డీప్ ఫేక్ గుప్పిట్లో సెలబ్రిటీలు
ప్రతీకాత్మక చిత్రం
•ఏఐ డీప్‌ఫేక్‌తో చిత్రాల మార్ఫింగ్
•కట్టడి చేయలేని సోషల్ మీడియా
•ఏం చేయాలో పాలుపోక ఆవేదన
•తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుల ఆశ్రయం
•నకిలీ కంటెంట్ తొలగించాలంటున్న కోర్టులు
•అయినా, ఆగని ఏఐ రాయుళ్ల ఆగడాలు
•చట్టానికి చిక్కితే కఠిన చర్యలు తప్పవు
రష్మిక మందన్నా ఒళ్లు పరిచేసిన చిత్రాలు..
తమన్నాను కాజల్ కిస్ చేసుకున్న వీడియో..
ఓ అనామకుడు అనుష్క నడుముపై చేయి వేసిన క్లిప్..
ఓ హీరో, హీరోయిన్ మంచంపై కూర్చున్న ఫొటో..
నెట్టింట్లో లీలలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు..
ఇవన్నీ నిజాలు కావు.. కానీ నిజం అనిపించే మాయలు
డీప్ ఫేక్‌తో మార్ఫింగులు.. సెలబ్రిటీలకు బుగులు..
రాబోయే కాలంలో మీ ఇంటికి చేరే అసభ్య చిత్రాలు..
ఇప్పటికైనా కట్టడికి ప్రభుత్వం తీసుకోవాలి చర్యలు..
(ఈవార్తలు ప్రత్యేకం)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అందిస్తున్న అపారమైన అవకాశాలకు సమాంతరంగా, దాని దుర్వినియోగం తీవ్రమైన సామాజిక, చట్టపరమైన సమస్యలను సృష్టిస్తోంది. ముఖ్యంగా, కొందరు యువకులు, వ్యక్తులు ఏఐ టూల్స్‌ను ఉపయోగించి ప్రముఖ హీరోయిన్లు, సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకరమైన ధోరణి సెలబ్రిటీ వర్గాలలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
సెలబ్రిటీల ఆందోళన, న్యాయ పోరాటం
తాజాగా రష్మిక మందన్న వంటి ప్రముఖ హీరోయిన్ల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ కావడంతో ఈ సమస్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘నా గుర్తింపును ఎవరో దొంగిలించినట్లు అనిపించింది’ అని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి ఇతర సినీ నటులు కూడా తమ హక్కులను కాపాడుకోవడానికి న్యాయపరమైన చర్యలు చేపట్టారు. ఢిల్లీ, బొంబాయి హైకోర్టులు ఈ కేసులను తీవ్రంగా పరిగణిస్తూ, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఫిర్యాదు అందిన 36 గంటలలోపు తక్షణమే తొలగించాలని ఆదేశిస్తున్నాయి.
చట్టపరమైన పర్యవసానాలు, చర్యలు
భారతదేశంలో డీప్‌ఫేక్‌లను నేరుగా నియంత్రించడానికి నిర్దిష్టమైన చట్టం లేనప్పటికీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం, 2023 వంటి ప్రస్తుత చట్టాల క్రింద ఈ నేరాలపై చర్యలు తీసుకోవచ్చు. 2025లో ప్రతిపాదించిన కొత్త ఐటీ నిబంధనలు డీప్‌ఫేక్ కంటెంట్‌కు ‘ఏఐ-జనరేటెడ్’ అనే లేబుల్ తప్పనిసరి చేశాయి. ఈ నిబంధనలను పాటించని ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్రం చర్యలకు దిగుతోంది.
చట్టాలు ఇవీ.. జాగ్రత్త సుమా!
•ఐటీ చట్టం, 2000 సెక్షన్ 66ఈ (గోప్యత ఉల్లంఘన): ఒక వ్యక్తి ప్రైవేట్ భాగాల చిత్రాలను వారి సమ్మతి లేకుండా ప్రచురించడం లేదా ప్రసారం చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
•ఐటీ చట్టం సెక్షన్ 67/67ఏ (అభ్యంతరకర కంటెంట్): ఎలక్ట్రానిక్ రూపంలో అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రచురించడంపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి.
•భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు:
oసెక్షన్ 319 (వ్యక్తిగత అనుకరణ ద్వారా మోసం): ఏఐని ఉపయోగించి ఒకరిని మోసపూరితంగా అనుకరించడం నేరం.
oసెక్షన్ 356 (పరువు నష్టం): సింథటిక్ మీడియా ద్వారా పరువు నష్టం కలిగించినా చర్యలు వర్తిస్తాయి.
oసెక్షన్ 509 (మహిళల గౌరవానికి భంగం): మహిళల గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో చేసిన చర్యలు ఈ సెక్షన్ కిందకు వస్తాయి.
సైబర్ నేరాలకు పాల్పడే యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. బాధితులు భయపడకుండా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.