||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, వెదర్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, భువనగిరి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధ, గురువారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 18 నుంచి ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో వానలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వివరించింది. ఈ ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. మరోవైపు ఉత్తర భారతదేశంలో వానలు దంచికొడుతున్నాయి. ఇదిలా ఉండగా, అమెరికాలో భారీ వర్షాలకు 2,600 విమానాలను రద్దు చేశారు. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడవనున్నట్లు అమెరికా అధికార యంత్రాంగం వెల్లడించింది.