||నందమూరి బాలకృష్ణ Photo: Twitter||
ఈవార్తలు, సినిమా న్యూస్: పాత పాటలు రీమిక్స్ చేయడం అనేది ఇప్పుడున్న ట్రెండ్ కాదు. ఎప్పటినుంచో అది నడుస్తుంది. తమ తండ్రులు తాతల పాటలను వారసులు తమ సినిమాల్లో మళ్లీ వాడుకుంటూ ఉంటారు. అలా సీనియర్ ఎన్టీఆర్ పాటలను జూనియర్ ఎన్టీఆర్.. బాలకృష్ణ పాటలను కళ్యాణ్ రామ్.. చిరంజీవి పాటలను రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ రీమిక్స్ చేశారు. కానీ ఇప్పుడు మన సీనియర్ హీరోలు ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. తమ సినిమాలలో వేరే హీరోల పాటలు ఎందుకు.. తమ పాత పాటలనే మళ్లీ రీమిక్స్ చేస్తే పోతుంది కదా అనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న చిరంజీవి భోళా శంకర్ సినిమాలో చూడాలని ఉంది సినిమాలోని రామ్మా చిలకమ్మా పాటను రీమిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు బాలకృష్ణ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. తారకరత్న హఠాన్మరణం కారణంగా నెల రోజులుగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. మార్చి మొదటి వారంలో మళ్లీ షూటింగుకు వెళ్లనున్నాడు బాలయ్య. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య క్లాసిక్ సాంగ్ ఒకటి రీమిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడికి తన సినిమాలో పాత పాటలు రీమిక్స్ చేయడం అలవాటు. మొదటి సినిమా పటాస్ లో రౌడీ ఇన్స్పెక్టర్ లోని అరె ఓ సాంబ రీమిక్స్ చేశాడు అనిల్. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రెండో సినిమా సుప్రీమ్ లో అందం హిందోళం పాటను రీమిక్స్ చేశాడు ఈ దర్శకుడు.
అలాగే మహేష్ బాబుతో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో అల్లూరి సీతారామరాజు రిఫరెన్సులు బాగానే వాడుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న సినిమాలో సమరసింహారెడ్డి పాటను రీమిక్స్ చేయాలని ఆలోచిస్తున్నాడు ఈ యువ దర్శకుడు. 90ల్లో ఒక ఊపు ఊపిన అందాల ఆడబొమ్మ పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేయాలనేది అనిల్ రావిపూడి ఆలోచన. కథలో ఆ పాటకు సూట్ అయ్యేలా ఒక సందర్భం రావడంతో.. కొత్త పాట ఎందుకు ఆల్రెడీ ఉన్న పాటను రీమిక్స్ చేస్తే సరిపోతుంది కదా అని ఆలోచిస్తున్నారు మేకర్స్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమన్.. బాలయ్యతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. మొత్తానికి ఈ రీమిక్స్ ఎలా ఉండబోతుందో చూడాలిక..!