Ayodhya Visit : అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా.. ఈ పూర్తి సమాచారం మీ కోసం

Ayodhya Tour : అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? రామ్ లల్లాను దర్శించుకొని తరించాలనుకుంటున్నారా? ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? శ్రీరాముడిని దర్శించుకొవాలనుకునే వారికి సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని అందిస్తున్నాం.

ayodhya ram lalla
అయోధ్య రామ్ లల్లా

Ayodhya Darshan | బాలరాముడి దర్శనానికి అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనం ఎలా జరుగుతుంది? ఉండటానికి ఏర్పాట్లు ఉంటాయా? అయోధ్యలో పర్యాటక ప్రదేశాలు ఏంటి? తదితర అనుమానాలు చాలామందిలో ఉంటాయి. వారందరి కోసం ఈవార్తలు.కామ్ ప్రత్యేకంగా అందిస్తున్న సమాచారమిది.

అయోధ్యకు ఎలా వెళ్లాలంటే..

ayodhya trains
రైలు మార్గం

రైలు మార్గం: దేశంలోని వివిధ ప్రాంతాలను అయోధ్యకు కలుపుతూ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ రైలు సదుపాయం ఉంది. ప్రతి శుక్రవారం యశ్వంత్‌పూర్ గోరఖ్‌పూర్ రైలు అందుబాటులో ఉంది. ట్రైన్ నంబర్ 15024 యశ్వంత్‌పూర్ నుంచి గురువారం రాత్రి 11.40 గంటలకు ప్రారంభమవుతుంది. ధర్మవరం, అనంతపూర్, కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్ స్టేషన్ల మీదుగా శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాజీపేట జంక్షన్, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఆగుతుంది. మరుసటి రోజు (శనివారం) సాయంత్రం 4.24 గంటలకు అయోధ్య ధామ్ జంక్షన్‌కు చేరుతుంది.

ayodhya flights
విమాన మార్గం

విమాన సదుపాయం: అయోధ్యకు విమాన సదుపాయం కూడా ఉంది. ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్, పాట్నా, పుణె, గ్వాలియర్ తదితర నగరాల నుంచి పలు విమానయాన సంస్థలు అయోధ్యకు విమానాలను నడుపుతున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి ప్రతి మంగళవారం, గురు, శనివారాల్లో స్పైస్ జెట్ ఒక విమానాన్ని నడుపుతోంది. ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్యకు చేరుతుంది. మళ్లీ తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.25 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటుంది.

ayodhya road way
రోడ్డు సదుపాయం

రోడ్డు మార్గం: అయోధ్యకు ఉత్తరాదిలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు మార్గం అనుసంధానించి ఉంది. ఢిల్లీ, ముంబై, జైపూర్ తదితర నగరాల నుంచి వెళ్లవచ్చు. సొంత వాహనంతో పాటు ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లటానికి అవకాశం ఉంది. 1,305 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. హైదరాబాద్ నుంచి అయితే వయా నిజామాబాద్, నాగపూర్, జబల్‌పూర్, రీవా, ప్రయాగ్‌రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవచ్చు. దాదాపు 1,300 కిలోమీటర్లు జాతీయ రహదారిపైనే ప్రయాణం చేయొచ్చు.

అయోధ్యలో వసతి సదుపాయాలు..

జైన ధర్మశాల, రామ్ వైదేహీ మందిర్ ధర్మశాల, కనక్ మహల్, రామ్ హోటల్, రాంప్రస్థ హోటల్, రమిలా కాటేజ్, రామాయణం హోటల్‌లో బస చేయొచ్చు. అద్దె సుమారు రూ.500 నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. ఈ వసతి గృహాలన్నీ ఆలయానికి 3 కిలోమీటర్ల వ్యవధిలోనే ఉంటాయి. అయోధ్యలో మొత్తం శాఖాహారమే. ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేసిన ఆహారం కూడా దొరుకుతుంది.

ayodhya temple
అయోధ్య రామ మందిరం

రామ మందిర దర్శన వేళలు

ఉదయం 7 గంటలకు బాలరాముడి దర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 4 గంటలకు మంగళహారతి ఉంటుంది. ఉదయం 6 గంటలకు శృంగార్ హారతి, ఉదయం 10 గంటలకు శయన హారతి ఉంటాయి. ఫ్రీ హారతి పాస్ కోసం శ్రీరామ జన్మభూమి క్యాంప్ ఆఫీస్‌లో అర గంట ముందు తీసుకోవచ్చు. అందుకు ప్రభుత్వ ఐడీ కార్డు చూపించాలి. హారతి, దర్శనం కోసం ఎలాంటి రుసుం వసూలు చేయరు.

దర్శనం ఎలా ఉంటుందంటే..

