Law Tip | లైంగిక దాడుల నుంచి మైనర్లకు రక్ష.. పోక్సో చట్టం ఏం చెప్తోందంటే..

పిల్లలపై లైంగిక దాడులను నిరోధించే చట్టమే పోక్సో చట్టం (Posco act). పూర్తి పేరు.. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (Protection of Children from Sexual Offences Act). 2012లో వచ్చిన ఈ చట్టం.

pocso act
ప్రతీకాత్మక చిత్రం

పిల్లలపై లైంగిక దాడులను నిరోధించే చట్టమే పోక్సో చట్టం (Posco act). పూర్తి పేరు.. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (Protection of Children from Sexual Offences Act). 2012లో వచ్చిన ఈ చట్టం. 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపొందించారు. వారిపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులకు మరణశిక్ష విధిస్తారు. అయితే, ఈ చట్టం గురించి చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. దీని గురించి ప్రతి విద్యాసంస్థల్లోనూ అవగాహన కల్పిస్తే చాలావరకూ పిల్లలపై లైంగిక దాడులను అడ్డుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ శాతం నిరక్షరాస్యులే. వారికి ఇటువంటి చట్టాలమీద అవగాహన తక్కువ. పిల్లలను చేర్పించినప్పుడే ఈ చట్టం గురించి అవగాహన కల్పిస్తే మంచిది. టీచర్లు కూడా వాట్ ఈజ్ గుడ్ టచ్, వాట్ ఈజ్ బ్యాడ్ టచ్ అదే దానిపై అవగాహన కల్పించాలి. అసభ్యంగా ప్రవర్తిస్తే ఎలా ఎదుర్కోవాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియజేయాలి.

తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:

1. 18 సంవత్సరాలలోపు బాలిక/బాలుడిపై జరిగే లైంగిక దాడులను నిరోధించే చట్టం. ఇది జండర్ న్యూట్రల్.

2. ఈ చట్టం ప్రకారం ఒక బాలిక/బాలుడు మీద లైంగికదాడి జరిగిందని అనుమానం వచ్చినా ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.

3. ఏదైనా సంస్థలో పిల్లలపై జరిగిన లైంగికదాడిని దాచిపెట్టడం కూడా నేరం. దాచినవారూ శిక్షార్హులు.

4. ఫిర్యాదుకు కాలపరిమితి అంటూ ఏమీ లేదు. సాక్షాధారాలుంటే కొన్ని ఏళ్ల తర్వాతైనా ఫిర్యాదు చేయవచ్చు.

5. ఈ చట్టం ప్రకారం బాధితుల ఐడెంటిటీని గోప్యంగా ఉంచుతారు. కోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతిస్తే తప్ప దాడికి గురైన పిల్లల వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయట పెట్టొద్దు.

తీర్పులు ఇలా..

ప్రస్తుతం POCSO చట్టం కింద నమోదయ్యే కేసులన్నీ FAST TRACK COURTల్లో తీర్పులు ఇస్తున్నారు. నేరస్తుడి వయసును బట్టి న్యాయమూర్తులు శిక్షలు వేస్తున్నారు. కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష అమలుచేస్తున్నారు.

వెబ్ స్టోరీస్