మారిటల్ రేప్‌పై కేంద్రం కీలక నిర్ణయం వెల్లడించింది. దాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. దీనిపై ఇప్పటికే అవసరమైన శిక్షలు ఉన్నాయని వివరించింది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ, ఈవార్తలు : మారిటల్ రేప్‌పై కేంద్రం కీలక నిర్ణయం వెల్లడించింది. దాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. దీనిపై ఇప్పటికే అవసరమైన శిక్షలు ఉన్నాయని వివరించింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్‌లో.. ‘మారిటల్ రేప్ అనేది చట్టబద్ధమైన అంశానికి మించి ఉన్న సామాజిక సమస్య. సమాజంలో ప్రత్యక్ష ప్రభావం చూపే అంశం. అందువల్ల దీనిపై నిర్ణయం తీసుకునే ముందు భాగస్వామ్య పక్షాలతో విస్తృత చర్చలు చేపట్టాలి. మైనర్ కాని భార్యను లైంగికంగా బలవంతం చేస్తే అత్యాచారంగా పరిగణించలేం. ఒకవేళ అలా చేస్తే దాంపత్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వివాహ వ్యవస్థలోనూ అవాంతరాలకు దారితీస్తుంది. మారిటల్ రేప్‌ను అత్యాచారంగా పరిగణించే అంశం సుప్రీం కోర్టు పరిధిలోకి రాదు. అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా ఓ నిర్ణయం తీసుకోలేం’ అని కేంద్రం తెలిపింది.
మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావటంతో.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో కేంద్రం తన నిర్ణయాన్ని తాజాగా సుప్రీం కోర్టుకు తెలియజేసింది. అయితే, వివాహం చేసుకున్నంత మాత్రాన మహిళ సమ్మతి తొలగినట్లు కాదని, దాన్ని ఉల్లంఘిస్తే శిక్షలు ఉన్నాయని కేంద్రం వివరణ ఇచ్చింది. దీనికోసం పార్లమెంట్ పరిష్కార మార్గాలు కూడా చూపిందని వెల్లడించింది. మహిళల స్వేచ్ఛ, హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.