సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పరిశ్రమ మొత్తం తునాతునకల్కెపోయింది. దీంతో పరిశ్రమలో పనిచేసే 19 మంది కార్మికులు దుర్మరణం చెందారు.
పాశమైలారంలో భారీ పేలుడు.. 20 మంది మృతి
హైదరాబాద్, జూన్ 26 (ఈవార్తలు): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పరిశ్రమ మొత్తం తునాతునకల్కెపోయింది. దీంతో పరిశ్రమలో పనిచేసే 19 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి. భారీ పేలుడు సంభవించడంతో కార్మికులు సుమారు 100 విరీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. గాయపడ్డవారిని చందానగర్ ప్రభుత్వాస్పత్రికి, ఇస్నాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 8 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమించాయి. శిథిలాల తొలగింపునకు భారీ క్రేన్‌లు, హైడ్రా మిషన్‌లను రంగంలోకి దించారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కూలిపోవడంతో సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు కష్టపడ్డారు. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలతో పాటు భారీగా విషవాయువులు విడుదలవడంతో పరిసర ప్రాంతాల్లో ఘాట్కెన వాసనలు వ్యాపించాయి. స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతూ తమ ఇళ్లలో దాచుకున్నారు. అప్రమత్తమైన అధికారులు సంఘటన స్థలానికి ఎవరూ రావొద్దని హెచ్చరించారు. ప్రమాదంలో మృతిచెందిన వారిలో కంపెనీ వైఎస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. గోవన్ ప్లాంట్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించింది. ప్రమాద ధాటికి ఆయన కారు నుజ్జునుజ్జయింది. కాగా, మంత్రులు దామోదర రాజనర్సింహా, వివేక్ ఘటనాస్థలిని పరిశీలించారు. పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషన్ దర్యాప్తు చేస్తుందన్నారు. మరోవైపు సిగాచి పరిశ్రమ ఘటన దురదృష్టకరమని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అన్ని విభాగాల అధికారులు సత్వరమే స్పందించారని, ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టల్కెన్ సెల్యులోజ్ అనే పౌడర్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. గత 40 ఏళ్లుగా ఈ సంస్థ పని చేస్తోందని తెలిపారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో సహాయకచర్యల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా డీఆర్‌ఎఫ్ స్పెషల్ సీఎస్, కార్మిక శాఖ సీఎస్‌ను నియమించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేయనుంది. మరోవైపు క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం ఆరాతీస్తున్నారు. అక్కడి పరిస్థితులను మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఘటనాస్థలికి సీఎం వెళ్లనున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే: హరీశ్ రావు
పరిశ్రమల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే పాశమైలారం ప్రమాదం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రావు కలిసి ఆయన పటాన్‌చెరులోని ధ్రువ ఆసుపత్రిలో ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగి 5 గంటలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 150 మంది వరకు కార్మికులు ఉన్నారని, 60 మంది ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఘటనలో మరణించిన కార్మిక కుటుంబాలకు తక్షణమే రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
ప్రమాద ఘటన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఆ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు కార్మికులు ఇంకా పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు తెలియడంతో.. పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించాయి. తమ వారి ఆచూకీ తెలపాలని వేడుకున్నాయి. అయితే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. కాగా, ఘటనపై ప్రధాని మోదీతోపాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పీఎంఆర్‌ఎఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ’తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాం’ అని పేర్కొన్నారు.