బట్ట తల బాధితుల బాధలు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్‌లో కొత్తగా ఒక ఆయిల్ వచ్చిందని తెలిస్తే చాలు.. ఆ ఆయిల్ కొనేసి జుట్టు వస్తుందేమోనని ఆరాటపడుతుంటారు, ఆశపడుతుంటారు.
ఈవార్తలు, హైదరాబాద్ : బట్ట తల బాధితుల బాధలు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్‌లో కొత్తగా ఒక ఆయిల్ వచ్చిందని తెలిస్తే చాలు.. ఆ ఆయిల్ కొనేసి జుట్టు వస్తుందేమోనని ఆరాటపడుతుంటారు, ఆశపడుతుంటారు. చేయాల్సిన అన్ని రెమెడీస్ ట్రై చేస్తుంటారు. ఓ డాక్టర్ జుట్టు మొలిపిస్తున్నారని ఎవరైనా చెప్పినా, వెంటనే ఆ డాక్టర్ హాస్పిటల్ ముందు పెద్ద క్యూ లైన్ కడతారు. ఇలా బట్టతల బాధితుల ఆశను ఆసరాగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతుంటారు. అలాంటి మోసమే తాజాగా హైదరాబాద్‌లో బయటపడింది. బట్టతలపై జుట్టు వచ్చేలా చేస్తామని పాతబస్తీ ఫతే దర్వాజా కేంద్రంగా సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించగా, నిజమేనని నమ్మి ఎంతోమంది క్యూ కట్టారు.
ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌కి జట్టు మొలిపించానంటూ బిగ్‌బాస్ సెలూన్ ప్రచారం నిర్వహించింది. దాంతో ఆ సెలూన్ ముందు వందల మంది యువకులు క్యూ కట్టారు. వారి బలహీనతను వాడుకున్న సెలూన్ నిర్వాహకులు.. గుండు గీసి గుండుకు కెమికల్స్ పూసారు. దీంతో బాధితులకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. మోసపోయామని గ్రహించిన యువకులు లబోదిబోమంటూ, ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.