Payal Rajput | పాయల్ రాజ్‌పుత్ నటించిన రక్షణ సినిమా విడుదలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా సినిమా విడుదలను ఒప్పుకొనేదే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది.
Payal Rajput | గ్లామరస్ పాత్రలతో పాటు చాలెంజింగ్ పాత్రలు చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వస్తున్న రక్షణ సినిమాలో పాయల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా 2020లోనే షూటింగ్ చేసినా, అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే, ఈ సినిమాను జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇవి పూర్తికాగానే సినిమా ప్రమోషన్లు ప్రారంభించనున్నారు. అయితే, సినిమా విడుదలపై పాయల్ రాజ్‌పుత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది.
‘5డబ్ల్యూస్ పేరుతో షూటింగ్ ప్రారంభించిన సినిమా.. రక్షణ. 2019-20లోనే సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే విడుదల కాలేదు. కానీ, ఈ మధ్య నా సినిమాలు వరుస విజయాలు నమోదు చేసుకుంటుండటంతో దాన్నుంచి లబ్ధి పొందాలని సినిమా మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే, నాకు అందజేయాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదు. పైగా, ప్రమోషన్లకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. వేరే కమిట్‌మెంట్లు ఉండటం వల్ల ప్రమోషన్లకు రాలేనని నా టీమ్ స్పష్టం చేసింది. రాకపోతే తెలుగు సినిమాల నుంచి బ్యాన్ చేస్తామని మేకర్లు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ ప్రమోషన్ కోసం ప్రయత్నించినా వాళ్లు ఒప్పుకోవడం లేదు. నా పేరును, నా ప్రతిష్ఠను దిగజార్చాలని చూస్తున్నారు. ఇది సహించలేనిది. ఈ మధ్య ఓ డిస్ట్రిబ్యూటర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. అందాలను చూపించాలని డిమాండ్ చేశాడు. లేకపోతే మేం సినిమాను ఒప్పుకోం అని హెచ్చరించాడు. వీళ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతున్నా. నాకు చెల్లించాల్సిన బకాయిలు, ఫీజులు చెల్లించకుండా సినిమా విడుదల చేయకూడదని కోర్టును ఆశ్రయించబోతున్నా’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.