అచ్చమైన తెలంగాణ సినిమా.. ఆ కమెడియన్ దర్శకుడిగా సక్సెస్ అవుతాడా..?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారిన జబర్దస్త్ వేణు||

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నేపథ్యంలో సినిమాలు రావడం మరింత ఎక్కువైపోయింది. గతంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమాలు అరుదుగా వచ్చేవి. ఒకవేళ వచ్చినా కూడా ఆర్ నారాయణ మూర్తి లాంటి దర్శకులు మాత్రమే చేశారు. అంతే తప్ప మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇక్కడ బ్యాక్ డ్రాప్ చాలా తక్కువగా కనిపించేది. తెలంగాణ నేపథ్యం అంటే కేవలం కమెడియన్లు, విలన్లకు మాత్రమే చూపించే వాళ్ళు మన దర్శకులు. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి మారింది. ఫిదా, పెళ్లి చూపులు, లవ్ స్టోరీ లాంటి సినిమాల తర్వాత మన దర్శకుల ఆలోచన శైలి మారిపోయింది. 

తాజాగా తెలంగాణ నేపథ్యంలో మరో అందమైన సినిమా రాబోతుంది. దాని పేరు బలగం. ఈ సినిమా దర్శకుడు వేణు ఎల్దండి. ఎవరబ్బా ఈయన అనుకోవచ్చు.. జబర్దస్త్ వేణు అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు ఈ దర్శకుడిని. ఒకవైపు కమెడియన్ గా రాణిస్తూనే.. మరోవైపు కథ రాసుకొని మెగా ఫోన్ పట్టేసాడు వేణు. అందులోనూ దిల్ రాజు లాంటి నిర్మాతను ఒప్పించి ఆయన ప్రొడక్షన్ లోనే మొదటి సినిమాలు చేశాడు ఈ దర్శకుడు. బలగం సినిమా గురించి మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఈ మధ్య ప్రమోషన్స్ కాస్త జోరుగా చేస్తున్నారు. దానికి తోడు ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రియదర్శి లాంటి వర్సటైల్ యాక్టర్ సినిమాలో ఉండడంతో చర్చ బాగానే జరుగుతుంది. అన్నింటికీ మించి ఈ మధ్య ప్రీమియర్ షో వేస్తే దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

మనకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. ఒడిదుడుకులు వచ్చిన చివరికి మనతో పాటు నిలిచేది మన బంధు బలగం మాత్రమే అంటూ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు వేణు. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వేణు.. దర్శకుడిగా ఎలాంటి ముద్ర వేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 3న బలగం సినిమా విడుదల కానుంది. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది కాబట్టి దీనికి సరిపోయినన్ని థియేటర్స్ ఉన్నాయి. ఒకవేళ టాక్ బాగుంటే స్క్రీన్స్ ఇంకా పెంచాలని ఆలోచిస్తున్నారు మేకర్స్. గతంలో వెన్నెల కిషోర్, ఎమ్మెస్ నారాయణ లాంటి కమెడియన్లు దర్శకులుగా మారారు.. కానీ సక్సెస్ అందుకోలేక పోయారు. అదే సమయంలో అవసరాల శ్రీనివాస్ సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వేణు ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్