కేరళలోని వాయనాడ్ జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడి 15 మంది మరణించారు.వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
కేరళలోని వాయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడిన పలు ఘటనల్లో శిథిలాల కింద కూరుకుపోయి 15మంది మృతి చెందారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం. వాయనాడ్‌లోని మెప్పాడి, ముబడక్కై, చురల్ మల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో ముబాదక్కైలో మొదటి కొండచరియ విరిగిపడింది. అనంతరం 4గంటల సమయంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనాస్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్యాంపుగా పనిచేసిన పాఠశాల, ఇండ్లు, పాఠశాల బస్సు అన్నీ ముంపునకు గురై మట్టిలో కూరుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చురల్ మాల పట్టణంలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు 400 కుటుంబాలు చిక్కుకుపోయాయి. పలువురికి గాయాలయ్యాయని, పలు ఇళ్లు కొట్టుకుపోయాయని తెలిపారు. ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నష్టాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేయలేమని తెలిపారు.కేరళ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెస్క్యూ ఆపరేషన్‌లో అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను మోహరించినట్లు ముఖ్యమంత్రి పి విజయన్ తెలిపారు.
దీంతో పరిస్థితి మరింత దిగజారవచ్చని చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. పలువురు మంత్రులు వాయనాడ్ చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ రెండు బృందాలు రెస్క్యూ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
కాగా మరో మూడు గంటల్లో కేరళలోని మలప్పురం, కన్నూర్ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు గంటల్లో కేరళలోని కొల్లం, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, మలప్పురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.