రామమందిర సముదాయంలో ప్రధాన ద్వారం నుంచి ఆలయ దూరం దాదాపు 200 మీటర్లు ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులకు వీల్ చైర్ సౌకర్యం ఉంది. ఆలయంలో సింగ్ గేటు ద్వారా 32 మెట్లు ఎక్కి రామాలయంలోకి ప్రవేశించాలి. ఒక దాని తర్వాత మరొకటి.. ఇలా ఐదు మంటపాలు దాటాక 30 అడుగుల దూరం నుంచి గర్భగుడిలో రామ్‌లల్లాను దర్శించుకోవచ్చు. రామాలయంలో ఏలకుల ప్రసాదం ఉచితంగా అందజేస్తారు. దీన్ని యాలకులు, పంచదార కలిపి తయారుచేస్తారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్‌కు వచ్చే సందర్శకులు తిరిగి వచ్చే మార్గంలో వీటిని అమర్చారు. భక్తులు స్వామివారికి ప్రసాదాన్ని అందించవచ్చు. ప్రత్యేక అనుమతితో శాకాహారం, స్వచ్ఛమైన స్వీట్లు, డ్రైఫ్రూట్స్ మొదలైన వాటిని అందించవచ్చు. రామ్ లల్లా భద్రత దృష్ట్యా కొబ్బరికాయ, పూలమాల, అలంకరణ వస్తువులు దేవుడికి సమర్పించటానికి అనుమతి లేదు. ఆలయంలోకి వెళ్లేప్పుడు దర్శన్ మార్గ్‌లోనే లాకర్ సదుపాయం ఉంటుంది. అక్కడ సెల్‌ఫోన్, బ్యాగులు ఉంచి వెళ్లాలి. నగదు, గాజులు వంటి అవసరమైన వస్తువులు మాత్రమే తీసుకెళ్లవచ్చు.

అయోధ్యలో చూడదగ్గ మరిన్ని ప్రదేశాలు

1. హనుమాన్ గర్హి - ఇది హనుమంతుడి ఆలయం. ఇక్కడ విగ్రహం అంజనాదేవి ఒడిలో హనుమంతుడు ఉంటాడు. రామాలయం నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది.

2. చోటీ దేవ్కలి - సీతాదేవి కుటుంబానికి చెందిన ఆలయం ఇది. రామాలయం నుంచి 1 కిలోమీటరు పరిధిలో ఉంటుంది.

3. కనక్ భవన్ - కైకేయి ఈ భవనాన్ని శ్రీరాముడు, సీతకు బహుమతిగా ఇచ్చింది. రామాలయం నుంచి 1 కిలోమీటరు పరిధిలో ఉంటుంది.

4. సీతా రసోయ్ - సీతా దేవి పురాతన వంట గది. రామజన్మభూమి ఉత్తర-పశ్చిమ అంచున ఉంటుంది.

5. సరయూ బీచ్ - అయోధ్యలో 14 పురాతన ఘాట్లు ఉన్నాయి.

ఇంకా మణిరామ్ దాస్ కంటోన్మెంట్, రాంలాలా సదన్, దశరథ్ మహల్, రంగ్ మహల్‌ను కూడా దర్శించుకోవచ్చు. అయోధ్యలోని అన్ని ప్రదేశాలను పూర్తిగా చూడాలంటే 3 రోజుల పాటు ప్లాన్ చేసుకుంటే బెటర్.

మరిన్ని సూచనలు:

- రామాలయ కాంప్లెక్స్ లోపల వ్యక్తిగత వస్తువులు (ఫోన్, వ్యాలెట్, చార్జర్, పెన్, నోట్ బుక్ వంటివి) తీసుకెళ్లలేరు. ప్రాంగణంలోని లాకర్ సదుపాయం ఉచితం.

- నగరం మొత్తానికి ఈ-బస్సులు ప్రారంభం అవుతున్నాయి. గోల్ఫ్ కోర్టు కూడా అందుబాటులో ఉంటుంది. ఒక వ్యక్తికి రూ.50 చార్జి చేస్తారు.

- మార్చి, ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో అయోధ్యను సందర్శించడానికి ఉత్తమ సమయం.

- రామ మందిరంలో వృద్ధులు, దివ్యాంగ భక్తుల కోసం వీల్ చైర్ లిఫ్ట్ ఏర్పాట్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

- అయోధ్యతో పాటు లక్నోలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది అయోధ్య నుండి దాదాపు 152 కిలోమీటర్ల దూరంలో ఉంది.

- రాంలల్లా ఆలయం వెలుపల, అమావాపట్నాలోని మహావీర్ మందిర్ ట్రస్టుకు చెందిన రామ్ రసోయి ఉంది. ఇక్కడ ఆధార్ కార్డును చూపించి ఉచిత ఆహారం పొంవచ్చు.

- రామ మందిరంలో దర్శన సమయంలో కనీసం 5 చెక్ పోస్టులు ఉన్నాయి. భద్రత ఎక్కువగా ఉంటుంది.

- వైద్య సహాయ శిబిరం ఉంది. సమీపంలోనే శ్రీరామ్ హాస్పిటల్ కూడా ఉంది.

- హెల్ప్ లైన్, సహాయం కోసం రామజన్మభూమి పోలీస్ స్టేషన్ నంబర్ 9454403310, లేదా రామజన్మభూమి హెల్ప్ డెస్క్ 05278-292000 ద్వారా సంప్రదించవచ్చు.

శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష

జై శ్రీరాం! జై హనుమాన్!!


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్