్కృతి రామాయణంతో అంతగా పెనవేసుకుపోవటానికి కారణం ఏమిటి? ఒక కథ... పౌరాణిక గాధ భారతీయులపై వేల సంవత్సరాల పాటు ప్రభావం చూపించటం సాధ్యమేనా? రాముడు నిజంగా పుట్టి వుండకపోతే, ఈ భూమిని పరిపాలించకపోతే, ఆ పరిపాలనా ఫలితాలను ప్రజలు పొంది ఉండకపోతే.. ఇంతకాలం కేవలం ఒక పురాణమో.. ఇతిహాసమో ముద్ర వేయటం సాధ్యమేనా? రాముడు దేవుడా? రామాయణం ఎప్పుడు జరిగింది? ఇవి మిలియన్‌ డాలర్ల పశ్నలు.. మన తరానికి అంతుపట్టని పశ్నలు.. అసలు రామాయణమే లేదని, ఇది కేవలం ఒక మిధ్యావాదమని, కల్పిత కావ్యమే తప్ప, చరిత్ర కాదని చెప్పేవాళ్లు ఎక్కువ మందే వుంటారు, కానీ, రామాయణ కాలం ఇప్పటికే విస్పష్టమైంది.. టైమ్తో సహా తేలింది.. హిందూ కాలమానం ప్రకారం చతుర్యుగ విభజన మేరకు రామాయణం ఉనికి త్రేతాయుగంలో కనిపిస్తుంది. ఒక మహాయుగం అంటే కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలన్నమాట. ఒక చతుర్యుగం మొత్తం 43లక్షల 20వేల సంవత్సరాలలో పూర్తవుతుంది. ఇందులో 4.32 లక్షల సంవత్సరాలు కలియుగం.. దీనికి రెట్టింపు అంటే 8లక్షల 64వేల సంవత్సరాలు ద్వాపరయుగం.. కలియుగానికి మూడు రెట్లు అంటే 12 లక్షల 96 వేల సంవత్సరాలు త్రేతాయుగం, కలియుగానికి నాలుగు రెట్లు అంటే 17 లక్షల 28 వేల సంవత్సరాలు కృతయుగం. ఈ లెక్కల ప్రకారం త్రేతాయుగం ఇవాల్టికి 8 లక్షల 66 వేల 11 సంవత్సరాల క్రితం ముగిసిందన్నమాట. ఆ ప్రకారం రామాయణం ఎనిమిదిన్నర లక్షల సంవత్సరాల క్రితమే జరిగింది. యుగవిభజన ప్రకారం లెక్క వేసుకుంటే రాముడు ఎనిమిదిన్నర లక్షల సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని పరిపాలించాడని ఈ యుగ విభజన చెస్తోంది. ఇన్ని సంవత్సరాల క్రితం నాటి చరిత్రకు ఆనవాళ్లు దొరకటం సాధ్యమేనా? ఈ యుగవిభజన ప్రకారం ఖగోళగమనాన్ని గణిస్తే పునర్వసు నక్షత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో చైత్రశుద్ధ నవమి రోజున రామచంద్రుడు జన్మించాడు. అంటే ఇప్పటికి ఎనిమిది లక్షల మూడువేల 23వ సంవత్సరంలో రామచంద్రుడి జననం జరిగింది. రావణవధ తరువాత ఆయన పదమూడు వేల సంవత్సరాల పాటు భారత దేశాన్ని పరిపాలించాడని వాల్మీకి రామాయణం చెప్తుంది.

