జానీ మాస్టర్‌పై చిన్మయి బాంబ్!
ప్రతీకాత్మక చిత్రం
సినీ గాయని, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద మరోసారి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ తన పలుకుబడిని ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జానీ మాస్టర్ కేసు చాలా క్లిష్టమైనదని, కొందరు దీన్ని ఇద్దరి సమ్మతితో జరిగిన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చిన్మయి ఆరోపించారు. "ఒక మేజర్ అయిన వ్యక్తి మైనర్ బాలికను లోబరుచుకున్నప్పుడు అది కచ్చితంగా మేజర్‌దే తప్పవుతుంది. బాధితురాలు సహకరించనప్పుడు బెదిరించి లొంగదీసుకోవడం దారుణం" అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై తాను మాట్లాడిన ప్రతిసారి జానీ మాస్టర్ భార్య తనకు ఫోన్ చేసి మాట్లాడవద్దని చెబుతోందని చిన్మయి వెల్లడించారు. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు ఉన్నాయని ఆమె అంటున్నారని తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి కారణంగా జానీ మాస్టర్ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఒకవేళ కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వస్తే, ఇక అవార్డుల మీద అవార్డులు వస్తాయని, అతన్ని విమర్శించిన వారే అతని నిర్దోషిత్వం గురించి గొప్పగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. "మైనర్ బాలికలతో శృంగారాన్ని థ్రిల్‌గా భావించే మహానుభావులకు ఈ అంశం మరింత ఉపకరిస్తుంది. భారీ స్థాయిలో విజయోత్సవాలు జరుపుకోవచ్చు. మైనర్లను వేధించి ఎలా తప్పించుకోవాలో వారికి కచ్చితంగా తెలుస్తుంది" అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా, ఆ బాధితురాలైన అమ్మాయి విజయం సాధించాలని తాను ప్రార్థిస్తున్నానని చిన్మయి తెలిపారు. నిందితుడికి శిక్ష పడి, ఆమెకు న్యాయం జరగాలని ఆశిస్తున్నట్లు తన పోస్టులో ముగించారు.