బ్యాంకుల కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాక్ ఇచ్చింది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపునకు ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ.2, ఆర్థికేతర లావాదేవీలకు రూ.1 చొప్పున చార్జీలను వసూలు చేయనుంది.
ఈవార్తలు, న్యూఢిల్లీ: బ్యాంకుల కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాక్ ఇచ్చింది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపునకు ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ.2, ఆర్థికేతర లావాదేవీలకు రూ.1 చొప్పున చార్జీలను వసూలు చేయనుంది. మే 1 నుంచి పెంచిన చార్జీలను అమలు చేయనుంది. అయితే, ఈ నిర్ణయం పరిమిత ఏటీఎం నెట్‌వర్క్ కలిగిన చిన్న బ్యాంకులపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఫీజులను కస్టమర్లపై బ్యాంకులు మోపుతాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఆ చార్జీల భారాన్ని కస్టమర్లపైనే బ్యాంకులు మోపుతాయని అంటున్నారు. గత 10 ఏళ్లుగా ఇంటర్‌చేంజ్ చార్జీలు పెరిగినప్పుడల్లా.. ఆ ఫీజుల భారాన్ని కస్టమర్లపైనే బ్యాంకులు మోపాయి.
ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే..
ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే.. ఏటీఎం సేవలను ఉపయోగించడానికి ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు చెల్లించే చార్జీ. ఈ రుసుం సాధారణంగా లావాదేవీలో ఒక శాతం ఉంటుంది. ఆర్బీఐ జూన్ 2021లో ఇంటర్‌చేంజ్ ఫీజులను సవరించింది. నగదు ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలకు ఇంటర్‌చేంజ్ ఫీజును రూ.17 నుంచి రూ.19కి పెంచగా, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి ఆర్థికేతర లావాదేవీలకు రూ.6 నుంచి రూ.7కి పెంచింది. ప్రస్తుతం మెట్రో ప్రాంతాల్లోని ఒక బ్యాంకు కస్టమర్ ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు, మెట్రోయేతర ప్రాంతాలలో మూడు ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి వీలుంది.