|| ప్రతీకాత్మక చిత్రం ||
ఈవార్తలు, పెద్దపల్లి : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారణం జరిగింది. తాగిన మైకంలో భర్తను హత్య చేసిందో భార్య. వివరాల్లోకెళితే.. జిల్లాలోని ఓదెల మండలం లంబాడి తండాకు చెందిన తేజానాయక్, కవిత భార్యాభర్తలు. ఇద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది. వీరిద్దరు కలిసే బుధవారం సాయంత్రం మద్యం తాగారు. తాగినంతసేపు బాగానే ఉన్నా, తర్వాత ఇద్దరికీ గొడవ జరిగింది. పరిస్థితి కొట్టుకొనేదాకా వెళ్లింది. కోపంతో రగిలిపోయిన కవిత పిల్లలకు తిండి కూడా పెట్టలేదు. గురువారం పొద్దున ఇంటి నుంచి బయటికి వెళ్లిన తేజానాయక్.. తాగి వచ్చాడు. ఇంటికి వచ్చే సరికి పిల్లలకు అన్నం పెట్టలేదన్న విషయం తెలుసుకొని కవితతో గొడవ పడి, ఇంటి ముందున్న చింత చెట్టు కింద పడుకున్నాడు.
దీంతో విచక్షణ కోల్పోయిన కవిత.. పిల్లలను చితకబాదింది. ఆ కోపంలోనే చెట్టు కింద పడుకున్న భర్త మెడపై గడ్డ పారతో పొడిచింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడని స్థానికులు తెలిపారు. గతంలోనూ ఆమె తన భర్తను గడ్డ పారతో కొట్టిందని, అత్తను కూడా గాయపరిచిందని వెల్లడించారు. పైసల కోసం చిన్న కొడుకును కూడా అమ్మేసిందని వివరించారు. భర్తను చంపిన కవిత.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. మద్యం ఒక కుటుంబాన్ని చిదిమేసిందని, వారి పిల్లలను అనాథలను చేసిందని పేర్కొన్నారు.