ఉత్తర ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హత్రాస్ భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా మృత్యువాతపడ్డారు.
హత్రాస్‌లో తొక్కిసలాట
లక్నో, ఈవార్తలు : ఉత్తర ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హత్రాస్ జిల్లాలోని భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా మృత్యువాతపడ్డారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాటలో రోడ్లపై పడిపోయిన మృతదేహాలను చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భోలే బాబా ప్రసంగం ముగిసిన వెంటనే మహిళలంతా ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించటంతో తొక్కిసలాట జరిగిందని, దాంతో పరిస్థితి అదుపుతప్పి ఘోరం జరిగిందని పోలీసులు వివరించారు. బయటకు వెళ్లేందుకు ఒకే దారి ఉండటంతో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. అదే సమయంలో గేటు బయట వాహనాలు పార్క్ చేసి ఉండటంతో వెళ్లటానికి వీలు కాక.. ఒకరిపైకి ఒకరు తోసుకురావటంతో ఈ దారుణం జరిగిందని పేర్కొన్నారు.
ఘటనపై ప్రధాని మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. మృతులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడినవారికి రూ.50 వేలు అందించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అటు.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.