వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వెంకట్ రెడ్డిపై దాడికి పాల్పడుతున్న రైతులు
వికారాబాద్, ఈవార్తలు : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్థుల అభిప్రాయాన్ని సేకరించేందుకు దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తండాకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్లలో రైతుల దాడికి దిగారు. కలెక్టర్‌పై ఓ మహిళ చేయిచేసుకుంది. కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థులు దాడికి దిగారు. దీంతో ఆయన పొలాల వెంబడి పరుగెత్తి అక్కడి నుంచి పారిపోయారు. రాళ్లు, కర్రలతో రైతులు, గ్రామస్థులు దాడిచేశారు. ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితులను అదుపులోకి తెస్తున్నారు. కలెక్టర్, అధికారులు లగచర్ల వెళ్లే సమయంలో పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.