దీనికి పూర్తిస్థాయి హేతుబద్ధత ఏమిటి? అంటే హిందూ యుగ ధర్మమే. చతుర్యుగ కాలమానమే ఇందుకు ఏకైక కొలమానం. దీనికి స్పష్టమైన ఆధారాలు చూపించటం కష్టమే. ఈ లెక్కల ప్రకారం 28వ మహా యుగంలో రామాయణం జరిగింది. కానీ, ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం అదే వాల్మీకి రామాయణాన్నే ఆధారం చేసుకుని రాముడి కాలాన్ని నిర్ధారిస్తున్నారు. వారి గణాంకాల ప్రకారం రామాయణ కాలం కేవలం పదివేల సంవత్సరాల క్రితం నాడు జరిగిందేనంటున్నారు. లెక్కలతో సహా వాళ్లు నిరూపిస్తున్నారు. తేదీలతో సహా చెప్తున్నారు. ఈ గణాంకాల లెక్కల్లోనే రాముడు ఈ భూమ్మీద జీవించి ఉన్నాడని చెప్తున్నారు. రామాయణం గురించి, దాని చారిత్రకత గురించి చాలా పరిశోధన జరిగింది. ఆర్కియాలజిస్టులు, సాహిత్యవేత్తలు, చరిత్రకారులు, ఖగోళశాస్త్రవేత్తలు వాల్మీకి రామాయణంలోని మొత్తం 24వేల పద్యాలను అక్షరమక్షరం మధించి నిజాల్ని నిగ్గుతేల్చారు.. ఖగోళశాస్త్రవేత్తల లెక్కల ప్రకారం రామాయణం పదివేల సంవత్సరాలకు పూర్వం జరిగిన వాస్తవం.. ఇందుకు సంబంధించిన ఆధారాలను కార్బన్‌ డేటింగ్తో సహా సైంటిస్టులు నిరూపిస్తున్నారు. భారతదేశంలో రామాయణానికి సంబంధించిన రుజువులు అన్నీ దొరికాయి. ఉత్తర ప్రదేశ్లోని ఫైజాబాద్‌ జిల్లాలోని అయోధ్యలో రాముడి జన్మస్థలాన్ని మొట్టమొదట కనుగొన్నది విక్రమాదిత్యుడు. ఆయనే అయోధ్యలో గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. రామాయణంలో పేర్కొన్న సరయూ నదీతీరం, సాకేతపురి అన్నీ ధృవీకరణ జరిగాయి. ఈ అయోధ్య సరయూ తీరంలోనే ఉంది. అటు లంకలో రావణాసురుడి ఆనవాళ్లు స్పష్టంగా లభించాయి. అన్నింటికీ మించి రాముడు లంకకు నిర్మించిన సేతువు ఇవాళికీ 30 కిలో మీటర్ల మేర మనకు కనిపిస్తూనే ఉంది. ఇది పూర్తిగా మానవ నిర్మితమేనని నాసా కూడా స్పష్టం చేసింది. వీటిని బేస్‌ చేసుకునే రామాయణ కాలనిర్ణయంపై పరిశోధన సాగింది. వాల్మీకి రామాయణంలో రాముడు జన్మించిన నమయాన్ని ఆదికవి వర్ణించిన పద్యాలలో ఆయన జన్మకాలాన్ని నిర్ధారిస్తున్నారు. సరోజ్బాలా, డాక్టర్‌ పివి వర్తక్‌, డాక్టర్‌ సౌరబ్‌ క్వాతా పుష్కర్‌ భట్నాగర్‌ లాంటి ప్రముఖ హిస్టారియన్లు రాముడి పుట్టిన తేదీని కన్ఫర్మ్‌ చేశారు.

