మెగా పవర్ స్టార్ అభిమానుల ఆశలపై పవన్ కల్యాణ్ నీళ్లు చల్లారు. బుధవారం పిఠాపురంలో పర్యటించిన డిప్యూటీ సీఎం.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
పిఠాపురం, ఈవార్తలు : చాలా రోజుల నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వెండి తెరపై కనిపించలేదు. ఏపీ ఎన్నికల్లో జనసేనాని బిజీగా ఉన్నారని జనసేన శ్రేణులు, మెగా అభిమానులు కాస్త వెయిట్ చేశారు. ఏపీ ఎన్నికల్లో గెలుపుతో వారిలో కొత్త ఊపు వచ్చింది. గెలిచేశాం.. పదవీ చేపట్టాం.. ఇక మిగిలింది వెండి తెరపై తొందరగా డిప్యూటీ సీఎంను చూడాలన్న కోరికే. కానీ, మెగా పవర్ స్టార్ అభిమానుల ఆశలపై పవన్ కల్యాణ్ నీళ్లు చల్లారు. బుధవారం పిఠాపురంలో పర్యటించిన డిప్యూటీ సీఎం.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పిఠాపురం ప్రజల తీర్పును యావత్తు దేశం చర్చించుకుంటున్నదని వ్యాఖ్యానించారు. పవన్ ప్రసంగిస్తుండగా, కొందరు అభిమానులు ఓజీ.. ఓజీ.. అని అరిచారు. దీంతో ఓజీ.. ఓజీ.. అని తాను సినిమాలు తీసుకుంటూ కూర్చుంటే ప్రజలు క్యా జీ అంటారని అన్నారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. ప్రస్తుతం ప్రజల సేవలో ఉన్నానని చెప్పిన ఆయన.. వీలైనంత త్వరగా ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.
అందువల్ల మరో 3 నెలల వరకు సినిమాలు చేయబోనని, షూటింగ్‌లకు హాజరు కాబోనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే సినిమాలకు ఒప్పుకున్న నిర్మాతలకు క్షమాపణ కూడా కోరినట్లు వెల్లడించారు. వీలున్నప్పుడల్లా రెండు, మూడు రోజులు షూటింగ్‌లకు కేటాయిస్తానని వివరించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ మధ్యలో ఉన్నాయి. రాజకీయాల్లో పవన్ బిజీ కావటంతో ఈ సినిమాల విడుదలకు ఇప్పటికైతే బ్రేక్ పడ్డట్లే.