ఆసిఫాబాద్ జిల్లా మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. వంట మనిషి లేక రోజువారీ కూలీలతో వంట చేయించడం కనిపించింది. స్టోర్ రూంకు వెళ్లి చూడగా అన్నీ కుళ్లి, బూజు పట్టిన ఆలుగడ్డలు, ఐఎస్ఐ మార్క్ లేని ఉప్పు ప్యాకెట్లు కనిపించాయి.
జంకాపూర్ పాఠశాలలో విద్యార్థులతో ఆసిఫాబాద్ కలెక్టర్
ఆసిఫాబాద్, ఈవార్తలు : రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు రావటం, కుళ్లిన ఆహార పదార్థాలతో వంటలు వండటం వంటి కారణాలతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఇలాగే.. వాంకిడి గురుకులంలో బాలిక తీవ్ర అస్వస్థతకు గురై.. నిమ్స్ దవాఖానలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే, తాజాగా ఆసిఫాబాద్ గురుకులంలో తనిఖీలు చేసిన అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీకి బయర్లు కమ్మాయి.
ఆసిఫాబాద్ జిల్లా మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. వంట మనిషి లేక రోజువారీ కూలీలతో వంట చేయించడం కనిపించింది. స్టోర్ రూంకు వెళ్లి చూడగా అన్నీ కుళ్లి, బూజు పట్టిన ఆలుగడ్డలు, ఐఎస్ఐ మార్క్ లేని ఉప్పు ప్యాకెట్లు కనిపించాయి. మెనూ ప్రకారం పప్పు వండాల్సి ఉండగా, నీళ్ల సాంబార్‌తో సరిపెట్టారు. అడిషనల్ కలెక్టర్ వస్తున్నారని కొన్ని గుడ్లు ఉడికించగా, అవీ కుళ్లిపోయి ఉండటం గమనార్హం. విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫాంలు ఇవ్వలేదని, చలికాలం ప్రారంభమైనా ఇప్పటికీ బ్లాంకెట్లు అందించలేదని తేలింది. ఈ దారుణాలను చూసి అడిషనల్ కలెక్టర్ ఖంగుతిన్నారు.