అందుకే వరుస సినిమాలు చేయలేదు: అను ఇమ్మాన్యుయేల్
అను ఇమ్మాన్యుయేల్
ఇన్ని రోజులు సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన అను ఇమ్మాన్యుయేల్.. తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ దుర్గా పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత టాక్సిక్ రిలేషన్స్ ఉన్న ఈ జనరేషన్లో ఇలాంటి ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలి అని అటు అభిమానులు కూడా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతలా ప్రతి ఒక్కరికి ఈ పాత్ర కనెక్ట్ అయిపోయింది. ఈ పాత్రతో అందరిని ఆకట్టుకుంది అను ఇమ్మానుయేల్. ఇదిలా ఉండగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన ఈమె ఇంటర్వ్యూలో పాల్గొని.. ఇన్ని రోజులు ఎందుకు సినిమాలకు దూరంగా ఉంది అనే విషయంపై ప్రస్తావిస్తూ.. ‘‘ఈ సినిమా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక, దీక్షిత్ జంటగా నటించారు. స్త్రీ దృక్కోణం నుండి ఈ కథ వెలువడింది. అమ్మాయిల గురించి మంచిగా చెప్పే సినిమా ఇది. దీనిని వాస్తవంగా వినిపించేలా నేనే డబ్బింగ్ కూడా చెప్పాను. ముఖ్యంగా థియేటర్లలో ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలకు అబ్బాయిలు కూడా చెప్పట్టు కొట్టడం గమనించిన నాకు ఇది చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నా గత చిత్రాల విషయానికి వస్తే.. నేను గడిచిన నా సినిమాల పట్ల ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఒక నటిగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక సంతృప్తి అనేది ఉండాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాగచైతన్య, అల్లు అర్జున్, కార్తి, నాని, శివ కార్తికేయన్ లాంటి పెద్ద స్టార్స్ తో నటించాను. కానీ నా కెరియర్లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే కమర్షియల్ చిత్రాలలో నటించడం వల్ల నటిగా నాకు ఎటువంటి సంతృప్తి లభించలేదు’’ అని చెప్పుకొచ్చింది.