టీఎస్‌పీఎస్సీ నియామకాలన్నీ పారదర్శకమేనా.. నిందితుల వెనుక పెద్దల హస్తం ఉందా?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)||

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలో తవ్వేకొద్దీ ఆసక్తి అంశాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రంలో వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఉద్యోగార్థులను, నిరుద్యోగులను గందరగోళానికి, అయోమయానికి గురిచేస్తున్నాయి. పేపర్ లీకేజీ అనంతరం ఈ నెల ఐదున జరిగిన ఏఈ పరీక్షతోపాటు, 12న జరుగాల్సిన పరీక్షలను సైతం వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షను సైతం రద్దు చేశారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్ సైతం లీకైనట్టుగా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం టీఎస్‌పీఎస్సీ నియామక తతంగంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశాయి. ఈ అంశాన్ని సీరియర్‌గా తీసుకున్న ప్రభుత్వం సైతం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. సిట్ ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసింది. కీలక ఆధారాలైన నిందితుల సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ ఆడిట్‌కు పంపించింది. ఆడిట్ నివేదిక అందితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ ఆధారాలు లభించే అవకాశం ఉన్నది. ఈ మొత్తం పేపర్ లీకేజీ వ్యవహారంలో కింగ్‌పిన్‌గా వ్యవహరించిన ప్రవీణ్‌కుమార్‌పై వ్యవహార శైలిపైనే తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా ప్రవీణ్ ఉద్యోగం పొందాడు. ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన టీఎస్‌పీఎస్సీలో 2017 నుంచి పనిచేస్తున్నాడు. అనతికాలంలోనే కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా చేరాడు. వివిధ పనులపై కమిషన్ కార్యాలయానికి వచ్చే మహిళా ఉద్యోగార్థులతో సాన్నిహిత్యం పెంచుకొనేవాడు. పేపర్ లీకేజీలో కీలకంగా వ్యవహరించిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గురుకుల పాఠశాల హిందీ టీచర్ రాథోడ్ రేణుకతో కూడా అత్యంత దగ్గరి సాన్నిహిత్యం ఉన్నది. ప్రవీణ్ సెల్‌ఫోన్‌లో అమ్మాయిలతో నగ్న కాలింగ్ లిస్టు చాలా పెద్దగా ఉన్నట్టు వార్తలు రావడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. ఇదే తొలిసారా? ఇంతకు ముందే ఇలాంటి  ఇలాంటి పేపర్ లీకేజీలకు ప్రవీణ్ పాల్పడ్డాడ అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కఠినంగా ఉండే గ్రూప్-1 ప్రాథమిక పరీక్షలోనూ 103 మార్కులు రావడం దాల్ మే కుచ్ కాలా హై అని తెలుస్తున్నది. ఓపెన్ టెన్త్ చదివి తర్వాత ఇతర విద్యార్హతలతో రేణుక ఉద్యోగంపై పొందడంపై కూడా డౌట్లు తలెత్తుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా 2018లో హిందీ టీచర్‌గా రేణుక నియమితులైనప్పుడు కూడా ప్రవీణ్ కమిషనర్ కార్యాలయంలోనే పనిచేస్తున్నాడు. ఆమె కూడా పేపర్ అందించి ఉంటాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. 

టీఎస్‌పీఎస్సీలో నియామకాలన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయా? ఒక్కరు కూడా పేపర్ లీకేజీ దొడ్డిదారిలో ఉద్యోగాలు పొందలేదా? స్త్రీ లోలుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్.. కేవలం రేణుక తమ్ముడి కోసమే పేపర్ లీకేజీ కోసం ఇంత రిస్క్ తీసుకున్నాడా? గతంలో ఇలాంటి వ్యవహారాలకు పాల్పడలేదా? పాల్పడ్డప్పటికీ బయటపడలేదా? ఔట్ సోర్సింగ్‌లో టీఎస్‌పీఎస్సీలో నెట్‌వర్క్ అడ్మిన్‌గా చేరిన ఐటీ నిపుణుడు రాజశేఖర్‌రెడ్డి వ్యవహార శైలిపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీరిద్దరూ కలిసి గతంలో ఇంకా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారోనని సందేహాలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా పరీక్ష పేపర్లు అన్నీ కాన్ఫిడెన్షియల్ రూమ్‌లోని ఓ కంప్యూటర్‌లో ఉంటాయి. కంప్యూటర్ నుంచి పేపర్ లీక్ చేయాలంటే పాస్‌వర్డ్, యూజర్ ఐడీ కావాలి. ఈ సెక్షన్‌కు శంకరలక్ష్మి ఇంచార్జిగా ఉన్నారు. ఆమెకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఆమె డైరీలో నుంచి యూజర్ ఐడీ ప్రవీణ్ దొంగిలించాడనే ఆరోపణలున్నాయి. కాన్ఫిడెన్షియల్ రూమ్‌లోకి వెళ్లడం అంత సులభమా? సాధారణంగా ఒక సంస్థ కంప్యూటర్‌లో ఉన్న సమాచారాన్ని కాపీ చేసుకోవడానికి పెన్‌డ్రైవ్ ఆప్షన్ ఉండదు. అలాంటిది ఉద్యోగార్థుల జీవితాలను మార్చే టీఎస్‌పీఎస్సీలోని కీలక సిస్టంలో పెన్‌డ్రైవ్ ఆప్షన్ ఉండటం, పేపర్లు కాపీ యథేచ్ఛ కాపీ చేసుకోనే పరిస్థితి ఉంటుందా? కమిషన్ కార్యాలయంలో కంప్యూటర్ నెట్‌వర్క్ సెక్యూరిటీ అంత డొల్లగా ఉన్నదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి మాత్రమే ఉన్నారా? లేదా వీరి వెనుక ఇంకా పెద్ద తలకాయల ప్రమేయం ఏమైనా ఉన్నదా? అనే అనుమానాలు కూడా  తలెత్తుతున్నాయి.

ఇంటి దొంగలను ఈశ్వరడైనా పట్టలేడంటారు.. కమిషన్ కార్యాలయంలో ఐదారేండ్లుగా పనిచేస్తున్న ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి పాపం పండి చివరికి పోలీసులకు చిక్కారు. కానీ, దొరకని దొంగలు ఇంకా ఉండవచ్చు. అర్హులు కాకుండా అనర్హులు, దొడ్డిదారిన వచ్చి ఉద్యోగాల్లో చేరిన కొందరు వల్లే ఇలాంటి విపరీత ఘటనలు తలుత్తుతాయి. సంస్థలో చేరిన కొన్ని చెద పురుగులు ఆ వ్యవస్థ మొత్తాన్నే నాశనం పట్టిస్తాయి. పేపర్ లీకేజీలు విద్యార్థులకు, ఉద్యోగార్థులకు కొత్తకాదు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక పేపర్లు లీకయ్యాయి. నియామక ప్రక్రియలోనూ ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి. ఉద్యమాలు, నిరసనలు ఇంతకంటే పెద్ద సంఖ్యలోనే చోటుచేసుకున్నాయి. కానీ, తెలంగాణ సాధన ఉద్యమ నినాదంలో కీలకమైన నియామకాల్లోనే అవకతవకలు జరుగడం ఉద్యోగార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెండ్లీలు చేసుకోకుండా ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కొందరు, వివాహాలై భార్యాబిడ్డలను ఇంటి దగ్గర ఉంచి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగాలకు లీకేజీ వార్తలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని తమకు అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రంలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్న నిరుద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని లీకేజీ వ్యవహారం దెబ్బతీస్తున్నది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్