Ola-Uber | ఉబర్ (Uber), ఓలా (Ola) వంటి ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసులకు రద్దీ ఉంటే రేట్లు పెంచుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది. మోటారు వాహన అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
Ola-Uber | ఉబర్ (Uber), ఓలా (Ola) వంటి ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసులకు రద్దీ ఉంటే రేట్లు పెంచుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది. మోటారు వాహన అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం నామమాత్రంగా క్యాబ్ అగ్రిగేటర్లు రద్దీఉన్న సమయాల్లో బేస్ ఛార్జీల్లో సగం సర్‌చార్జీ కింద రెండు రెట్ల వరకు ధరను పెంచుకోవచ్చు. గతంలో ఇది 1.5 రెట్లుగా ఉండేది. ఇప్పుడు దాన్ని రెండు రెట్లకు పెంచారు. అలాగే ఒకవేళ విపరీతమైన రద్దీ ఉంటే సర్ ఛార్జ్‌ను 200 శాతం పెంచుకునేందుకు వీలు కల్పించింది. అంతకముందు ఈ వెలుసుబాటు 150 శాతంగా ఉండేది. అయితే, మూడు కిలోమీటర్లలోపు ప్రయాణించే వారికి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని షరతు పెటింది. అంతేకాదు డ్రైవర్ కారణం లేకుండా రైడ్‌ను రద్దు చేస్తే రూ.100కు మించకుండా లేదా పది శాతం జరిమానా (ఏది తక్కువైతే అది) విధించవచ్చు. రైడ్ వాహనాలకు స్టేట్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించిన లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా ఉండాలి.
ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా బైక్ ట్యాక్సీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మోటార్ వాహాన చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేకపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలంటూ కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ అంశంపై క్యాబ్ సర్వీసు సంస్థలు సవాలు చేయగా.. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థించింది. దాంతో వాటి సేవలు నిలిచిపోయాయి. బైక్ ట్యాక్సీలపై నిషేధం వల్ల గిగ్‌వర్కర్ల జీవితాలు రోడ్డునపడతాయంటూ తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ మోటార్ సైకిళ్లను ఉపయోగించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఆటోలు, బైక్ ట్యాక్సీలు, సహా ఇతర వాహనాలకు బేస్ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకు అందించింది. ఒకవేళ రాష్ట్రాలు బేస్ ఛార్జీలను అధికారికంగా నోటిఫై చేయకపోతే.. ఆ ధరలను ప్రకటించే బాధ్యత అగ్రిగేటర్లదేనని వెల్లడించింది. అలాగే ఆ వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాలని చెప్పింది.
ఇక డ్రైవర్ పికప్‌పాయింట్‌కు చేరుకోవడానికి ప్రయాణించే దూరం అంటే డెడ్ మైలేజ్‌కు ఛార్జీ విధించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే పికప్ పాయింట్ మూడు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్నప్పుడే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ప్రయాణికుల భద్రతను నిర్ధరించేందుకు ఈ క్యాబ్ సంస్థల కింద సేవలు అందించే వాహనాలకు వెహికిల్ లొకేషన్, ట్రాకింగ్ పరికరాలు అమర్చడాన్ని తప్పనిసరి చేసింది. ఈ డేటా ఫీడ్.. ఆ సంస్థలతో పాటు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లకు అందుబాటులో ఉండాలి. దాంతో అత్యవసర పరిస్థితుల్లో సత్వర స్పందనకు వీలు కలుగుతుందని పేర్కొంది.