సిరిసిల్లా జిల్లా కేంద్రానికి చెందిన ఎర్రం కొమురయ్య (55) ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 8 నెలల నుంచి ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఎర్రం కొమురయ్య
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఈవార్తలు : సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేతన్నలు తెలంగాణ వచ్చాక ఆర్థికంగా నిలదొక్కుకొని, బతుకమ్మ చీరల పనితో చేతిలో కాసిన్ని పైసలు కనిపించేవి. అయితే, ప్రస్తుతం ఉపాధి లేక నేతన్నలు మళ్లీ ఉరికొయ్యకు వేలాడుతున్నారు. గత కొంతకాలంగా ఇలాంటి వార్తలు సిరిసిల్ల వ్యాప్తంగా మళ్లీ వినిపిస్తున్నాయి. సిరిసిల్లా జిల్లా కేంద్రానికి చెందిన ఎర్రం కొమురయ్య (55) ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 8 నెలల నుంచి ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య కమల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయికిరణ్, కూతురు వరలక్ష్మి ఉన్నారు.
మూడు రోజుల కిందటే ఉపాధి లేక.. దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పట్టణంలోని మైసమ్మగల్లికి చెందిన బైరి అమర్ (45), స్రవంతి (40) ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి రూ.80 లక్షల మేర అప్పు ఉండటంతో, ఉపాధి కనిపించక.. దిక్కుతోచక బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి ముగ్గురు పిల్లలను పరామర్శించిన ఎమ్మెల్యే కేటీఆర్.. పిల్లల చదువుకు పూర్తి బాధ్యత, భరోసా తనదేనని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.