|| ప్రతీకాత్మక చిత్రం ||
ఈవార్తలు, క్రైం న్యూస్ : పెళ్లికి ఒప్పుకోలేదని, ప్రేమను అంగీకరించలేదని చంపేస్తున్న ఘటనలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా, ఓ ప్రేమోన్మాది ఓ యువతిని గొంతు కోసిన ఘటన తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. జిల్లాలోని కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్.. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. అయితే, ఆమెది వేరే మతం కావడంతో పెళ్లి చేసుకుందామని అతడు మతం మార్చుకున్నాడు. అయినా, అమ్మాయి కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో యువతి కూడా పెళ్లికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
అయితే, మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లిన శ్రీనివాస్.. ఆమెపై కత్తితో విరుచుకుపడ్డాడు. గొంతు, చెయ్యి కోసి కిరాతకంగా ప్రవర్తించాడు. అడ్డుకున్న యువతి కుటుంబసభ్యులపైనా దాడికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందటంతో ఘటనాస్థలికి చేరుకొని శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. యువతిని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.