Rules Change | ఏటీఎం చార్జీల నుంచి రైల్వే వరకు.. నేటి నుంచి మారనున్న రూల్స్‌ ఇవే..!

ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగాల్లో ఎక్కువగా రూల్స్‌ మారుతూ వస్తుంటాయి. ఈ మార్పులతో ప్రజల జీవనశైలి, బడ్జెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మే నుంచి మారనున్న రూల్స్‌ ఏంటో ఓ సారి తెలుసుకుందాం రండి..!

business news
ప్రతీకాత్మక చిత్రం

Rules Change | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల గడిచిపోయింది. ఏప్రిల్‌ ముగిసి మే నెల మొదలైంది. ప్రతి నెలా పలు నిబంధనలు మారనున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగాల్లో ఎక్కువగా రూల్స్‌ మారుతూ వస్తుంటాయి. ఈ మార్పులతో ప్రజల జీవనశైలి, బడ్జెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మే నుంచి మారనున్న రూల్స్‌ ఏంటో ఓ సారి తెలుసుకుందాం రండి..!

ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసే చార్జీల మోతే..

మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి ప్రతినెలా మూడుసార్లు మాత్రమే ఉచితంగా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. నాన్‌ మెట్రో నగరాల్లో ఐదుసార్లు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. ఉచిత పరిమితి దాడితే ప్రతి బ్యాంకు ప్రతి లావాదేవీపై రూ.23 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే, ఓ వినియోగదారుడు ఏటీఎంలో అకౌంట్‌ బ్యాలెన్స్‌ ఎంత ఉందో చెక్‌ చేసుకుంటే రూ.7 చెల్లించాల్సి రానుంది. గతంలో ఈ చార్జీ రూ.6 ఉండేది.  

వెయిటింగ్‌ టికెట్‌తో జనరల్‌ కోచ్‌లోనే ప్రయాణం..

రైల్వే టికెట్‌ బుకింగ్‌ రూల్స్‌ మే ఒకటి నుంచి మారనున్నాయి. ప్రస్తుతం వెయిటింగ్‌ టికెట్లు ఉన్న ప్రయాణికులు జనరల్‌ కోచ్‌లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. వెయిటింగ్‌ టికెట్‌తో స్లీపర్‌, ఏసీ కోచ్‌లలో ప్రయాణించేందుకు అవకాశం ఉండదు. వెయిటింగ్‌ టికెట్లతో ప్రయాణం చేస్తూ టీటీఈకి పట్టుబడితే జనరల్‌ కోచ్‌కు పంపే అవకాశం ఉంది. కొన్నిసార్లు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

ఒకే రాష్ట్రం ఒకే.. ఒక ఆర్‌ఆర్‌బీ విధానం..

ఒకే రాష్ట్రం ఒక ఆర్‌ఆర్‌బీ విధానం నేటి నుంచి అమలులోకి రానున్నది. 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ బ్యాంకులను (RRB) కన్సాలిడేట్‌ చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ సహా 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణకు సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ ఇప్పటికే జారీ చేయగా.. ఈ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2004-05 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఆర్‌బీల నిర్మాణాత్మక ఏకీకరణను ప్రారంభించింది. ఇప్పటి వరకు మూడు దశల్లో 2020-21 నాటికి ఆర్‌ఆర్‌బీల సంఖ్య 196 నుంచి 43కి తగ్గింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు చట్టం-1976లోని సెక్షన్ 23A (1) ప్రకారం, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న ఆర్‌ఆర్‌బీలు ఒకే సంస్థగా మారనున్నాయి.

ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపోరేటును 0.25శాతం తగ్గించింది. దాంతో బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. పలు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేటును సవరించాయి. మారిన నిబంధనలు మే ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లోని సేవింగ్స్‌ ఖాతాదారులకు ఇప్పుడు గరిష్టంగా 7శాతం రేటుతో నెలవారీ వడ్డీ అందించనున్నది. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ఎఫ్‌డీ రేట్లను మార్చినట్లు ప్రకటించింది. సీనియర్‌ సిటిజన్లు ఇప్పుడు ఏడాదికి 0.50శాతం అదనంగా వడ్డీ ఇవ్వనున్నట్ుల చెప్పింది. మహిళా డిపాజిటర్లకు 0.10శాతం అదనంగా చెల్లించనున్నట్లు పేర్కొంది.  

మే నెలలో బ్యాంకులకు 13 రోజులు సెలవులు..

మే నెలలో బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. రెండు, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు కాకుండా రాష్ట్రాల వారీగా వేర్వేరుగా సందర్భాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు. బుద్ధ పూర్ణిమ, మహారాణా ప్రతాప్ జయంతి ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో తెరిచే ఉంటాయి. మే నెలలో మొత్తం బ్యాంకులు 13 రోజులు మాతపడుతాయి. ఈ క్రమంలో బ్యాంకుకు వెళ్లే ముందు సెలవుల జాబితా తెలిసి ఉంటే బెటర్‌. లేకపోతే ఇబ్బందులుపడే అవకాశాలుంటాయి. 

అమూల్ పాల ధర పెరిగింది

పాల ధరను పెంచుతున్నట్లు అమూల్‌ ప్రకటించింది. అమూల్ పాల ఉత్పత్తుల కొత్త ధరలు మే ఒకటి నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా పాల ధరలను లీటర్‌కు రూ.2 పెంచుతున్నట్లు గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది. అన్ని రకాల పాల వేరియంట్స్‌కు ధర పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ఎంఆర్‌పీలో 3-4శాతం ధర పెరుగుతుందని పేర్కొంది. సగటు ఆహార ద్రవ్యోల్బణం కన్నా తక్కువని చెప్పింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్