‘‘అస్ట్రోమాథ్స్‌ ప్రకారం రామాయణం 9300 సంవత్సరాల క్రితం జరిగింది. వాల్మీకి రామాయణంలోని బాలకాండలోని 19వ సర్గలోని 8, 9 శ్లోకాలు రామజననం గురించి వివరిస్తున్నాయి. ఉత్తరాయణం చైత్ర శుద్ధ నవమి.. పునర్వసు నక్షత్రం. ఆ సమయంలో సూర్యుడు మేషరాశిలో పది డిగ్రీలలో ఉన్నాడు. అంగారకుడు మకరంలో 28 డిగ్రీల కోణంలో, గురువు కర్కాటక రాశిలో 5 డిగ్రీలలో, శుక్రుడు మీన రాశిలో 27 డిగ్రీల్లో, శని తులారాశిలో 20 డిగ్రీ కోణంలో ఉన్నారు. మహాభారత యుద్ధం.. నాటి గ్రహరాశులు ఉన్న పొజిషన్‌ను బట్టి క్రీస్తు పూర్వం 3102లో జరిగినట్లు నిర్ధారణ జరిగింది. మొహంజదారో నగరంలో లభించిన రేడియేషన్‌ ఎఫెక్ట్‌ కూడా దీని కచ్చితత్వాన్ని నిరూపిస్తున్నది. ఈ లెక్కలను ఆధారం చేసుకుని ప్లానెటరీ పొజిషన్ను ఆస్ట్రో సైంటిస్టులు లెక్కిస్తూ వెళ్లారు. దీని ప్రకారం సూర్యుడు, అంగారకుడు, గురువు, శుక్రుడు, శని, రాహువులు బాలకాండలో పేర్కొన్న పొజిషన్లలో ఉన్నారు. ఈ రాశుల సమీకరణ క్రీస్తుపూర్వం 7323 డిసెంబర్‌ 4 దగ్గర ముగుస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్త పివి వర్తక్‌ పూర్తి వివరాలతో ఈ అంశాల్ని నిరూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో మరో శాస్త్రవేత్త పుష్కర్‌ భట్నాగర్‌ కూడా రామజననంపై పరిశోధన చేసినప్పటికీ, పివి వర్తక్‌ రిసెర్చ్‌ కొంత వరకు వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్లు ఎక్కువ మంది నమ్ముతున్నారు’’

ఈ లెక్కలు శ్రీరామచందుడి పుట్టుకను స్పష్టం చేస్తున్నాయి. క్రీస్తుకు పూర్వం 7323 డిసెంబర్‌ నాలుగున మర్యాద పురుషోత్తముడు పుట్టాడు. ఆరోజు సోమవారం, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్య సమయంలో రాముడు జన్మించాడు. ఆ కాలానికి ఇంకా క్రీస్తు శకం ప్రారంభం కాలేదు. క్రీస్తు శకం ప్రారంభమైన తరువాత ఈరోజు నుంచి వెనక్కి లెక్కించుకుంటూ పోతే.. చైత్రమాసం దాదాపుగా డిసెంబర్‌ ప్రాంతంలో వచ్చింది.. అంటే ఇవాళి పాశ్చాత్య క్యాలెండర్‌ జనవరితో ఎలా మొదలవుతున్నదో.. దాదాపు అదే సమయంలో మన నూతన సంవత్సరమూ మొదలయ్యేదనమాట... గత 9300 సంవ త్సరాలలో రాశుల కదలికలు.. అధిక మాసాలతో కలిపి.. ఈ చైత్రమాసం దాదాపు నాలుగు నెలలు ముందుకు జరిగిందని అర్థమవుతున్నది. రాముడి జన్మసమయం నిర్ధారణ కావటంతో.. రామాయణంలోని మిగతా సంఘటనల కాలంపై మరింత స్పష్టత వచ్చింది. రాముడు తొలిసారి ప్రవాసానికి విశ్వామితుడితో వెళ్లిన సమయంలో మూడు గ్రహాలు చంద్రుడి చుట్టూ తిరుగుతూ పాలపుంతను ప్రకాశవంతం చేశాయట.. పురాతత్వ శాఖ పరిశోధనల్లో అయోధ్య నుంచి లంక వరకు బయటపడిన రామాయణ కాలపు ఆనవాళ్లు కూడా ఈ గణాంకాలను బలపరుస్తున్నాయి. రాముడి జన్మసమయం తెలియటంతో పాటు ఆయన ప్రవాస సమయంలో గ్రహరాశుల సమీకరణలు ఆస్ట్రో సైంటిస్టులకు అదనపు ఇన్పుట్ను ఇచ్చింది. దీని ప్రకారం రాముడి జీవితాన్ని సంపూర్ణంగా విశ్లేషించే అవకాశం లభించింది. శ్రీరాముడు సీతాదేవిని తన పదిహేడో ఏట వివాహం చేసుకున్నాడు. మిథిలా నగరంలో క్రీస్తుపూర్వం 7307 ఏప్రిల్‌ ఏదో తేదీన సీతమ్మను రామచంద్రుడు శివధనుస్సును విరిచి వివాహం చేసుకున్నాడు.

