వేదాలను అనుసరించి యుగాలు మొత్తం 4. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా, జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి ఉన్నారు.
ప్రతీకాత్మక చిత్రం
వేదాలను అనుసరించి యుగాలు మొత్తం 4. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా, జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి ఉన్నారు.
1. కృతయుగం: నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో నారాయణుడు.. లక్ష్మీదేవి సహితంగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 17,27,000 సంవత్సరాలు. ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాలమరణాలుండవు. ఈ యుగంలో రాజుగా సూర్యుడు, మంత్రిగా గురువు (బృహస్పతి) నియమితులయ్యారు. బంగారానికి అధిపతి గురువు కాబట్టి ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయంగా కనిపించేది. త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు ఎక్కువ కావటంతో వారి సంహారం జరిగింది. అనంతరం త్రేతాయుగం ఆరంభమైంది.
2. త్రేతాయుగం: త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగం కాలం 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం మూడు పాదములపై నడిచింది. త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు. మంత్రిగా శుక్రుడు నియమితులయ్యారు. కుజుడు పురుష కారకుడు యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యం పలుకువాడు రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయామంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది. రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావంతో రాక్షసులను పురిగొలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు, రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు. రాక్షసుల వల్ల, దుర్మార్గుల వల్ల త్రేతాయుగంలో నాలుగింట ఒక భాగం దెబ్బతిన్నది.
3. ద్వాపరయుగం: ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాలం 8,64,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మము 2 పాదములపై నడిచింది. ద్వాపర యుంగలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు నియమితులై పాలన చేశారు. చంద్రుడు గురు గ్రహ వర్గానికి చెందినవాడు. బుధుడు శని వర్గమునకు చెందినవాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగొల్పుతాడు. చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటుమాయం చేస్తాడు.
4. కలియుగం: మన ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగాంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాలం 4,32,000 సంవత్సరాలు. సూర్య సిద్ధాంత ప్రకారము క్రీస్తు పూర్వం 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రిన కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగానికి రాజు శని, మంత్రులు రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంతకాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేస్తున్నారు. నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా కలియుగం ముందుకు నడుస్తుంది. క్రూరం, అసత్యం, అప్రమాణం, అధర్మం, అన్యాయం తలెత్తుతాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు. హింసా సిద్ధాంతం ఎక్కువవుతుంది. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని చెబుతారు.
- శివవాణి