సంక్రాంతి విజయాలు.. టాలీవుడ్ గెలిచిందా.. ఓడిందా..?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


||సంక్రాంతి విజయాలు.. టాలీవుడ్ గెలిచిందా.. ఓడిందా..?|| అదేంటి.. పండక్కి వచ్చిన సినిమాలన్నీ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంటే ఓడిపోయింది అనే మాట ఎలా మాట్లాడుతారు అనుకుంటున్నారా..? అందరూ పండక్కి వచ్చిన కలెక్షన్స్ మాత్రమే చూస్తున్నారు.. కానీ ఎలాంటి సినిమాలకు వస్తున్నాయనే విషయం మాత్రం చాలా తక్కువ మంది గమనిస్తున్నారు. ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేసినప్పుడు కానీ.. లేదంటే ఒక అద్భుతమైన కథ వచ్చినప్పుడు దానికి కలెక్షన్స్ వస్తే దర్శక నిర్మాతలకు ఎక్కడలేని సంతోషం ఉంటుంది. అభిమానులు కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని.. మా హీరో ఒక కొత్త కథతో వచ్చాడు అంటూ చెప్పుకుంటారు. కానీ ఈసారి సంక్రాంతి పండక్కి చూసుకుంటే అన్ని పరమ రొటీన్ రొట్ట కథలు మాత్రమే. ఒక్కదానిలో కూడా కొత్త కథ లేదు. ఎన్నో సినిమాల్లో చూసిన పాత రొడ్డ కొట్టుడు మూస ఫార్ములా కథలు.

మొదటి సీన్ చూడగానే చివరి సీన్ ఇదే అని చెప్పగలిగేంత రొటీన్ స్టోరీస్. అలాంటి సినిమాలకు వందల కోట్ల కలెక్షన్స్ వస్తుంటే.. ఆడియన్స్ టేస్ట్ మారిందా లేదంటే మేము కొత్తగా తీయలేం తీసిన రొటీన్ కదలని చూడండి అని దర్శకులు చెప్తున్నారా అనే విషయం అర్థం కావడం లేదు. కావాలంటే వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా కథలను ఒకసారి చూడండి.. ఈ రెండు పూర్తిగా హీరోల ఇమేజ్ పై ఆడుతున్న సినిమాలే. ఇటు వీరసింహారెడ్డిలో బాలకృష్ణతో కత్తులు పట్టించి పాతికేళ్ల నాటి పాత కథను చూపించాడు గోపీచంద్ మలినేని. ఇక వాల్తేరు వీరయ్యలో ఒకప్పటి చిరంజీవిని చూపించి మ్యాజిక్ చేశాడు బాబి. ఈ రెండు సినిమాలకు మొదటి రోజు ఫ్యాన్స్ తప్ప మిగిలిన ఏ ఆడియన్స్ కూడా సూపర్ అని చెప్పలేదు. యావరేజ్ టాక్ తో మొదలైన ఈ సినిమాలు సంక్రాంతి సందర్భంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. 

మరీ ముఖ్యంగా చిరంజీవి సినిమా అయితే 200 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. మరోవైపు తమిళంలో వారసుడు కూడా ఐదారు సినిమాలను మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ ఆ సినిమా ఇప్పటికే 200 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. అజిత్ తునివు సినిమా కూడా అంతే. ఈ సంక్రాంతి సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే రాబోయే దర్శకులు కూడా ఇలాంటి రొటీన్ కథలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని అర్థమవుతుంది. అంటే ఈ విజయాలతో ఇండస్ట్రీ మరో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు మాత్రం కాదు. దీన్ని బట్టి విజయాలు వచ్చాయి సంతోషించాలా లేదంటే ఇండస్ట్రీ మరింత రొటీన్ కథలకు అలవాటు పడుతుందని బాధ పడాలో అర్థం కాని పరిస్థితి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్