వివాహం చేసుకున్న ఏడాదిన్నర కాలానికే రాముడు 14 ఏళ్ల పాటు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. రాముడి తండ్రి దశరథుడి జన్మనక్షత్రమైన రేవతి చుట్టూ రవి, అంగారకుడు, రాహువు తదితర నక్షత్రాలు తిరుగుతున్న సమయం అది. రాజుకు మారకాన్ని సూచించే దశ అది. అదే సమయంలో మూడు గ్రహాలు చంద్రుడి చుట్టూ తిరుగుతూ రాముడికి శుభ సంకేతాన్ని ఇస్తుండటంతో, ఆ ముహూర్తాన్ని రాముడి పట్టాభిషేక ముహూర్తంగా దశరథుడు నిర్ణయించాడు. అయోధ్యకాండ రెండో సర్గలోని 18వ శ్లోకంలో ఈ విషయం ఉంది. కానీ, అది రాజు మరణానికి దారి తీసింది. శత్రువైన రావణ వధ కోసం రాముడు 14 ఏళ్ల వనవాసానికి బయలు దేరాల్సి వచ్చింది. క్రీస్తుపూర్వం 7306వ సంవత్సరం నవంబర్‌ 29న రాముడు సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్లాడు. రాముడు పంచవటిలో ఉన్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. వనవాసం మరో ఏడాదికి పూర్తవుతుందనగా సీతాపహరణం జరిగింది. 7293వ సంవత్సరం ఆగస్టు 7న రావణుడు సీతను అపహరించుకుని వెళ్లాడు. ఆరోజు అమావాస్య, ఆ సమయంలో ఖగోళంలో అంగారకుడు మధ్యలో ఉన్నాడు. ఒకవైపు బుధుడు, శుక్రుడు, మరోవైపు రవి, శని ఉన్నారని రామాయణం చెప్తోంది. ఆరోజు సూర్యగ్రహణం కూడా వచ్చింది. ఆ తరువాత సీతను వెతుక్కుంటూ బయలుదేరిన రామలక్ష్మణులను కలిసిన హనుమంతుడు సీత జాడను తెలుసుకోవటానికి 7292 సెప్టెంబర్‌ 1వ తేదీన లంకలో ప్రవేశించాడు. సెప్టెంబర్‌ 2 సీతాదేవిని దర్శించుకున్నాడు.. అదేరోజు రాత్రి లంకాదహనం జరిగింది. సీతాదేవి జాడ తెలుసుకున్న తరువాత ఇరవై రోజుల్లో ఆయన తిరిగి కిష్కింధకు చేరుకున్నాడు. హనుమంతుడు రోజుకు ముప్ఫై మైళ్లు ప్రయాణించాడట. ఆంజనేయుడు సీత జాడ చెప్పిన వెంటనే రాముడు యుద్ధ సన్నాహాలు చేశాడు. మాఘ శుద్ధ పాఢ్యమి అంటే 7292 అక్టోబర్‌ 2న రామసైన్యం లంకకు బయలు దేరింది, కిష్కింధ అంటే నేటి హంపి, హోస్పేట నుంచి లంకకు సుమారు ఆరువందల మైళ్ల దూరం ఉంటుంది. రోజుకు సుమారు ఇరవై మైళ్ల చొప్పున ఫాల్గుణ శుద్ధ చతుర్దశి అంటే 7292 అక్టోబర్‌ 31న లంకలో వానరసైన్యం ప్రవేశించింది. అంతకు ముందు అక్టోబర్‌ 26 నుంచి 30 మధ్య రోజుల్లో రామసేన సముద్రంపై అసాధారణమైన వారధిని నిర్మించింది.

‘‘రామరావణ యుద్ధం మొదలైంది 7292 నవంబర్‌ 3న.

నవంబర్‌ 7న రావణ సోదరుడు కుంభకర్ణుని రాముడు హతమార్చాడు.

క్రీస్తుపూర్వం 7292 నవంబర్‌ 15న రావణ వధ జరిగింది.

