ఘాటీ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రతీకాత్మక చిత్రం
‘ఘాటీ’ గర్జన
అనుష్క పవర్‌ఫుల్ అవతార్
దుమ్మురేపుతున్న ట్రైలర్
హైదరాబాద్, ఆగస్టు 6 : హీరోయిన్ అనుష్కశెట్టి కన్నెర్రజేసి రౌద్రరూపంలో డైలాగ్ అందుకున్నదంటే ప్రేక్షకులకు పూనకాలే. అనుష్క అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాల్లా తెరపై విజృంభించి ఎన్నాళ్లవుతోందో. స్వీటిని మళ్లీ అలాంటి పాత్రలో చూడాలని ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్నారు. ఆ కరువునంతా ఘాటీ సినిమా తీర్చేలా ఉంది. గతేడాది నవంబరులో విడుదలైన గ్లింప్స్‌తోనే అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చింతకింది శ్రీనివాసరావు రాసిన కథతో అనుష్కశెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఫ్యాన్‌ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బ్రిటిష్ హయాంలో రోడ్లు నిర్మించిన ఘాటీలు గంజాయి స్మగ్లర్లుగా ఎలా మారారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. మాదకద్రవ్యాల మాఫియా నేపథ్యంలో యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా పవర్‌ఫుల్ ప్యాకేజీగా కనిపిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌లో అనుష్క రెండు పార్శ్వాలున్న పాత్రలో ఆకట్టుకున్నది. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలలో అనుష్క చూపించిన వీరోచిత నటనను ఈ సినిమా మరోస్థాయిలో ప్రదర్శించబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కథను నడిపించిన విధానం, ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా ‘సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఇట్టాగే ఉండేదేమో’ వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ప్రతి ఫ్రేమ్‌లో క్రిష్ మార్క్ టేకింగ్ కనిపిస్తోంది. ఈ సినిమాలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు, చైతన్యరావు, రవీంద్ర విజయ్ వంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఘాటీ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌ను, లైక్‌లను సంపాదించుకుంది. ఈ సినిమాతో అనుష్క మరోసారి తన సత్తా చాటుకుంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.