||ధరావత్ ప్రీతి Photo: Twitter||
వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ వైద్య విద్యార్థి ధరావత్ ప్రీతి(26) జనగామ జిల్లాలోని స్వగ్రామం గిర్నితండాలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్ నిమ్స్ లో ఐదు రోజులపాటు చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచింది. సోమవారం హైదరాబాదు నుండి ప్రీతి స్వగ్రామంలోని తమ వ్యవసాయం భూమిలో ట్రాక్టర్ తో తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. స్వగ్రామంలో స్థానికులు, బంధువులు, వివిధ పార్టీల నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు పాల్గొని ప్రీతికి కన్నీటి వీడ్కోలు పలికారు. బీజేపీ మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు, జీసీసీ ఛైర్మన్ గాంధీనాయక్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు, పక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రీతికి వీడ్కోలు పలికారు. ప్రీతి పాడెను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మోశారు. ప్రీతి అంత్యక్రియల సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఇక ప్రీతి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు తన కూతురును సైఫ్ చంపేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, చాలా ధైర్యవంతురాలని సీనియర్ సైఫ్ తన కూతురుకు ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని ఆరోపిస్తున్నారు. సీనియర్లు వేధిస్తున్నారని తమతో చెప్పి బాధపడేదని ఆమె సోదరి ఆరోపిస్తున్నారు. ప్రీతి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.