క్రీస్తుపూర్వం 7292 నవంబర్‌ 19కి రాముడి 14 ఏళ్ల వనవాస కాలం ముగిసింది.

అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి అయోధ్యకు డిసెంబర్‌ 6 ఆయన చేరుకున్నారు.

విచిత్రమేమంటే ఆ రోజు కూడా చైత్ర శుక్ల నవమి కావటం’’

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ ఆన్‌ వేదాస్‌ (ఐ-సర్వ్‌) ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5114, జనవరి 10న జన్మించాడు. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త పుష్కర్‌ భట్నాగర్‌ చేసిన గణాంకాలు ఇవి. ఈ లెక్కల ప్రకారం 5077 అక్టోబర్‌ 7న ఖరదూషలతో యుద్ధం చేశాడు. క్రీస్తుపూర్వం 5076, ఏపిల్‌ 6న వాలిని హతమార్చాడు. అదే సంవత్సరం సెప్టెంబర్‌ 12న హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. సెప్టెంబర్‌ 14న వెనక్కి వచ్చేశాడు. 19న రాముడు యుద్ధానికి బయలు దేరాడు. డిసెంబర్‌ 4న రావణ వధ జరిగింది. 30 డిసెంబర్‌ 5076న రాముడు అయోధ్యకు తిరిగి చేరుకున్నాడు. మరో ఖగోళ శాస్త్రవేత్త పి.వి వర్తక్‌ గణాంకాలు రాముడు క్రీస్తుపూర్వం 7323 సంవత్సరం జన్మించినట్లుగా చెప్తున్నాయి. భూమిపై ఐస్‌ ఏజ్‌ ముగిసిన తర్వాత అంటే సుమారు లక్షా 20 వేల సంవత్సరాల క్రితం సముద్రమట్టం ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే 120 మీటర్లు తక్కువ ఎత్తులో ఉండేది. శ్రీలంక, భారత్‌ మధ్య సముద్రమట్టం తేడా సుమారు 6 నుంచి 13 మీటర్లు మాత్రమే. భారత్‌తో లంక కనెక్ట్‌ అయి దాదాపు 16 వేల సంవత్సరాలు అయి ఉండవచ్చని అంచనా. అలాగే వాల్మీకి రామాయణంలోని గ్రహాల స్థానాలను బట్టి పీవీ వర్తక్‌ లెక్కలు వేసుకుంటూ వెళ్లారు. ఈ గణాంకాల ప్రకారంగా రామాయణం క్రీస్తుకు పూర్వం 7323లో సంభవించింది. రాముడి జన్మపట్టికలో జ్యోతిష్యశాస్త్ర వివరణలు పరిశోధకులకు రామాయణ కాలాన్ని నిర్ణయించటంలో బాగా తోడ్పడ్డాయి. రాముడు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు చేరుకుని పట్టాభిషేకం చేసుకునే నాటికి ఆయన వయస్సు 39 సంవత్సరాలు. రాముడి కాల నిర్ణయాన్ని, రామాయణ చరిత్రను సుమారు భారత దేశంలోని 195 ప్రదేశాలు విస్పష్టంగా నిరూపిస్తున్నాయి. అయోధ్యలో, పంచవటిలో, హంపిలో, లంకలో దొరికిన ఆనవాళ్లు.. వాటిపై చేసిన పరిశోధనలు ఈ కాల నిర్ణయంతో సరిపోలుతున్నాయి.. రామాయణం ఇతిహాసమా, చరిత్రా అన్న మీమాంసకు తెరదించే ప్రయత్నాలు ఆస్ట్రో సైంటిస్టులు చాలాకాలంగా చేస్తూనే ఉన్నారు. ఇటు పురాతత్వ వేత్తలు, సాహిత్య, చారిత్రకులు వేల సంఖ్యలో రామాయణ మూలాలను అన్వేషించారు. దాని ఫలితమే.. రాముడి జన్మకాల నిర్ణయం. రామాయణ కాలావధి నిర్ధారణ.

- కోవెల సంతోష్‌ కుమార్‌, ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్