|| శ్రద్ధావాకర్, ఆఫ్తాబ్ (ఫైల్ ఫొటో). Photo: Twitter ||
ఈవార్తలు, క్రైం న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్య కేసులో విచారణ అధికారులు 3,000 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పటికే కీలక ఆధారాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ ఆధారాలు, 100 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. వీటి ఆధారంగా చార్జిషీట్‌కు తుది రూపు ఇచ్చారు. అంతేకాదు.. ఆఫ్తాబ్ అంగీకార వాంగ్మూలం, నార్కో పరీక్షల నివేదికను ఈ చార్జిషీట్‌కు జత చేయనున్నారు. ప్రస్తుతం చార్జిషీట్‌పై న్యాయనిపుణులు సమీక్ష చేపట్టారు. ఈ నెల చివరి నాటికి దీనిని కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు, ఆఫ్తాబ్ నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు దక్షిణ ఢిల్లీలోని పలు చోట్ల 13 మానవ ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. వాటి డీఎన్ఏలు శ్రద్ధావాకర్ తండ్రి డీఎన్ఏతో సరిపోలాయి. నిందితుడు ఆఫ్తాబ్.. శ్రద్ధాను హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పడేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఇప్పటికే ఆఫ్తాబ్ ఎప్పటి నుంచో తన కూతురిని హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని శ్రద్ధావాకర్ తండ్రి వికాస్ వాకర్ వాపోయాడు. 2020లో శ్రద్ధా ఫిర్యాదు చేసినప్పుడే చర్యలు తీసుకొని ఉంటే, తన కూతురు చనిపోయి ఉండేది కాదని కన్నీటి పర్యంతమయ్యాడు.