పశ్చిమ బెంగాల్‌లో అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష పడింది. 11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు దోషిగా తేలాడు.
ప్రతీకాత్మక చిత్రం
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని మతిగరాలో గతేడాది మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఒక వ్యక్తికి శనివారం జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. సిలిగురి సబ్ డివిజనల్ కోర్టు మహ్మద్ అబ్బాస్‌కు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో 11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆపై ఆమె తలపై ఇటుకతో నలిపి చంపిన కేసులో అతడు దోషిగా నిర్ధారణ అయ్యాడు.
గత ఏడాది ఆగస్టు 21న మతిగర ప్రాంతంలోని అడవుల్లోని ఓ గుడిసెలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అబ్బాస్‌పై లైంగిక నేరాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒక సంవత్సరం పాటు కొనసాగిన కోర్టు విచారణ తరువాత, నిందితుడికి దోషిగా నిర్ధారించబడింది. శనివారం మరణశిక్ష విధించింది కోర్టు. బాధితురాలి తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
ప్రభుత్వ న్యాయవాది తీర్పును స్వాగతిస్తూ, "నేను మొదటి నుండి ఉరిశిక్షను డిమాండ్ చేస్తున్నాను, దోషికి మరణశిక్ష విధించడమే కాకుండా, బాధితుడి కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని కూడా కోర్టు ఆదేశించింది." అని తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఈ తీర్పును స్వాగతించారు. దోషికి మరణశిక్ష తప్ప మరొకటి తగదని అన్నారు. గత నెలలో కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.