||తారకరత్న||
మనిషి ఉన్నప్పుడు వాళ్ల విలువ తెలియదు.. పోయిన తర్వాత విలువ తెలుసుకున్నా ఎలాంటి లాభం ఉండదు అంటారు. ఇప్పుడు తారకరత్న విషయంలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బతికి ఉన్నప్పుడు ఎవరు అతడి గురించి పట్టించుకున్నది లేదు.. కుటుంబం కూడా అతని దూరంగా పెట్టింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని సొంత కుటుంబం కూడా చాలా సంవత్సరాల పాటు తారకరత్నతో మాట్లాడలేదు. సొంత తల్లిదండ్రులు కూడా అతడికి దూరంగానే ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి సమయంలో కూడా బాబాయ్ బాలకృష్ణ అబ్బాయికి అన్ని విధాల తోడుగా ఉన్నాడు. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న టైంలో కాలం కాటు వేసింది. 39 సంవత్సరాల వయసులో గుండెపోటుతో తారకరత్న హఠాన్మరణం చెందాడు.
ఆయన బతుకునపుడు అతడి గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ చచ్చిపోయిన తర్వాత వచ్చి అతడు గొప్పనటుడు.. ఒక ధ్రువతార రాలిపోయింది తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ కాకమ్మ కబుర్లు అందరూ మీడియా ముందు బాగానే చెప్పారు అనే విమర్శలు దారుణంగా వస్తున్నాయి. ఎందుకంటే తారకరత్న బతికున్నప్పుడు తనకు ఒక అవకాశం ఇవ్వాలి అంటూ ఎంతో మంది దర్శక నిర్మాతలను అడిగాడు.. తన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్లను కూడా తనతో సినిమా చేయాలంటూ కోరుకున్నాడు.. కానీ ఏ ఒక్కరు కూడా ఆ సమయంలో ముందుకు రాలేదు. అయితే హీరోగా అవకాశాలు ఇవ్వకపోయినా కనీసం ప్రతి నాయకుడిగా కూడా అతన్ని తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు.
అలాంటిది ఈ రోజు తారకరత్న చచ్చిపోయిన తర్వాత ఒక గొప్ప నటుడు.. ఎంతో భవిష్యత్తు ఉండగానే మన మధ్య నుంచి వెళ్లిపోయాడు అంటూ చాలామంది దర్శక నిర్మాతలు మీడియా ముందు చెప్పారు. ఒకవేళ ఆయన అంత గొప్ప నటుడు అయినప్పుడు ఎందుకు బతికున్నప్పుడు అవకాశాలు ఇవ్వలేదు అంటూ అభిమానులు నేరుగా వాళ్లనే ప్రశ్నిస్తున్నారు. కేవలం తారకరత్న విషయంలోనే కాదు గతంలో ఉదయ్ కిరణ్ చచ్చిపోయినప్పుడు కూడా ఇలాంటి ఉత్తుత్తి మాటలే ఎక్కువగా వినిపించాయి. ఉదయ్ ప్రాణాలతో ఉన్నప్పుడు అతడికి ఒక్క అవకాశం ఇవ్వడానికి ఎవరికీ మనసు రాలేదు. చివరికి తనకు అవకాశాలు రావు.. ఇండస్ట్రీలో తనకు ఇంకా నూకలు లేవు అని తెలుసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత కొందరు నిర్మాతలు ఉదయ్ హీరోగా సినిమా చేయాలనుకున్నామని.. త్వరలోనే ఆ సినిమా మొదలవుతుంది అనుకుంటుండగానే సూసైడ్ చేసుకున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. మరికొందరు దర్శకులు కూడా ఉదయ్ కిరణ్ తో సినిమా చేయాలి అనుకుంటున్న సమయంలోనే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ మాటలు చెప్పారు. ఒకవేళ నిజంగా అతనికి అవకాశాలు వచ్చినట్టయితే ఆత్మహత్య చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏముంటుంది అంటూ అభిమానులు నిలదీస్తున్నారు.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చచ్చిపోయినప్పుడు కూడా దర్శక నిర్మాతలు ఇదే అన్నారు. ఏదేమైనా ఒక మనిషి బతికున్నప్పుడు అతడి గురించి మాట్లాడడానికి, పొగడడానికి ఎవరికీ మనసు రాదు. కానీ అతడే చనిపోతే మాత్రం ఆయన అంత గొప్పవాడు లేడు అంటూ ప్రగల్బాలు పలుకుతుంటారు.